The first budget
-
సీఎం సారూ.. హామీలు మరిచారా!
ఎస్సారెస్పీపై అదే నిర్లక్ష్యం బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువైన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపులో మళ్లీ అన్యాయమే జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటిని అందించడమే కాకుండా అనేక గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అలాంటి ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 63.40 కోట్ల నిధులే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పదేళ్లపాటు ఈ నిర్లక్ష్యం కొనసాగితే ప్రాజెక్టు తాగునీటికి మాత్రమే పనికివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40.10 కోట్ల అంచనా వ్యయంతో ఐదు దశాబ్దాల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కాగా మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 1,600 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రూ. 3 వేల కోట్లు ఉంటుందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్‌లో నిర్మించిన వరద గేట్ల పరి స్థితి దయనీయంగా ఉంది. ఎస్కేప్ గేట్లు సరిగా పనిచేయడం లేదు. కాకతీయ కాలువకు ఏ క్షణాన గండిపడుతుందో అన్నట్లుగా ఉంది. ఆనకట్ట అంతా గుంతల మయంగా మారింది. కాలనీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. రివిట్మెంట్ ఊడిపోతోంది. ప్రాజెక్ట్‌కు పటిష్టమైన భధ్రత లేదు. పూడిక పేరుకు పో యింది. కాలువల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ సైతం భరోసా ఇవ్వలేకపోయింది. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో అరకొర నిధులే కేటాయించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాజెక్టును టూరిజంగా అభివృద్ధి చేస్తారని ఆశించినవారికీ భంగపాటే మిగిలింది. నయా పైస కూడా విదల్చలేదు. గల్ఫ్ బాధితులకు భరోసా ఏదీ ? మోర్తాడ్ : బడ్జెట్లో గల్ఫ్ బాధితులకు ఊరట కల్పించే చర్యలేవీ కనిపించలేదు. తెలంగాణలోని గల్ఫ్ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయం లో టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ విషయాన్ని చేర్చారు. గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కేరళప్రభుత్వం బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, గల్ఫ్‌లోని కంపెనీలు వేతనాలను సరిగా చెల్లించకపోవడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి కారణాలతో పలువురు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజధానిలో ఎన్ఆర్ఐ సెల్‌ను ఏర్పాటు చేసి, సాధారణ పరిపాలన కింద అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో రూ. 5 కోట్లకు మించి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కూడా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు ప్రత్యేకంగా ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి.. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ‘పసుపు’.. ఊసే లేదు ! బడ్జెట్లో పసుపు పథకానికి దక్కని చోటు నిధులు కేటాయించని సర్కార్ మోర్తాడ్ : పసుపు రైతుకు అండగా నిలవడానికి పసుపు అభివృద్ధి పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో జిల్లా పర్యటనలో ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాగా పసుపు అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వం ఈ పథకానికి మొండి చెయ్యి చూపింది. బడ్జెట్లో పసుపు అభివృద్ధి పథకం ఊసేలేకపోవడంతో కర్షకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వేల్పూర్ మండలం మోతె, ఆర్మూర్ మండలం అంకాపూర్‌లలో ఎక్కడో ఒక చోట పసుపు అభివృద్ధి పథకం, బోర్డు ఏర్పాటుకు కృషి చేయడానికి 13 మంది ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు జిల్లాలో పలుమార్లు పర్యటించారు. 40 ఎకరాల స్థలంలో పసుపు అభివృద్ధి పథకానికి సంబంధిం చిన కార్యాలయం ఏర్పాటు, పసుపు పరిశోధనకు ల్యాబ్, కొత్త వంగడాలు సృష్టించడం, గిడ్డంగులు, పసుపు విక్రయానికి యార్డులు, రైతులు సేద తీరడానికి విశ్రాంతి గదులు, రెస్టారెంట్ తదితర నిర్మాణాలను చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందు కోసం మోతె పర్యటనకు సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోతే అంకాపూర్‌ను ఎంపిక చేయాలని భావించారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు అంశాన్ని గవర్నర్ అప్పట్లో శాసన సభ సమావేశంలో ప్రకటించారు. దీంతో పసుపునకు మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. తీరా బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే.. పసుపు అభివృద్ధి పథకం ఊసేలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పసుపు అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కార్.. నిధులు ఇవ్వకపోవడం దారుణమని రైతులు పేర్కొంటున్నారు. -
నిధులు పారేనా.. ‘పంట’ పండేనా!
కర్నూలు(రూరల్): రాష్ట్ర విభజనానంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌పై జిల్లా ఆయకట్టు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జిల్లాకు చెందిన పత్తికొండ శాసనసభ్యుడు కె.ఈ.కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో న్యాయం చేకూరుతుందనే నమ్మకం రెట్టింపవుతోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జిల్లాలో అసంపూర్తి సాగునీటి ప్రాజెక్టుల పనులకు నీటిపారుదల శాఖ అధికారులు రూ.399.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏటా వర్షాభావ పరిస్థితులతో రైతుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. జిల్లాలో హగరి, తుంగభద్ర, కృష్ణా, హంద్రీ, కుందూ నదులు ప్రవహిస్తున్నా బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు నిర్మితమవుతున్న ప్రాజెక్టుల్లో పురోగతి లోపించింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు ఆయా ప్రాంతాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నిర్మితమైంది. గత ఏడాది కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. అయితే కాల్వ లైనింగ్, పెండింగ్ పనులు, డిస్ట్రిబ్యూటరీ కాలువల మరమ్మతులకు 2014-15 బడ్జెట్లో రూ.900 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. కర్నూలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత హామీలకు కొత్త రంగు పూసి హడావుడి చేసినా తొలి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. తుంగభద్ర నదిపై సుంకేసుల బ్యారేజీకి ఎగువన గుండ్రేవుల వద్ద 20 టీఎంసీల సామర్థ్యంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే పూర్తి కావచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని బాబు హామీ ఇచ్చినా బడ్జెట్‌కు అధికారులు ప్రతిపాదించని పరిస్థితి. ప్రభుత్వం కోరనందున తాము ముందడుగు వేయలేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఇక పశ్చిమ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు హగరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని ప్రకటించినా నిధుల ఊసెత్తకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులు పంపిన ప్రతిపాదనల్లోనూ ఎన్నింటికి నిధులు కేటాయిస్తారో.. వేటికి కోత విధిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొన్ని ప్రతిపాదనలు ఇలా... శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులు, సిబ్బంది ఇతరత్రా ఖర్చులకు మొత్తం 48.30 కోట్లు. ఎస్ఆర్బీసీ సర్కిల్ 1, 2 పరిధిలో ప్యాకేజీ 24 నుంచి 30 వరకున్న గాలేరు నగరి సుజల స్రవంతి పథకం పెండింగ్ పనులకు 41.70 కోట్లు. ఎస్ఆర్బీసీ సర్కిల్-1 పెండింగ్ పనులు, అటవీ భూముల సేకరణకు రూ.87 కోట్లు. ఎస్ఆర్బీసీ సర్కిల్-2 పరిధిలోని పనులకు రూ.123 కోట్లు. కర్నూలు-కడప కాలువ లైనింగ్, మరమ్మతులు, డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.18.87 కోట్లు. తెలుగుగంగ కాలువ లైనింగ్, వెలుగోడు రిజర్వాయర్ పెండింగ్ పనులు, బ్లాక్‌ల డిస్ట్రిబ్యూటరీ పనులుకు రూ.31 కోట్లు. తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ పెండింగ్ పనులకు రూ.11.16 కోట్లు. కర్నూలులో వరద రక్షణ గోడ నిర్మాణంలో భాగంగా అత్యవసర పనులకు రూ.35 కోట్లు. గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు.. కుడి, ఎడమ కాల్వల పెండింగ్ పనులు, బండ్ బలోపేతానికి రూ.1.12 కోట్లు వరదరాజుల స్వామి ప్రాజెక్టు పనులకు రూ.2.50 కోట్లు. -
రానున్నది సంస్కరణల బడ్జెట్!
ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లు ఏ విధంగా నడుచుకోనున్నదో ఈ బడ్జెట్ తెలియచేస్తుందని భావిస్తున్నారు. పూర్తిస్థాయి అధికారంలోకి రావడంతో రైల్వే చార్జీలను పెంచడం ద్వారా సంస్కరణల పరంగా ప్రభుత్వ ఉద్దేశాన్ని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా సంస్కరణల పరంగా పలు నిర్ణయాలుంటాయనేది మార్కెట్ వర్గాల అంచనా. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని ప్రోత్సహిస్తూ, ఇదే సమయంలో ఆర్థిక లోటు గాడి తప్పకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ 2014-15 బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నాం. పెట్టుబడుల ఉపసంహరణ, అధిక పన్ను వసూళ్లు, వేలాల ద్వారా ఆదాయాన్ని పెంచుకొని, పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ప్రణాళికా వ్యయానికి పెద్ద పీట వేయొచ్చు. ఇదే సమయంలో సబ్సిడీలను తగ్గించడం ద్వారా ప్రణాళికేతర వ్యయానికి అడ్డుకట్ట వేస్తారనుకుంటున్నాం. ఈ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.1 శాతానికి, 2018-19కల్లా 2.5 శాతానికి తగ్గించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. ఐదేళ్లలో జీడీపీ వృద్ధిని 8%కి తీసుకెళ్లాలనేది మోడీ ప్రభుత్వ లక్ష్యం. ఈ ఏడాది వృద్ధి లక్ష్యం 5.5%గా నిర్దేశించుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ, డీటీసీ సంస్కరణల పరంగా జైట్లీ ఈ బడ్జెట్లో పలు స్పష్టమైన సంకేతాలను వెలువరుస్తారనుకుంటున్నాం. ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ, డీటీసీలను అమలు చేసే విధంగా ప్రణాళికలను ప్రకటించొచ్చు. ఇంధన, ఫెర్టిలైజర్స్ సబ్సిడీల్లో ఉండే లీకేజీలకు అడ్డుకట్ట వేస్తూ, సబ్సిడీల భారాన్ని తగ్గించే విధంగా ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తారని అంచనా వేస్తున్నాం. బీమా, పెన్షన్ రంగాల్లో కూడా సంస్కరణలు ఆశిస్తున్నాం. రాజకీయంగా ఒత్తిడి ఉండే కార్మిక సంస్కరణల పరంగా కూడా ఒక అడుగు ముందుకు వేయొచ్చు. పెద్ద మార్పులుండవు.. పన్నుల పరంగా చూస్తే పెద్దగా మార్పులుండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జీఎస్టీ, డీటీసీలను దృష్టిలో పెట్టుకొని పన్ను మినహాయిం పులు, తగ్గింపుల్లో స్వల్ప మార్పులుండొచ్చు. స్టాండింగ్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రధాని హామీ ఇవ్వడంతో ఆ దిశగా బేసిక్ లిమిట్‌ను కొద్దిగా పెంచే అవకాశం ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్ టార్గెట్‌ను రూ.37,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్లకు పెంచొచ్చు. స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చే విధంగా ఎస్టీటీ పన్ను మినహాయిం పులు వంటి నిర్ణయాలు ఉంటాయనుకోవడం లేదు. మొత్తం మీద ఈ బడ్జెట్ వచ్చే ఐదేళ్ల మోడీ ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్