రానున్నది సంస్కరణల బడ్జెట్! | Budget reform coming | Sakshi
Sakshi News home page

రానున్నది సంస్కరణల బడ్జెట్!

Published Wed, Jul 2 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

Budget reform coming

ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ  ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లు ఏ విధంగా నడుచుకోనున్నదో ఈ బడ్జెట్ తెలియచేస్తుందని భావిస్తున్నారు. పూర్తిస్థాయి అధికారంలోకి రావడంతో రైల్వే చార్జీలను పెంచడం ద్వారా సంస్కరణల పరంగా ప్రభుత్వ ఉద్దేశాన్ని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ బడ్జెట్‌లో కూడా సంస్కరణల పరంగా పలు నిర్ణయాలుంటాయనేది మార్కెట్ వర్గాల అంచనా.

 ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహిస్తూ, ఇదే సమయంలో ఆర్థిక లోటు గాడి తప్పకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ 2014-15 బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నాం. పెట్టుబడుల ఉపసంహరణ, అధిక పన్ను వసూళ్లు, వేలాల ద్వారా ఆదాయాన్ని పెంచుకొని, పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ప్రణాళికా వ్యయానికి పెద్ద పీట వేయొచ్చు. ఇదే సమయంలో సబ్సిడీలను తగ్గించడం ద్వారా ప్రణాళికేతర వ్యయానికి అడ్డుకట్ట వేస్తారనుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.1 శాతానికి, 2018-19కల్లా 2.5 శాతానికి తగ్గించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. ఐదేళ్లలో జీడీపీ వృద్ధిని 8%కి తీసుకెళ్లాలనేది మోడీ ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది వృద్ధి లక్ష్యం 5.5%గా నిర్దేశించుకోవచ్చు.

 వచ్చే ఏడాది నుంచి జీఎస్‌టీ, డీటీసీ
 సంస్కరణల పరంగా జైట్లీ ఈ బడ్జెట్‌లో పలు స్పష్టమైన సంకేతాలను వెలువరుస్తారనుకుంటున్నాం. ముఖ్యంగా వచ్చే  ఏడాది నుంచి జీఎస్‌టీ, డీటీసీలను అమలు చేసే విధంగా ప్రణాళికలను ప్రకటించొచ్చు. ఇంధన, ఫెర్టిలైజర్స్ సబ్సిడీల్లో ఉండే లీకేజీలకు అడ్డుకట్ట వేస్తూ, సబ్సిడీల భారాన్ని తగ్గించే విధంగా ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తారని అంచనా వేస్తున్నాం. బీమా, పెన్షన్ రంగాల్లో కూడా సంస్కరణలు ఆశిస్తున్నాం. రాజకీయంగా ఒత్తిడి ఉండే కార్మిక సంస్కరణల పరంగా కూడా ఒక అడుగు ముందుకు వేయొచ్చు.

 పెద్ద మార్పులుండవు..
 పన్నుల పరంగా చూస్తే పెద్దగా మార్పులుండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జీఎస్‌టీ, డీటీసీలను దృష్టిలో పెట్టుకొని పన్ను మినహాయిం పులు, తగ్గింపుల్లో స్వల్ప మార్పులుండొచ్చు. స్టాండింగ్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రధాని హామీ ఇవ్వడంతో ఆ దిశగా బేసిక్ లిమిట్‌ను కొద్దిగా పెంచే అవకాశం ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్‌ను రూ.37,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్లకు పెంచొచ్చు. స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చే విధంగా ఎస్‌టీటీ పన్ను మినహాయిం పులు వంటి నిర్ణయాలు ఉంటాయనుకోవడం లేదు. మొత్తం మీద ఈ బడ్జెట్ వచ్చే ఐదేళ్ల మోడీ ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.
 - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement