న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ మండలి సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా మరో ఇద్దరు సీఎంలు హాజరయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శనివారం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సంబంధిత అధికారులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సమావేశానికి హాజరుకానున్నారు. అయితే పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నీతి ఆయోగ్ మీటింగ్‌కు హాజరుకావడం లేదని సమాచారం.
కాగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లలో బిజీగా ఉన్నందునే కేసీఆర్ ఈ సమావేశానికి వెళ్లడం లేదని పార్టీ సీనియర్ నేత ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ఇక నీతి ఆయోగ్‌కు ఎటువంటి అధికారాలు లేవని, అందుకే తాను కౌన్సిల్ సమావేశానికి హాజరుకాబోనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా ప్రధాని అధ్యక్షుడిగా వ్యవహరించే నీతి ఆయోగ్ పునర్‌వ్యవస్థీకరణకై మోదీ శ్రీకారం చుట్టారు. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేరనున్నారు. ప్రధాన మోదీ చైర్మన్‌గా వ్యవహరించే నీతి ఆయోగ్‌లో కే సరస్వత్, రమేష్ చాంద్, డాక్టర్ వీకే పాల్ సభ్యులుగా ఉంటారు. రాజీవ్ కుమార్ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment