అణుశక్తి శాఖకు రూ.10 వేల కోట్లు
అణు విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనలకు ఊతమిచ్చేలాఅరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్‌లో అణుశక్తి శాఖకు రూ.10,446 కోట్లు కేటాయించారు. ఇందులో అణు విద్యుదుత్పత్తికి రూ. 1,709 కోట్లు అందనున్నాయి. ఈ మొత్తంలో రూ.30 కోట్లు కల్పక్కం వద్ద గల భారత తొలి ‘బాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ కోసం కేటాయించారు.
అలాగే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్)కు రూ.203 కోట్లు, భారత నాభికీయ(అణు) విద్యుత్ నిగమ్ లిమిటెడ్(భావిని), మరో రెండు ప్రభుత్వ సంస్థలకు రూ.440 కోట్లు కేటాయింపుల నుంచి అందనున్నాయి. తాజా కేటాయింపుల్లో సింహభాగం రూ.8,737 కోట్లు అణు ఇంధన రంగంలో పరిశోధనలకే ఇచ్చారు.
శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.8 వేల కోట్లు
బడ్జెట్‌లో శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.8,768 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.3,544 కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్‌టీ)కి, రూ.3,707 కోట్లు శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన విభాగం(డీఎస్‌ఐఆర్)కు, రూ.1,517 కోట్లు బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ)కి కేటాయించారు.