కేంద్ర, రాష్ట్రాల్లో ఇక మోదీ మార్కు బడ్జెట్లు
- బడ్జెట్ స్వరూపంలో సమూల మార్పులు
- రైల్వే బడ్జెట్‌కు మంగళం.. ఇక సాధారణ బడ్జెట్‌లోనే..
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్రాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లలో ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్కు కనిపించనుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న వార్షిక బడ్జెట్ రూపకల్పన విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నీతి ఆయోగ్ కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ స్వరూపంలో పాతకాలం విధానాలకు స్వస్తి పలకాలని నిర్ణయిం చింది. బడ్జెట్ ఏడాదిలో కూడా మార్పులు చేయాలని యోచిస్తోంది. 27వ తేదీన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశాలను అన్ని రాష్ట్రాలకు వివరించింది. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి మార్చి నెలాఖరు వరకు బడ్జెట్ సంవత్సరం కొనసాగుతోంది. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో బడ్జెట్ సంవత్సరాన్ని జూన్ నుంచి మే వరకు చేయాలా? లేదా జనవరి నుంచి డిసెంబర్ వరకు చేయాలా? అనేదానిపై నీతి ఆయోగ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది.
ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులుండవు!
ప్రస్తుతం బడ్జెట్‌లో కొనసాగుతున్న ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకు స్వస్తి పలకాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ పద్దుల కింద కేటాయింపులు, వ్యయాలు వాస్తవానికి భిన్నంగా ఉన్నాయని కేంద్రం భావించింది. ప్రణాళిక పద్దు కింద కేటాయింపులు, వ్యయాలను ఆస్తుల కల్పనకు, ప్రణాళికేతర పద్దు కింద కేటాయింపులు, వ్యయాలను నిర్వహణ, జీతభత్యాలకని పేర్కొంటున్నారు. వాస్తవానికి ప్రణాళిక పద్దు కింద కూడా నిర్వహణ, జీతభత్యాలు ఉంటున్నాయని, ఇది శాస్త్రీయంగా లేదని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో కేపిటల్, రెవెన్యూ వ్యయం పద్దుల కింద మార్చాలా లేక అభివృద్ధి, అభివృద్ధియేతర పద్దుల కింద మార్చాలా అనేదానిపై నీతి ఆయోగ్ కసరత్తు చేస్తోంది. ఏదిఏమైనా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులనేవి ఉండవని రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఈ పద్దులను మారిస్తే కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి.
పీపీపీ తరహా విమానాశ్రయాలు..
దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న రైల్వే బడ్జెట్‌కు కూడా మంగళం పలకాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర సాధారణ బడ్జెట్ కంటే ముందుగానే రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో భాగంగానే ప్రవేశపెట్టడంపై నీతి ఆయోగ్ కసరత్తు చేస్తోంది. దేశంలో విమాన సేవలను మరింతగా విస్తరిం చడంలో భాగంగా రాష్ట్రాల్లోని రీజియన్స్‌లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో విమానాశ్రయాలను నిర్మించడంతోపాటు విమానాలను నడిపేందుకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ అంశం ఉండనున్నట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. 150 కిలోమీటర్ల దూరం గల రీజియన్స్‌కు విమాన టికెట్ రూ.2,000 నుంచి రూ.2,500 ఉండేలా చర్యలు తీసుకుంటారు. వయబులిటీ గ్యాప్‌లో 80 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.