సాక్షి, న్యూఢిల్లీ : సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అన్న తమ ప్రభుత్వ నినాదాన్ని విజయవంతం చేయడంలో నీతి ఆయోగ్‌ది కీలక పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. 2024నాటికి భారత్‌ను ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మలచడమే లక్ష్యమని, ఇది సవాలుతో కూడుకున్న లక్ష్యమైనప్పటికీ.. రాష్ట్రాలు సమగ్రంగా కృషి చేస్తే దీనిని సాధించవచ్చునని ప్రధాని మోదీ అన్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 5వ సమావేశం శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మినహా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘దేశ ఆదాయ పెంపుదల, ఉపాధి కల్పనలో ఎగుమతుల విభాగమే కీలకం. రాష్ట్రాలు ఎగుమతి రంగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించాలి. జల వనరుల వినియోగంలో కొత్తగా ఏర్పాటుచేసిన జల్ శక్తి మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని తీసుకొస్తోంది. నీటి యాజమాన్య పద్ధతులు, నీటి సంరక్షణ, జలవనరుల వినియోగంలో రాష్ట్రాలు వివిధ రకాలుగా చొరవ తీసుకోవాలి. పనితీరు, పారదర్శకత దిశగా ప్రభుత్వ పాలన ఉంటూ చిట్టచివరి వ్యక్తి వరకు ఫలాలు అందేలా కృషి చేయాలి. మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం పనిచేయాలి’ అని అన్నారు.
పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై కలసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి భారతీయుడికి సాధికారత, గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించాల్సిన అవసరముందన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని నిర్దేశించిన లక్ష్యాలను ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీలోగా నెరవేర్చాలన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75వ సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్దేశిత లక్ష్య సాధన దిశగా సాగాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment