దిక్కులేని స్థితిలో ఉన్నాం.. దయ చూపండి!
► ప్రభుత్వాన్ని వేడుకుంటున్న గల్ఫ్ బాధితులు
► స్పందించని యంత్రాంగం
► ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబాలు
ఇచ్ఛాపురం రూరల్: తినడానికి తిండి..ఉండటానికి గూడు కరువై రోడ్లపై దిక్కూ.. మొక్కూ లేని స్థితిలో అనాథల్లా తిరుగాడుతున్నాం.. దయ చూపాలంటూ గల్ఫ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి బాధితులు సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. అక్కడ నుంచి మరిన్ని ఫొటోలు వాట్సాప్‌లో పంపించారు. ఒడిషా రాష్ట్రం గంజాం, జయంతిపురం గ్రామాల పరిధిలోని యువకులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పది మంది బాధితులు గల్ఫ్‌లో చిక్కుకున్న విషయం విదితమే.
గత ఏడాది డిసెంబర్‌లో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, టెక్కలి లోని ఏజెంట్ల ద్వారా పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన వీరిని ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులువాపోతున్నారు.
జిల్లాకు చెందిన బాధితులు వీరే...
ఉపాధికోసం వలస వెళ్లి దేశం కాని దేశంలో బాధలు పడుతున్న జిల్లాకు చెందిన వారి వివరాలు: కిలుగు రామారావు రెడ్డి (ఇచ్ఛాపురం మున్సిపాలిటీ బెల్లుపడ కాలనీ), దుంప బైరాగి (ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి), దూపాన ప్రకాష్ రెడ్డి(కంచిలి మండలం అంపురం), కల్లేపల్లి కార్తీక్(సోంపేట మండలం తాళపద్ర), రాజాం రామారావు ( పూండి, తోటపల్లి), గొరకల హేమారావు ( పూండి ముల్లారిపురం), బయా పెంటయ్య (భావనపాడు)తో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మద్ది బృహస్పతి(ఒడిశా గుడ్డిపద్ర), కోళ హరికృష్ణ (ఒడిశా బొరివాడ), గణేష్ పాత్రో జంకల, శిలవలస గోపాల్, పూదరి శ్రీనివాస్, నీలమ్ రాజకుమార్, గలిపెల్లి మధు, సౌదా బత్తుల ఉమామహేశ్వరావు, ఉమాశంకర్ సాహూ, సిలవలస వాసుదేవ్, సుధామ చంద్ర సాహూ, పెదిని తారేసు, పందిరి విజయ్‌కుమార్, లోచన బెహరా, ముడిలి ప్రహ్లాద్, సిలివలస గోపాల్, దకుయా గోవింద్‌లు ఉన్నారు.
ఏజెంట్ల మాయలో...
విదేశాల్లో ఉద్యోగం...చేతి నిండా సొమ్ము...ఐదేళ్లు పాటు విదేశాల్లో ఉంటే కోటీశ్వరులవుతారంటూ నిరుద్యోగ యువకులకు గాలం వేసే ఏజెంట్లు జిల్లాలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నుంచి బరంపురానికి వెళ్లే రహదారుల్లో పుట్టగొడుగుల్లా వీరి కార్యాలయాలు వెలిశాయి. కేవలం నిరుద్యోగులకు వల విసిరి వారి వద్ద భారీగా నగదు దోచుకోవడమే లక్ష్యంగా ఏజెంట్లు అలవాటు పడ్డారు.
ఇచ్ఛాపురం పట్టణంలోనే నాలుగైదు కేంద్రాలున్నాయి. ఈ కేంద్రంలో వెల్డింగ్, ఫిట్టర్ వంటి శిక్షణలు తూతూ మంత్రంగా ఇస్తూ విదేశాలకు పంపించాలంటే సుమారు 80 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పైన పేర్కొన్న 24 మందికి ఇచ్ఛాపురం, టెక్కలి, బరంపురం ప్రాంతాల్లో ఉండే కేంద్రాలకు చెందిన ఏజెంట్ల ద్వారా తమంతా సౌదీ అరేబియా వచ్చినట్లు బాధితులు తెలిపారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందుల పాలవుతున్న కూలీల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. సుమారు 15 రోజుల నుంచి నిద్రహారాలు లేకుండా రోడ్లపై ఉంటున్న కూలీల బతుకు దుర్భరంగా మారడం విచారకరం. ఇప్పటికే బాధిత కూలీల కుటంబాలు ఆందోళనలో ఉన్నాయి. స్థానిక పార్లమెంట్ సభ్యులు విదేశాంగ మంత్రి దృష్టిలో సమస్యను తీసుకెళ్లి బాధిత కూలీలను స్వదేశానికి వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలి. – పిరియా సాయిరాజ్, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, సమన్వయకర్త, ఇచ్ఛాపురం
నా భర్తను కాపాడండి
కంచిలి: ఉపాధి కోసం సౌదీ వెళ్లి అష్టకష్టాలు పడుతున్న నా భర్తను కాపాడాలని అంపురం గ్రామానికి చెందిన దూపాన ప్రకాష్‌రెడ్డి భార్య భైరవి ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు నెలల క్రితం కుటుంబాన్ని విడిచిపెట్టి సౌదీ వెళ్లారని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఇక్కడి ఏజెంట్ చెప్పిన ప్రకారం కాకుండా వేరే కంపెనీలో ఉద్యోగం ఇచ్చారని, అది కూడా వారు ఇక్కడ శిక్షణ పొందినది కాకుండా వేరే సివిల్ పనిలో చేర్పించారని పేర్కొంది. అక్కడ వసతి, భోజన సౌకర్యాలేవీ కల్పించకపోవటం, సరిగ్గా భద్రత లేకపోవటంతో ఆ కంపెనీ నుంచి బయటికొచ్చేశారని తెలిపింది. ఇప్పుడు అక్కడ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం వచ్చిందని రోదించింది.
నా భర్తను ఇంటికి చేర్చాలి
రెండు సార్లు సౌదీ వెళ్లిన నా భర్త గత ఏడాది డిసెంబర్‌లో ఏజెంట్‌కు 80 వేల రూపాయలు చెల్లించి మూడోసారి వెళ్లాడు. గత పదిహేను రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు ఫోన్‌లో తెలిపాడు. అప్పటి నుంచి మా కుటుంబానికి కంటి మీదు కునుకు లేకుండా పోయింది. నాన్న కావాలని పిల్లలు వసుంధర, మౌనికలు రోదిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నా భర్తను సురక్షితంగా ఇంటికి చేర్పించాలి
– దుంపా బైరాగి భార్య దుంపా రాజేశ్వరి, తేలుకుంచి, ఇచ్ఛాపురం మండలం
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఇచ్ఛాపురం:బతుకు తెరువు కోసం సౌదీఅరేబియా వెళ్లి ఇబ్బందులు పడుతున్న తమ వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరారు. ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి ఆటో స్టాండులో బాధిత కుటుంబ సభ్యులు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ నుంచి పంపిన ఏజెట్లు కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించాలని విన్నవించుకున్నారు.
సమావేశంలో పాల్గొన్న వారిలో తెలుకుంచి గ్రామానికి చెందిన దుంప బైరాగి భార్య రాజేశ్వరి, పూండి గ్రామానికి చెందిన రాజాం రామారావు సోదరుడు లింగరాజు, గుడ్డిపద్ర గ్రామానికి చెందిన బృహస్పతి తల్లి జయమ్మ, ఉమాశంకర్ సాహు మామయ్య నర్సింగ సాహు ఉన్నారు.