న్యూఢిల్లీ: 2047 కల్లా వికసిత భారత్ కలను సాకారం చేసుకోవడంలో రాష్ట్రాలది ప్రధాన పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ‘‘పేదరిక నిర్మూలనే మన లక్ష్యం కావాలి. గ్రామం మొదలుకుని రాష్ట్రస్థాయి దాకా ఆ దిశగా కార్యాచరణ ఉండాలి. ఇందుకు ప్రతి జిల్లా, రాష్ట్రం 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి.
జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయి దాకా వికసిత్ భారత్ ఆకాంక్ష చేరాలి’’ అని సూచించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 9వ భేటీ శనివారం జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు తదితరులు పాల్గొన్నారు. భేటీకి సారథ్యం వహించిన మోదీ మాట్లాడుతూ దేశాభివృద్ధే లక్ష్యంగా పాలనలో కేంద్ర, రాష్ట్రాలు కలిసి సాగాలని అభిలషించారు.
‘‘ఇది సాంకేతిక మార్పుల దశాబ్ది. ఎదిగేందుకు అపారమైన అవకాశాలున్నాయి. వాటిని రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించాలంటే శాంతిభద్రతలు, సుపరిపాలన, మౌలిక సదుపాయాలు చాలా కీలకం. జల వనరుల సమర్థ వినియోగానికి రివర్ గ్రిడ్లు ఏర్పాటు చేసుకోవాలి’’ అని సూచించారు.
ముఖ్యమంత్రులు తమ అవసరాలు, ప్రాథమ్యాలను వివరించారు. పేదరిక నిర్మూలన (జీరో పావరీ్ట) లక్ష్యాలను సాధించిన గ్రామాలను పేదరికరహిత గ్రామాలుగా ప్రకటిస్తామని నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. భేటీలో చర్చించిన విషయాలపై 45 రోజుల్లో ‘విజన్ ఇండియా 2047’ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment