victims of the Gulf
-
దిక్కులేని స్థితిలో ఉన్నాం.. దయ చూపండి!
► ప్రభుత్వాన్ని వేడుకుంటున్న గల్ఫ్ బాధితులు ► స్పందించని యంత్రాంగం ► ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబాలు ఇచ్ఛాపురం రూరల్: తినడానికి తిండి..ఉండటానికి గూడు కరువై రోడ్లపై దిక్కూ.. మొక్కూ లేని స్థితిలో అనాథల్లా తిరుగాడుతున్నాం.. దయ చూపాలంటూ గల్ఫ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి బాధితులు సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. అక్కడ నుంచి మరిన్ని ఫొటోలు వాట్సాప్‌లో పంపించారు. ఒడిషా రాష్ట్రం గంజాం, జయంతిపురం గ్రామాల పరిధిలోని యువకులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పది మంది బాధితులు గల్ఫ్‌లో చిక్కుకున్న విషయం విదితమే. గత ఏడాది డిసెంబర్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, టెక్కలి లోని ఏజెంట్ల ద్వారా పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన వీరిని ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులువాపోతున్నారు. జిల్లాకు చెందిన బాధితులు వీరే... ఉపాధికోసం వలస వెళ్లి దేశం కాని దేశంలో బాధలు పడుతున్న జిల్లాకు చెందిన వారి వివరాలు: కిలుగు రామారావు రెడ్డి (ఇచ్ఛాపురం మున్సిపాలిటీ బెల్లుపడ కాలనీ), దుంప బైరాగి (ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి), దూపాన ప్రకాష్ రెడ్డి(కంచిలి మండలం అంపురం), కల్లేపల్లి కార్తీక్(సోంపేట మండలం తాళపద్ర), రాజాం రామారావు ( పూండి, తోటపల్లి), గొరకల హేమారావు ( పూండి ముల్లారిపురం), బయా పెంటయ్య (భావనపాడు)తో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మద్ది బృహస్పతి(ఒడిశా గుడ్డిపద్ర), కోళ హరికృష్ణ (ఒడిశా బొరివాడ), గణేష్ పాత్రో జంకల, శిలవలస గోపాల్, పూదరి శ్రీనివాస్, నీలమ్ రాజకుమార్, గలిపెల్లి మధు, సౌదా బత్తుల ఉమామహేశ్వరావు, ఉమాశంకర్ సాహూ, సిలవలస వాసుదేవ్, సుధామ చంద్ర సాహూ, పెదిని తారేసు, పందిరి విజయ్‌కుమార్, లోచన బెహరా, ముడిలి ప్రహ్లాద్, సిలివలస గోపాల్, దకుయా గోవింద్‌లు ఉన్నారు. ఏజెంట్ల మాయలో... విదేశాల్లో ఉద్యోగం...చేతి నిండా సొమ్ము...ఐదేళ్లు పాటు విదేశాల్లో ఉంటే కోటీశ్వరులవుతారంటూ నిరుద్యోగ యువకులకు గాలం వేసే ఏజెంట్లు జిల్లాలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నుంచి బరంపురానికి వెళ్లే రహదారుల్లో పుట్టగొడుగుల్లా వీరి కార్యాలయాలు వెలిశాయి. కేవలం నిరుద్యోగులకు వల విసిరి వారి వద్ద భారీగా నగదు దోచుకోవడమే లక్ష్యంగా ఏజెంట్లు అలవాటు పడ్డారు. ఇచ్ఛాపురం పట్టణంలోనే నాలుగైదు కేంద్రాలున్నాయి. ఈ కేంద్రంలో వెల్డింగ్, ఫిట్టర్ వంటి శిక్షణలు తూతూ మంత్రంగా ఇస్తూ విదేశాలకు పంపించాలంటే సుమారు 80 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పైన పేర్కొన్న 24 మందికి ఇచ్ఛాపురం, టెక్కలి, బరంపురం ప్రాంతాల్లో ఉండే కేంద్రాలకు చెందిన ఏజెంట్ల ద్వారా తమంతా సౌదీ అరేబియా వచ్చినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందుల పాలవుతున్న కూలీల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. సుమారు 15 రోజుల నుంచి నిద్రహారాలు లేకుండా రోడ్లపై ఉంటున్న కూలీల బతుకు దుర్భరంగా మారడం విచారకరం. ఇప్పటికే బాధిత కూలీల కుటంబాలు ఆందోళనలో ఉన్నాయి. స్థానిక పార్లమెంట్ సభ్యులు విదేశాంగ మంత్రి దృష్టిలో సమస్యను తీసుకెళ్లి బాధిత కూలీలను స్వదేశానికి వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి. – పిరియా సాయిరాజ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, సమన్వయకర్త, ఇచ్ఛాపురం నా భర్తను కాపాడండి కంచిలి: ఉపాధి కోసం సౌదీ వెళ్లి అష్టకష్టాలు పడుతున్న నా భర్తను కాపాడాలని అంపురం గ్రామానికి చెందిన దూపాన ప్రకాష్‌రెడ్డి భార్య భైరవి ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు నెలల క్రితం కుటుంబాన్ని విడిచిపెట్టి సౌదీ వెళ్లారని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఇక్కడి ఏజెంట్ చెప్పిన ప్రకారం కాకుండా వేరే కంపెనీలో ఉద్యోగం ఇచ్చారని, అది కూడా వారు ఇక్కడ శిక్షణ పొందినది కాకుండా వేరే సివిల్ పనిలో చేర్పించారని పేర్కొంది. అక్కడ వసతి, భోజన సౌకర్యాలేవీ కల్పించకపోవటం, సరిగ్గా భద్రత లేకపోవటంతో ఆ కంపెనీ నుంచి బయటికొచ్చేశారని తెలిపింది. ఇప్పుడు అక్కడ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం వచ్చిందని రోదించింది. నా భర్తను ఇంటికి చేర్చాలి రెండు సార్లు సౌదీ వెళ్లిన నా భర్త గత ఏడాది డిసెంబర్లో ఏజెంట్‌కు 80 వేల రూపాయలు చెల్లించి మూడోసారి వెళ్లాడు. గత పదిహేను రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు ఫోన్లో తెలిపాడు. అప్పటి నుంచి మా కుటుంబానికి కంటి మీదు కునుకు లేకుండా పోయింది. నాన్న కావాలని పిల్లలు వసుంధర, మౌనికలు రోదిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నా భర్తను సురక్షితంగా ఇంటికి చేర్పించాలి – దుంపా బైరాగి భార్య దుంపా రాజేశ్వరి, తేలుకుంచి, ఇచ్ఛాపురం మండలం ప్రభుత్వమే ఆదుకోవాలి ఇచ్ఛాపురం:బతుకు తెరువు కోసం సౌదీఅరేబియా వెళ్లి ఇబ్బందులు పడుతున్న తమ వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరారు. ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి ఆటో స్టాండులో బాధిత కుటుంబ సభ్యులు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ నుంచి పంపిన ఏజెట్లు కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించాలని విన్నవించుకున్నారు. సమావేశంలో పాల్గొన్న వారిలో తెలుకుంచి గ్రామానికి చెందిన దుంప బైరాగి భార్య రాజేశ్వరి, పూండి గ్రామానికి చెందిన రాజాం రామారావు సోదరుడు లింగరాజు, గుడ్డిపద్ర గ్రామానికి చెందిన బృహస్పతి తల్లి జయమ్మ, ఉమాశంకర్ సాహు మామయ్య నర్సింగ సాహు ఉన్నారు. -
సీఎం సారూ.. హామీలు మరిచారా!
ఎస్సారెస్పీపై అదే నిర్లక్ష్యం బాల్కొండ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువైన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపులో మళ్లీ అన్యాయమే జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీటిని అందించడమే కాకుండా అనేక గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుంది. అలాంటి ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్లో రూ. 63.40 కోట్ల నిధులే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా పదేళ్లపాటు ఈ నిర్లక్ష్యం కొనసాగితే ప్రాజెక్టు తాగునీటికి మాత్రమే పనికివస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 40.10 కోట్ల అంచనా వ్యయంతో ఐదు దశాబ్దాల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కాగా మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మాణం పూర్తయ్యే నాటికి వ్యయం 1,600 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రూ. 3 వేల కోట్లు ఉంటుందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్ట్‌లో నిర్మించిన వరద గేట్ల పరి స్థితి దయనీయంగా ఉంది. ఎస్కేప్ గేట్లు సరిగా పనిచేయడం లేదు. కాకతీయ కాలువకు ఏ క్షణాన గండిపడుతుందో అన్నట్లుగా ఉంది. ఆనకట్ట అంతా గుంతల మయంగా మారింది. కాలనీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. రివిట్మెంట్ ఊడిపోతోంది. ప్రాజెక్ట్‌కు పటిష్టమైన భధ్రత లేదు. పూడిక పేరుకు పో యింది. కాలువల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాజెక్టుకు తెలంగాణ సర్కార్ సైతం భరోసా ఇవ్వలేకపోయింది. కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో అరకొర నిధులే కేటాయించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రాజెక్టును టూరిజంగా అభివృద్ధి చేస్తారని ఆశించినవారికీ భంగపాటే మిగిలింది. నయా పైస కూడా విదల్చలేదు. గల్ఫ్ బాధితులకు భరోసా ఏదీ ? మోర్తాడ్ : బడ్జెట్లో గల్ఫ్ బాధితులకు ఊరట కల్పించే చర్యలేవీ కనిపించలేదు. తెలంగాణలోని గల్ఫ్ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయం లో టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ విషయాన్ని చేర్చారు. గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం కేరళప్రభుత్వం బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో గల్ఫ్ బాధితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, గల్ఫ్‌లోని కంపెనీలు వేతనాలను సరిగా చెల్లించకపోవడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి కారణాలతో పలువురు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజధానిలో ఎన్ఆర్ఐ సెల్‌ను ఏర్పాటు చేసి, సాధారణ పరిపాలన కింద అరకొరగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. గతంలో రూ. 5 కోట్లకు మించి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కూడా గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన బాధితులకు ప్రత్యేకంగా ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి.. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ‘పసుపు’.. ఊసే లేదు ! బడ్జెట్లో పసుపు పథకానికి దక్కని చోటు నిధులు కేటాయించని సర్కార్ మోర్తాడ్ : పసుపు రైతుకు అండగా నిలవడానికి పసుపు అభివృద్ధి పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో జిల్లా పర్యటనలో ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కాగా పసుపు అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ప్రభుత్వం ఈ పథకానికి మొండి చెయ్యి చూపింది. బడ్జెట్లో పసుపు అభివృద్ధి పథకం ఊసేలేకపోవడంతో కర్షకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వేల్పూర్ మండలం మోతె, ఆర్మూర్ మండలం అంకాపూర్‌లలో ఎక్కడో ఒక చోట పసుపు అభివృద్ధి పథకం, బోర్డు ఏర్పాటుకు కృషి చేయడానికి 13 మంది ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు జిల్లాలో పలుమార్లు పర్యటించారు. 40 ఎకరాల స్థలంలో పసుపు అభివృద్ధి పథకానికి సంబంధిం చిన కార్యాలయం ఏర్పాటు, పసుపు పరిశోధనకు ల్యాబ్, కొత్త వంగడాలు సృష్టించడం, గిడ్డంగులు, పసుపు విక్రయానికి యార్డులు, రైతులు సేద తీరడానికి విశ్రాంతి గదులు, రెస్టారెంట్ తదితర నిర్మాణాలను చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందు కోసం మోతె పర్యటనకు సీఎం కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చారు. అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోతే అంకాపూర్‌ను ఎంపిక చేయాలని భావించారు. మోతెలో పసుపు పరిశోధన కేంద్రం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు అంశాన్ని గవర్నర్ అప్పట్లో శాసన సభ సమావేశంలో ప్రకటించారు. దీంతో పసుపునకు మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. తీరా బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే.. పసుపు అభివృద్ధి పథకం ఊసేలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పసుపు అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిన సర్కార్.. నిధులు ఇవ్వకపోవడం దారుణమని రైతులు పేర్కొంటున్నారు. -
నేడు లోక్‌సభకు ‘వంద’ నామినేషన్లు
గల్ఫ్ బాధితులు, రైతుల నిరసన స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి.. ఆర్మూర్, ఏళ్ల తరబడి తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ కాళ్లరిగిపోయేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో, లోక్‌సభ ఎన్నికలలో తమ నిరసన తెలపడానికి గల్ఫ్ బాధితులు, రైతులు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకొని నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక, పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ఆధ్వర్యంలో సుమారు వంద మంది బాధితులు బుధవారం నామినేషన్ వేయబోతున్నారు. జనరల్ అభ్యర్థులకు రూ.25వేల నామినేషన్ ఫీజు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 నామినేషన్ ఫీజును గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాలు, గల్ఫ్ బాధితుల సంఘాలు సమకూర్చుకుంటున్నాయి.