జూలై 8న రైల్వే బడ్జెట్, 10న కేంద్ర బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీ.. జూలై పదో తేదీన తన మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆయన ప్రవేశపెడతారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై ఏడో తేదీన ప్రారంభం కానున్నాయి. ఎనిమిదో తేదీన రైల్వే బడ్జెట్ను రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సర్వే జూలై 9న పార్లమెంటు ముందుకు వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తొలిసారి ఈ బడ్జెట్లను తీసుకొస్తోంది. వాస్తవానికి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 14తో ముగియాల్సి ఉన్నా.. అవి మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందున, దాన్ని పునరుద్ధరించాలంటే కొన్ని 'చేదు మాత్రలు' వేయక తప్పదని కొన్ని రోజుల క్రితమే ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దాన్ని బట్టే ఈసారి పన్నుల వాత తప్పకపోవచ్చనే అంచనాలు ఆర్థికవేత్తల్లో ఉన్నాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే రైల్వే ఛార్జీలు పెంచడం ద్వారా మోతకు సంబంధించిన సూచనలు ఇచ్చారు.