ఇస్రోకు ఇం‘ధనం’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు తన తొలి బడ్జెట్‌లో అంతరిక్ష పరిశోధనలకు పెద్దపీట వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు నిధుల కేటాయింపును తాజా బడ్జెట్‌లో ఒకేసారి 50 శాతం పెంచి రూ.6,000 కోట్లు కేటాయించింది. 2013-14 బడ్జెట్‌లో అంతరిక్ష శాఖకు తొలుత రూ.5,615 కోట్లు కేటాయించారు.
అయితే తర్వాత దానిని రూ.4 వేల కోట్లకు సవరించారు. తాజాగా అంతరిక్ష పరిశోధనలకు రూ.3,545.63 కోట్లు, ఇన్‌శాట్ ప్రాజెక్టుకు రూ.1,412.98 కోట్లు కేటాయించారు. 2014-15 సంవత్సరంలో జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3, పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలతోపాటు మరో రెండు నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
అధిక బరువును మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 రాకెట్ ప్రాజెక్టుకు రూ.378.76 కోట్లు, చంద్రయాన్-2 మిషన్ కొనసాగింపునకు రూ.60 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే గతేడాది ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం అంగారకుడి వైపుగా దూసుకెళుతోందని, ఆ ప్రాజెక్టు కొనసాగింపునకు తాజా బడ్జెట్‌లో రూ.65.93 కోట్లు కేటాయించామని చెప్పారు.
కాగా, శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇటీవల ఐదు విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ఇస్రో నింగిలోకి పంపడం, ఆ ప్రయోగానికి ప్రధాని మోడీ హాజరు కావడం తెలిసిందే. అంతరిక్ష రంగంలో విస్తృత సేవలు అందించేందుకు భారత్‌కు అవకాశాలున్నాయని, భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం కూడా ఇస్రో సాధించాలని ఆ సందర్భంగా సూచించిన మోడీ.. తాజాగా ఇస్రో పరిశోధనలకు ఊతమిచ్చేలా కేటాయింపుల్లో ప్రాధాన్యతను పెంచారు.