మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: మమత
నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్
పని చేసేది మేం, పెత్తనం మీదా?
కేంద్రంపై బెంగాల్ సీఎం మండిపాటు
నీతి ఆయోగ్ భేటీలకు రాబోనని ప్రకటన
ఖండించిన కేంద్రం.. విపక్షాల సంఘీభావం
హెడ్‌లైన్లలో నిలిచేందుకే వాకౌట్: బీజేపీ
నితీశ్ గైర్హాజరు, సర్వత్రా అనుమానాలు
న్యూఢిల్లీ/కోల్‌కతా/పటా్న: నీతి ఆయోగ్ సమావేశం రాజకీయ దుమారానికి కారణంగా మారింది. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన ఈ భేటీలో తనకు ఘోర అవమానం జరిగిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మండిపడ్డారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భేటీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలో, ఆ తర్వాత కోల్‌కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఇతర సీఎంలకు 10 నుంచి 20 నిమిషాలు సమయమిచ్చి తనకు మాత్రం 5 నిమిషాలకే మైక్ కట్ చేశారని ఆరోపించారు.
‘‘కేంద్రంపై పెద్దగా ఆశలు లేకపోయినా సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలనే సదుద్దేశంతో భేటీకి వచ్చా. విపక్ష పాలిత రాష్ట్రాల నుంచి హాజరైన ఏకైక సీఎంను నేనే. ఆంధ్రప్రదేశ్ సీఎంకు 20 నిమిషాలిచ్చారు. గోవా, అసోం, ఛత్తీస్‌గఢ్ తదితర సీఎంలకు కూడా 10 నుంచి 12 నిమిషాల దాకా ఇచ్చారు. నన్ను మాత్రం ఐదు నిమిషాల కంటే మాట్లాడనివ్వలేదు. పైగా ఆ ఐదు నిమిషాల్లోనూ పదేపదే బెల్లు కొడుతూ దారుణంగా అవమానించారు. భేటీని పర్యవేక్షించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పదేపదే బెల్లు కొట్టారు. పక్కనే కూర్చున్న మోదీ, కేంద్ర హోం మంత్రి సూచన మేరకే ఆయనలా చేశారు. దీనికి నిరసనగా వాకౌట్ చేశా’’ అని వివరించారు. ఇకపై నీతి ఆయోగ్ భేటీలకు ఎప్పటికీ హాజరు కాబోనని ప్రకటించారు.
మైక్ కట్ చేయలేదు: నిర్మల
మమత ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆమెకు కేటాయించిన సమయం మేరకు పూర్తిగా మాట్లాడారని పేర్కొంది. ‘‘నిజానికి అక్షరక్రమంలో మమత లంచ్ అనంతరం మాట్లాడాల్సింది. కానీ ఆమె అర్జెంటుగా కోల్‌కతా తిరిగి వెళ్లాల్సి ఉందన్న బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతకుముందే ఏడో వక్తగా అవకాశమిచ్చాం. మమతకు కేటాయించిన సమయం పూర్తయిందని కేవలం అందరి ముందూ ఉన్న స్క్రీన్లపై కని్పంచింది.
అంతే తప్ప టైం అయిపోయిందంటూ ఎవరూ బెల్ కూడా మోగించలేదు’’ అని వివరణ ఇచి్చంది. మమత పూర్తి సమయం మేరకు మాట్లాడారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మధ్యలో మైక్ కట్ చేయడం నిజం కాదు. ఎవరెంతసేపు మాట్లాడుతున్నదీ మా ముందున్న స్క్రీన్లపై కనిపిస్తూనే ఉంది. కొందరు సీఎంలు కేటాయించిన సమయం కన్నా ఎక్కువగా మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు అదనపు సమయం కేటాయించాం. అంతే తప్ప ఎవరికీ, ముఖ్యంగా బెంగాల్ సీఎంకు మైకు కట్ చేయలేదు’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కేంద్రానిది రాజకీయ వివక్ష
విపక్ష పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం దారుణమైన రాజకీయ వివక్ష కనబరుస్తోందని మమత ఆరోపించారు. ‘‘ఈ వివక్ష కేంద్ర బడ్జెట్‌లో కూడా కొట్టొచి్చనట్టు కని్పంచింది. ఈ వైనాన్ని భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే లేవనెత్తా. వారికి కొన్ని రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటే ఉండొచ్చు. వాటికి ఎక్కువ నిధులు కేటాయించడంపైనా నాకు అభ్యంతరం లేదు. కానీ బెంగాల్ తదితర రాష్ట్రాలపై మాత్రం ఎందుకిలా వివక్ష చూపు తున్నారని ప్రశ్నించా.
దీనిపై సమీక్ష జరగాలని డిమాండ్ చేశా. అన్ని రాష్ట్రాల తరఫునా భేటీలో మాట్లాడా’’ అని తెలిపారు. ‘‘నీతి ఆయోగ్‌కు ఎలాంటి ఆర్థిక అధికారాలూ లేవు. దానికి అధికారాలన్నా ఇవ్వాలి. లేదంటే ప్రణాళిక సంఘాన్నే పునరుద్ధరించాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ఉపాధి హామీ వంటి పలు కీలక కేంద్ర పథకాల అమలును బెంగాల్లో మూడేళ్లుగా నిలిపేయడాన్ని భేటీలో ప్రస్తావించా. స్వపక్షం, విపక్షాల మధ్య కేంద్రం ఇలా వివక్ష చూపుతుంటే దేశం ఎలా నడుస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు అందరి మేలూ పట్టించుకోవాలి’’ అన్నారు.
అధికార, విపక్షాల పరస్పర విమర్శలు
కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు మమతకు సంఘీభావం ప్రకటించాయి. విపక్ష నేత అ న్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ముఖ్యమంత్రినే ఇంతగా అవమానించడం దారుణమని మండిపడ్డాయి. దీన్ని ఎంతమాత్రమూ అంగీకరించలేమని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్టాలిన్ (తమిళనాడు) సహా విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలు అన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచి్చంది. కేవలం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచేందుకే ముందుగా నిర్ణయించుకుని మరీ మమత ఇలా వాకౌట్ చేశారని కేంద్ర మంత్రులు అర్జున్‌రాం మేఘ్వాల్, ప్రహ్లాద్ జోషీ తదితరులు విమర్శించారు. బెంగాల్ పీసీసీ చీఫ్ అ«దీర్ రంజన్ చౌధరి మాత్రం మమత కావాలనే డ్రామా చేశారంటూ కొట్టిపారేయడం విశేషం.
‘‘సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ అంటే ఇదేనా? సీఎంతో ప్రవర్తించే తీరిదేనా? మన ప్రజాస్వామ్యంలో విపక్షాలు కూడా అంతర్గత భాగమని కేంద్రంలోని బీజేపీ సర్కారు అర్థం చేసుకోవాలి. శత్రువుల్లా చూడటం ఇకనైనా మానుకుంటే మంచిది’’
– తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
‘‘మన దేశంలో పతాక శీర్షికలకు ఎక్కడం చాలా తేలిక. ఏకైక నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న ఏకైక విపక్ష సీఎం నేనే అని ముందుగా చెప్పాలి. బయటికొచ్చి, ‘నా మైక్ కట్ చేశారు. అందుకే బాయ్‌కాట్ చేశా’ అని చెప్పాలి. ఇక రోజంతా టీవీలు దీన్నే చూపిస్తాయి. పని చేయాల్సిన, చర్చించాల్సిన అవసరం లేదు. ఇదీ దీదీ తీరు!’’
– బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్
Comments
Please login to add a commentAdd a comment