10న సాధారణ బడ్జెట్
మోడీ సర్కార్ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్రంలో నూతనంగా కొలువుదీరిన మోడీ సర్కారు తమ తొలి బడ్జెట్‌ను జూలై 10న ప్రవేశపెట్టనుంది. 2014-15 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెడ్తారు. జూలై 8న రైల్వే బడ్జెట్‌ను, ఆ మర్నాడు ఆర్థిక సర్వేను ప్రవేశపెడ్తారు. జూలై 7న ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 14న ముగుస్తాయి. మొత్తంమీద ఈ సెషన్‌లో 28 రోజులు సమావేశాలు జరుగుతాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడవు జూలై 31న ముగియనుంది. అందువల్ల ఆ లోపే నూతన బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉంది.
పార్లమెంటు ప్రాంగణంలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చాంబర్‌లో సీసీపీఏ భేటీ అయింది. ఇప్పటికే జారీ అయిన ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రాధాన్యతాక్రమంలో సభ ముందుకు తీసుకురావాలని కూడా సీసీపీఏ భేటీలో నిర్ణయించారని అధికార వర్గాలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలకు సంబంధించి జారీ అయిన ఆర్డినెన్సు, ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిరోధ(సవరణ) ఆర్డినెన్స్, సెబీకి సంబంధించిన ఆర్డినెన్స్, ట్రాయ్ చట్టం(సవరణ) ఆర్డినెన్స్ వాటిలో ఉన్నాయని తెలిపాయి. జూలై మూడో వారంలోగా ఆ ఆర్డినెన్సులను బిల్లులుగా మార్చాల్సి ఉంది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే జరగనుందని ఇటీవలే వెంకయ్యనాయుడు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, బడ్జెట్ సమావేశాల కన్నా ముందే లోక్‌సభలో ప్రతిపక్ష హోదా అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ సుమిత్ర మహాజన్ గతంలో ప్రకటించారు. ఇటీవల పెంచిన రైలు ప్రయాణ, రవాణా చార్జీలపై ప్రతిపక్షాలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవాలని భావిస్తున్నాయి.