మాటపై నిలబడేనా?
సాక్షి, న్యూఢిల్లీ:నగరవాసులకు శుభవార్త. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో విద్యుత్ చార్జీలను 30 శాతం మేర తగ్గించే అవకాశముందని అంటున్నారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గిస్తామని శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగగా అవతరించినప్పటికీ తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మెజారిటీ లేకపోయిన్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ... విద్యుత్‌చార్జీలను 50 శాతం తగ్గించింది. అయితే ఈ సబ్సిడీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులకుమునుపే గద్దె దిగడంతో ఆప్ ప్రకటించిన తగ్గింపు మూడు నెలల ముచ్చటే అయింది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. దీంతోపాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించి, తద్వారా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామనే పేరు తెచ్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇందులోభాగంగానే రానున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించవచ్చని ఆశిస్తున్నారు. విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించడం కోసం రూ. 600 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని అరుణ్ జైట్లీ యోచిస్తున్నారని అంటున్నారు.
200 యూనిట్లు, 400 యూనిట్లు స్లాబ్‌లకు చార్జీలను 30 శాతం తగ్గించాలని కేంద్రం యోచిస్తోందని చెబుతున్నారు. ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం రూ. 600 కోట్లను కేటాయించాలనే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఢిల్లీ ఆర్థిక విభాగం పంపిన ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిం చాల్సి ఉంది.