ఖర్చు తగ్గింపు.. ఆదాయం పెంపు!
* ఇవే లక్ష్యంగా రైల్వే బడ్జెట్ కసరత్తు!
* ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి
* సౌకర్యాలకు, భద్రతకు పెద్దపీట
* ప్రైవేటు భాగస్వామ్యం, ఎఫ్‌డీఐలను
* అనుమతించడంపై ప్రకటన!
* నేడే సభ ముందుకు రైల్వే బడ్జెట్
న్యూఢిల్లీ: మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్ నేడు సభ ముందుకు రానుంది. రైల్వే మంత్రి సదానంద గౌడ 2014-15 సంవత్సరానికి రైల్వే శాఖ బడ్జెట్‌ను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ప్రమాద రహిత ప్రయాణాలే తన ప్రాథమ్యాలని రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే గౌడ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ దిశగా ఈ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు ఉండొచ్చని భావిస్తున్నారు.
ప్రయాణ, రవాణా చార్జీలను ఇప్పటికే పెంచిన కేంద్ర ప్రభుత్వం.. రైల్వేలు ఎదుర్కొంటున్న నష్టాలను అధిగమించే దిశగా.. అదనపు ఆదాయం లక్ష్యంగా వ్యూహాలకు పదనుపెడుతోంది. ప్రస్తుతం రైల్వే శాఖ రూ. 26 వేల కోట్ల నష్టంలో ఉంది. అందువల్ల ప్రస్తుతం లాభదాయకంగా లేని ప్రాజెక్టులను రద్దు చేయడంతో పాటు.. కొత్తగా పలు ప్రాజెక్టులను ఈ బడ్జెట్‌లో గౌడ ప్రకటించవచ్చు. ఇంధన ధరల భారం రోజురోజుకీ పెరుగుతుండటంతో.. రైల్వేల్లో సౌరశక్తి, బయో డీజిల్ లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. రైల్ టారిఫ్ అథారిటీ, హైస్పీడ్ రైల్ అథారిటీల ఏర్పాటుపై ఎన్‌డీఏ ప్రభుత్వ వైఖరి కూడా ఈ బడ్జెట్‌లో వెల్లడికానుందని సమాచారం. భారీ పెట్టుబడులు అవసరమైన ప్రాజెక్టుల్లో ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేయడం తప్పనిసరైన పరిస్థితుల్లో.. అందరూ లబ్ధి పొందేలా ప్రణాళికలను రైల్వేలు రూపొందించాల్సి ఉంది. రైల్వేల్లో పెట్టుబడులకు ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, ఆ దిశగా ముందుకు వెళ్లాలనుకుంటున్నామని ఇటీవలే ప్రధాని మోడీ ప్రకటించారు.
ఈ బడ్జెట్‌లో వస్తాయని ఆశిస్తున్న అంశాలు:
- నడుస్తున్న రైళ్లలోంచి ప్రమాదవశాత్తు పడిపోవడాన్ని నిరోధించేందుకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో, ముంబై సబర్బన్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేయడం.
- పలు పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్తగా రైళ్లను ప్రారంభించడం.
- హైస్పీడ్ రైల్ వ్యవస్థ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ సహా మౌలిక వసతుల కల్పనకు విదేశీ నిధులను ఉపయోగించుకునేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి.
- హైస్పీడ్ రైళ్ల ‘డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు’ భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన
- నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కోసం అధిక సామర్థ్యం కలిగిన పాల వ్యాగన్లను ప్రారంభించడం.
- ఉప్పు రవాణా కోసం పార్శిల్ వ్యాగన్లు, తక్కువ బరువు కలిగిన వ్యాగన్ల ఏర్పాటు
- వర్క్‌షాపులు, రైల్వే కాలనీలు, రైల్వే ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లలో సౌరశక్తిని వినియోగించేలా చర్యలు.
- రైల్వేలకు చెందిన ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు.. రైళ్ల ఉపరితలంపై సౌర ఫలకాల ఏర్పాటు
- రాయ్‌బరేలీ కోచ్ ఫ్యాక్టరీలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, మరోచోట బయో డీజిల్ ప్లాంటు ఏర్పాటు.
- {పయాణికుల సౌకర్యం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం. రైళ్లలో పాడైపోయిన యంత్ర భాగాలను గుర్తించేందుకు ట్రాక్‌ల వెంట ఎక్స్‌రే యంత్రవ్యవస్థను ఏర్పాటు చేయడం. రైళ్ల, రాబోయే స్టేషన్ల సమాచారం తెలిపేందుకు రైల్వే స్టేషన్లలో, రైళ్లలో జీఐఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ ఏర్పాటు.
ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లోకి రైల్వే శాఖ: గౌడ
సోషల్ మీడియా అనుకూల మోడీ సర్కారులో భాగమైన రైల్వే శాఖ సోమవారం సామాజిక అనుసంధాన వెబ్‌సైట్లు ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో తమ అధికారిక అకౌంట్లను ప్రారంభించింది. సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం పూర్తికాగానే ముఖ్య వివరాలన్నీ ఆ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవుతాయని ఆ కార్యక్రమం సదానంద గౌడ వెల్లడించారు. బడ్జెట్‌లో సమాచార సాంకేతికతకు సముచిత ప్రాధాన్యతనిచ్చానన్నారు. మొత్తం ఒక పేజీని దీనికే కేటాయించానన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 139తో పాటు ప్రత్యేకంగా 022-4501555 ఫోన్ నెంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు.