వికసిత భారత్ లక్ష్యమనీ, అందుకు వికసిత రాష్ట్రాలు కీలకమనీ కేంద్రం మాట. అందుకు అవరోధంగా రాజకీయంగా వివక్ష కొనసాగుతోందని రాష్ట్రాల ఆరోపణ. అందుకే, రాష్ట్రాల అభివృద్ధి, నిధుల కేటాయింపునకు కీలకమైన నీతి ఆయోగ్ సమావేశంలో బహిష్కరణల పర్వం కొనసాగడం ఆశ్చర్యం అనిపించదు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ భేటీకి ఒకటీ రెండు కాదు... ఏకంగా పది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు.
గత వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌లకు తగినన్ని నిధులు కేటాయించలేదంటూ తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు భేటీని బహిష్కరిస్తే, పశ్చిమ బెంగాల్ పక్షాన హాజరైన ఏకైక ప్రతిపక్ష పాలిత సీఎం మమతా బెనర్జీ సైతం మాట్లాడనివ్వకుండా మైకు ఆపేశారంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనుకున్నట్టే ఆ భేటీ కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాలు, పనితీరు పైన చర్చకు పురిగొల్పింది. కేంద్ర, రాష్ట్రాలు పరస్పర నిందారోపణలు మాని, నిజమైన సమాఖ్య స్ఫూర్తిని పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.
ఈ నీతి ఆయోగ్ వ్యవస్థ ఎన్డీఏ తెచ్చిపెట్టినదే. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. అలా 2015 జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చింది. ప్రణాళికా సంఘమైతే పైన కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏకపక్షంగా విధాన నిర్ణయాలు బట్వాడా చేస్తుందనీ, దానికి బదులు కింది అందరినీ కలుపుకొనిపోతూ, రాష్ట్రాల ఆలోచనలకు పెద్దపీట వేసేందుకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో నీతి ఆయోగ్‌ను పెట్టారంటారు. కానీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నది ప్రధాన విమర్శ.
వరుసగా మూడోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ఈ జూలై 16న నీతి ఆయోగ్ మేధావి బృందాన్ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రధానమంత్రి మోదీ ఛైర్‌పర్సన్‌గా ఉండే ఈ బృందంలో నలుగురు పూర్తికాలిక సభ్యులతో పాటు, ఎన్డీఏలో భాగస్వాములైన బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన 15 మంది కేంద్ర మంత్రుల్ని ఎక్స్–అఫిషియో సభ్యులుగా చేర్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్‌షా తదితరులు అందులో సభ్యులే.
ఒకప్పటి ప్రణాళికా సంఘంలోనూ లోపాలున్నా... గ్రాంట్ల విషయంలో గతంలో రాష్ట్రాలతోసంప్రతింపులకు వీలుండేది. కానీ, ఇప్పుడు గ్రాంట్లపై ఆర్థికశాఖదే సర్వంసహాధికారం. ప్రణాళికా సంఘం ఉసురు తీసి వచ్చిన నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘమైపోయింది. ఎంతసేపటికీ రాష్ట్రాల స్థానాన్ని మదింపు చేయడానికి కీలకమైన సూచికల సృష్టి మీదే దృష్టి పెడుతోంది. రాష్ట్రాలకూ, ఇతర సంస్థలకూ వనరుల పంపిణీ, కేటాయింపులు జరిపే అధికారం లేని వట్టి ఉత్సవ విగ్రహమైంది. వెరసి, కేంద్ర సర్కార్ జేబుసంస్థగా, పాలకుల అభీష్టానికి తలాడించే సవాలక్ష ఏజెన్సీల్లో ఒకటిగా దాన్ని మార్చేశారు. చివరకు ‘సహకార సమాఖ్య’ విధానానికి బాటలు వేస్తుందంటూ తెచ్చిన వ్యవస్థ అనూహ్యంగా ‘పోటాపోటీ సమాఖ్య’ పద్ధతికి దారి తీసింది. చివరకు మేధావి బృందపు పాత్ర ఏమిటన్న దానిపైనా ప్రశ్నలు తలెత్తాయి. వాటికీ సరైన జవాబు లేదు. అపనమ్మకం పెరిగితే వ్యవస్థలో చిక్కులు తప్పవని నీతి ఆయోగ్ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది.
అభివృద్ధికి సంబంధించిన వైఖరుల్లో పరస్పరం తేడాలున్నా, ప్రధానంగా భౌతిక ప్రాథమిక వసతుల నిర్మాణంపైనే అధికంగా ఖర్చు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు సరిపోలేలా రాష్ట్రాలు కృషి చేయాలంటూ నీతి ఆయోగ్ తాజా భేటీలో 20 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతి నిధుల్ని ఉద్దేశించి ప్రధాని నొక్కిచెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు చురుకుగా సాగాలంటే ప్రాథమిక వసతుల నిర్మాణం ప్రాధమ్యాంశమని కేంద్రం ఆలోచన. అందుకే, జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు కేంద్రంతో రాష్ట్రాలు చేతులు కలిపి అటు వసతులకూ, ఇటు సంక్షేమానికీ వనరులు అందు కోవాలని ప్రధాని అంటున్నారు. అయితే, రాష్ట్రాల స్థానిక అవసరాలు, ప్రాధాన్యాలు ఎక్కడికక్కడ వేర్వేరు కాబట్టి, చెప్పినంత సులభం కాదది! పైగా, రాష్ట్రాలన్నిటికీ పెద్దపీటనే మాటకు భిన్నంగా ఆచరణలో పాలకపక్షం తమ ప్రభుత్వాలు ఉన్నచోటనే ప్రేమ చూపిస్తోందనే విమర్శ ఉండనే ఉంది.
కేంద్ర బడ్జెట్‌ను సైతం అదే సరళిలో రాజకీయమయం చేశారని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపి స్తున్నాయి. తమిళనాట చెన్నై మెట్రో రైల్, కేరళలో విళింజమ్ పోర్ట్ సహా పలు కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు నిధులివ్వలేదని ఎత్తిచూపుతున్నాయి. ఈ అనుమానాలు, ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానాలు కేంద్రం వద్ద లేవు. అదే సమయంలో తాగునీరు, విద్యుచ్ఛక్తి, ఆరోగ్యం, పాఠశాల విద్య తదితర అంశాలే అజెండాగా సాగిన ఓ భేటీని బహిష్కరించడం వల్ల రాష్ట్రాలకూ, ప్రజానీకానికే నష్టం. ఆ సంగతి రాష్ట్రాలు గుర్తించాలి. బహిష్కరణను తప్పుబడుతున్న కేంద్ర పెద్దలు కూడా పరి స్థితి ఇంత దాకా ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి.
నీతి ఆయోగ్‌ను రద్దు చేసి, మునుపటి ప్రణాళికా సంఘమే మళ్ళీ తేవాలనే వాదన వినిపిస్తున్న వేళ వ్యవస్థాగతంగానూ, పని తీరులోనూ పాతుకున్న లోపాలను తక్షణం సవరించాలి. నిధులను సక్రమంగా, సమానంగా పంచ డంలో కేంద్ర ఆర్థిక మంత్రి, బడ్జెట్లు విఫలమవుతున్న తీరును మాటలతో కొట్టిపారేస్తే సరిపోదు. పెద్దన్నగా అన్ని రాష్ట్రాలనూ కలుపుకొనిపోతేనే వికసిత భారత లక్ష్యం సిద్ధిస్తుంది. పన్నుల రూపంలో భారీగా కేంద్రానికి చేయందిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలూ ఇదే భారతావనిలో భాగమని గుర్తిస్తేనే అది కుదురుతుంది. అందుకు రాజకీయాలను మించిన విశాల దృష్టి అవసరం.
Comments
Please login to add a commentAdd a comment