న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైమానిక అనుసంధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు విమానాశ్రయాల నిర్మాణం కోసం కొత్త పథకాన్ని ప్రకటించనున్నామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా పెద్ద నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ‘పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)’ విధానంలో ఈ విమానాశ్రయాల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొంది. పౌర విమానయాన శాఖకు గత బడ్జెట్‌లో రూ. 8,502 కోట్లు కేటాయించగా... ఈ సారి 11.4 శాతం అధికంగా రూ. 9,474 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందులో రూ. 6,720 కోట్లను ప్రణాళికా పద్దు కింద ఇవ్వనుండగా.. రూ. 2,754 కోట్లను ప్రణాళికేతర వ్యయం కింద అందజేయనున్నట్లు చెప్పారు.
దేశంలో ఎంతో మందికి విమానం ఎక్కాలనే కోరిక ఇంకా తీరకుండా ఉందన్నారు. అందువల్ల పెద్ద నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ భారీ సంఖ్యలో కొత్త విమానాశ్రయాలను నిర్మించి, విమాన సర్వీసులను పెంచనున్నట్లు తెలిపారు. మొత్తంగా పౌర విమానయాన శాఖకు కేటాయించిన బడ్జెట్‌లో ప్రభుత్వ వైమానిక సంస్థ ఎయిరిండియాకు రూ. 7,069 కోట్లు, విమానాశ్రయాల సంస్థకు రూ. 2,134 కోట్లు, పవన్ హాన్స్ హెలికాప్టర్ల సంస్థకు రూ. 46 కోట్లు ఇవ్వనున్నారు. అయితే ఎయిరిండియాకు గత బడ్జెట్‌లో కంటే కేవలం రూ. 6 కోట్లు మాత్రమే ఎక్కువగా ఇవ్వడం గమనార్హం.
తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ-వీసా.. పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా కేంద్రం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈ-వీసా)ను ప్రవేశపెట్టనుంది. దశలవారీగా దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ-వీసా ప్రక్రియను ప్రవేశపెడతామని జైట్లీ తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను రాబోయే ఆరు నెలల్లో కల్పించనున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల సృష్టిలో పర్యాటక రంగం ఒకటని, ఈ-వీసా సదుపాయం దేశంలో పర్యాటక రంగానికి మరింత ఊపును తెస్తుందని ఆయన చెప్పారు
చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు
Published Fri, Jul 11 2014 3:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement