సీఎం సారూ.. హామీలు మరిచారా! | CM sir are you forgot guarantees? | Sakshi
Sakshi News home page

సీఎం సారూ.. హామీలు మరిచారా!

Published Fri, Nov 7 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM

సీఎం సారూ.. హామీలు మరిచారా!

సీఎం సారూ.. హామీలు మరిచారా!

ఎస్సారెస్పీపై అదే నిర్లక్ష్యం
 బాల్కొండ :  ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువైన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపులో మళ్లీ అన్యాయమే జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటిని అందించడమే కాకుండా అనేక గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అలాంటి ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 63.40 కోట్ల నిధులే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 ఇంకా పదేళ్లపాటు ఈ నిర్లక్ష్యం కొనసాగితే ప్రాజెక్టు తాగునీటికి మాత్రమే పనికివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40.10 కోట్ల అంచనా వ్యయంతో ఐదు దశాబ్దాల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కాగా మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 1,600 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రూ. 3 వేల కోట్లు ఉంటుందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్‌లో నిర్మించిన వరద గేట్ల పరి స్థితి దయనీయంగా ఉంది.

 ఎస్కేప్ గేట్లు సరిగా పనిచేయడం లేదు. కాకతీయ కాలువకు ఏ క్షణాన గండిపడుతుందో అన్నట్లుగా ఉంది. ఆనకట్ట అంతా గుంతల మయంగా మారింది. కాలనీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. రివిట్‌మెంట్ ఊడిపోతోంది. ప్రాజెక్ట్‌కు పటిష్టమైన భధ్రత లేదు. పూడిక పేరుకు పో యింది. కాలువల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ సైతం భరోసా ఇవ్వలేకపోయింది.

 కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో అరకొర నిధులే కేటాయించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాజెక్టును టూరిజంగా అభివృద్ధి చేస్తారని ఆశించినవారికీ భంగపాటే మిగిలింది. నయా పైస కూడా విదల్చలేదు.

  గల్ఫ్ బాధితులకు భరోసా ఏదీ ?
 మోర్తాడ్ : బడ్జెట్‌లో గల్ఫ్ బాధితులకు ఊరట కల్పించే చర్యలేవీ కనిపించలేదు. తెలంగాణలోని గల్ఫ్ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయం లో టీఆర్‌ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ విషయాన్ని చేర్చారు. గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కేరళప్రభుత్వం బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌లో గల్ఫ్ బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, గల్ఫ్‌లోని కంపెనీలు వేతనాలను సరిగా చెల్లించకపోవడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి కారణాలతో పలువురు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు.

గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజధానిలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను ఏర్పాటు చేసి, సాధారణ పరిపాలన కింద అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో రూ. 5 కోట్లకు మించి నిధులు కేటాయించలేదు.

ఇప్పుడు కూడా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు ప్రత్యేకంగా ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి.. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు.

 ‘పసుపు’.. ఊసే లేదు !
 బడ్జెట్‌లో పసుపు పథకానికి దక్కని చోటు     నిధులు కేటాయించని సర్కార్
 మోర్తాడ్ : పసుపు రైతుకు అండగా నిలవడానికి పసుపు అభివృద్ధి పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో జిల్లా పర్యటనలో ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాగా పసుపు అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వం ఈ పథకానికి మొండి చెయ్యి చూపింది. బడ్జెట్‌లో పసుపు అభివృద్ధి పథకం ఊసేలేకపోవడంతో కర్షకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

 వేల్పూర్ మండలం మోతె, ఆర్మూర్ మండలం అంకాపూర్‌లలో ఎక్కడో ఒక చోట పసుపు అభివృద్ధి పథకం, బోర్డు ఏర్పాటుకు కృషి చేయడానికి 13 మంది ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు జిల్లాలో పలుమార్లు పర్యటించారు. 40 ఎకరాల స్థలంలో పసుపు అభివృద్ధి పథకానికి సంబంధిం చిన కార్యాలయం ఏర్పాటు, పసుపు పరిశోధనకు ల్యాబ్, కొత్త వంగడాలు సృష్టించడం, గిడ్డంగులు, పసుపు విక్రయానికి యార్డులు, రైతులు సేద తీరడానికి విశ్రాంతి గదులు, రెస్టారెంట్ తదితర నిర్మాణాలను చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందు కోసం మోతె పర్యటనకు సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చారు.

 అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోతే అంకాపూర్‌ను ఎంపిక చేయాలని భావించారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు అంశాన్ని గవర్నర్ అప్పట్లో శాసన సభ సమావేశంలో ప్రకటించారు. దీంతో పసుపునకు మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. తీరా బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే.. పసుపు అభివృద్ధి పథకం ఊసేలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.  పసుపు అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కార్.. నిధులు ఇవ్వకపోవడం దారుణమని రైతులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement