మార్కెట్లో బడ్జెట్ పండుగ
సంస్కరణలతో కూడిన పటిష్ట బడ్జెట్‌ను ఆశిస్తున్న ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లతో రెచ్చిపోయారు. దీంతో మార్కెట్లలో నెల తిరక్కుండానే సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 25,850 పాయింట్లను అధిగమిచంగా, నిఫ్టీ 7,725 వద్ద ముగిసింది!
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వర్షాలు, వృద్ధిచోదక బడ్జెట్‌పై అంచనాలు, చల్లబడ్డ ముడిచమురు ధరలూ కలగలసి ఇన్వెస్టర్లలో జోష్‌నింపాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ పెట్టుబడులకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్కసారిగా సెంటిమెంట్ బలపడింది. వెరసి మూడు రోజులుగా పురోగమన బాటలో నడుస్తున్న ప్రధాన ఇండెక్స్‌లు దాదాపు నెల రోజుల తరువాత మళ్లీ సరికొత్త రికార్డులను సృష్టించాయి. 325 పాయింట్ల ‘హై’జంప్ చేసిన సెన్సెక్స్ తొలిసారి 25,841 వద్ద నిలవగా, 90 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 7,725 వద్ద ముగిసింది. కాగా, సెన్సెక్స్ రోజులో గరిష్టంగా 25,864ను అధిగమించగా, నిఫ్టీ 7,732ను తాకింది. ఇవి కూడా కొత్త రికార్డులే!
బడ్జెట్‌పై ఆశలు...
ఈ నెల 10న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ద్రవ్యలోటుకు కళ్లెం వేయడంతోపాటు, ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందన్న అంచనాలు బాగా పెరిగాయి. మతిలేని ప్రజాకర్షక పథకాలకంటే ఆర్థిక వృద్ధికే ప్రాధాన్యత ఇస్తామన్న జైట్లీ వ్యాఖ్యలు ఇందుకు దోహదం చేశాయి. మరోవైపు రుతుపవనాల పురోగమనం కూడా సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. వీటికితోడు బ్రెంట్ ముడిచమురు ధర బ్యారల్‌కు 112 డాలర్ల దిగువకు చేరడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు.
దేశీయంగా జూన్ నెలకు తయారీ రంగం బలపడటం, ఆటో అమ్మకాలు పుంజుకోవడం వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌కు జత కలిశాయని తెలిపారు. ఇక ఆసియాసహా యూరప్, అమెరికా(మంగళవారం రాత్రి) మార్కెట్లు లాభపడటంతో ఉదయం నుంచీ కొనుగోళ్లు పెరిగాయని వివరించారు. వీటన్నిటికితోడు డాలరుతో మారకంలో రూపాయి 38 పైసలు బలపడి 59.69కు చేరడం ద్వారా సానుకూల సంకేతాలు పంపిందని పేర్కొన్నారు.
ఎఫ్‌పీఐల జోరు
గత రెండు రోజుల్లో రూ. 2,144 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరో రూ. 1,291 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీ సంస్థలు రూ. 408 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి.
అన్ని రంగాలూ
అన్ని రంగాలూ లాభపడగా, మెటల్, పవర్, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాలు 2% స్థాయిలో ఎగశాయి.
దిగ్గజాల జోష్
సెసాస్టెరిలైట్, ఎన్‌టీపీసీ, భెల్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ 4-2% మధ్య పుంజుకున్నాయి. ఈ బాటలో ఐటీసీ, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్స్ సైతం 1% స్థాయిలో లాభపడ్డాయి.
నామమాత్రమే...
సెన్సెక్స్ దిగ్గజాలలో కేవలం గెయిల్, ఇన్ఫోసిస్ క్షీణించాయి.
చిన్న షేర్లు ఓకే
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1% స్థాయిలో లాభపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,907 పురోగమిస్తే, 1,157 నష్టపోయాయి.
బీఎస్‌ఈ-500లో...
మిడ్ క్యాప్స్‌లో నోవర్టిస్ 16% దూసుకెళ్లగా, అదానీ పోర్ట్స్, అషాహీ, క్యాస్ట్రాల్, గుజరాత్ గ్యాస్, దీపక్ ఫెర్టిలైజర్స్, శ్రేయీ ఇన్‌ఫ్రా, ఎంసీఎక్స్, గ్రాఫైట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రీవ్స్‌కాటన్ 11-7% మధ్య జంప్ చేశాయి.