జైట్లీ బడ్జెట్ ‘హల్వా’ ఇదిగో...
న్యూఢిల్లీ: మోడీ సర్కారు తొలి బడ్జెట్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. సంప్రదాయ ‘హల్వా ఉత్సవం’తో బడ్జెటరీ డాక్యుమెంట్ల ముద్రణకు తెరలేచిందని... దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరైనట్లు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ట్విటర్‌లో ట్వీట్ చేసింది. ఒక పెద్ద గిన్నె(కడాయ్)లో హల్వాను తయారు చేసి మొత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖలోని సిబ్బంది అందరికీ పంచడం బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ ఆరంభమైన రోజున అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
హల్వా ఉత్సవం తర్వాత నుంచి లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పించేవరకూ ఆర్థిక శాఖ అధికారులు, బడ్జెట్ తయారీ, ప్రింటింగ్ పక్రియలో నేరుగా పాలుపంచుకునే సంబంధిత సిబ్బంది అంతా నార్త్ బ్లాక్‌లోని కార్యాలయంలోనే ఉండాల్సివస్తుంది. కుటుంబ సభ్యులు, బంధువులందరికీ దూరమైనట్టే. ఫోన్, ఈమెయిల్ తదితర ఎలాంటి కమ్యూనికేషన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో హల్వా తయారు చేసి వాళ్ల నోరు తీపి చేయడం ఆనవాయితీ. కేవలం కొద్దిమంది అత్యంత సీనియర్ అధికారులకు మాత్రమే ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది.
ఆర్థిక క్రమశిక్షణకే బడ్జెట్‌లో ప్రాధాన్యత: జైట్లీ
వచ్చే వారం ప్రకటించనున్న బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తుందని జైట్లీ పేర్కొన్నారు. మతిలేని ప్రజాకర్షక విధానాలకు తెరతీయబోమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవసరమయ్యే సాహసోపేత నిర్ణయాలుంటాయన్నారు
సీఏ అవ్వాలనుకున్నా: యుక్త వయసులో ఉన్నప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) కావాలని అభిలషించినట్లు జైట్లీ తెలిపారు. అయితే సీఏ పరీక్షలో గెలుపొందడం మరీ కష్టతరమన్న ఆలోచనతో న్యాయవాద వృత్తిని ఎంచుకున్నట్లు చెప్పారు.