హోంశాఖకు నిధుల వరద..
కేంద్ర హోం శాఖకు అరుణ్‌జైట్లీ నిధుల వరదను పారించారు. నిరుటి కంటే 11శాతం అధికంగా రూ. 65,745 కోట్లను వివిధ కేటగిరీలలో హోం శాఖకు కేటాయించారు. దీంతో పాటుగా ప్రధాన నగరాల్లో మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళల భద్రత కోసం రూ. 150 కోట్లను కేటాయిస్తున్నట్టు జైట్లీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో సంక్షోభ నియంత్రణ కేంద్రాలను(క్రైసిస్ మేనేజిమెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. వీటి కోసం నిర్భయ ఫండ్ నుంచి నిధులు విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. దేశంలో అతిపెద్ద పారామిలటరీ దళాలైన సీఆర్‌పీఎఫ్‌కు రూ. 12,169.51 కోట్లను ఇస్తున్నట్టు తెలిపారు.
అదే విధంగా భారత్-పాక్, భారత్-బంగ్లా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్ దళాలకు రూ. 11,242.02 కోట్ల ను కేటాయించారు. విమానాశ్రయాలతో పాటు కీలకమైన సంస్థలు, స్థావరాల పరిరక్షణలో భాగస్వామిగా ఉన్న సీఐఎస్‌ఎఫ్‌కు రూ. 4,729 కోట్లను కేటాయించారు. అస్సాం రైఫిల్స్‌కు 3585 కోట్లు, ఐటీబీపీకి 4729 కోట్లు అందనున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరోకి రూ. 1,176 కోట్లు ఇవ్వనున్నారు. ప్రధాని, రాష్ట్రపతి వంటి అత్యంత ప్రముఖులకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌కు 101 కోట్లను జైట్లీ అందించారు. ట్రాఫిక్ కమ్యునికేషన్ నెట్‌వర్క్ కోసం 11.37 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
మావోయిస్టుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి:
దేశంలోని 13 రాష్ట్రాల్లో విస్తరించిన మావోయిస్టులను నియంత్రించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, పోలీసు బలగాలకు అన్నివిధాలా ఆధునిక సదుపాయాలను కల్పించటానికి బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలకు నివాస గృహాలు, ఇతర సదుపాయాల కోసం 1745 కోట్ల రూపాయలను కేటాయించారు. అంతే కాకుండా ఎలాంటి దాడులనైనా ఎదుర్కునేందుకు వీలుగా దుర్భేద్యమైన పోలీసు స్టేషన్ల నిర్మాణానికి మరో 110 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు.