సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక విధానం భవన నిర్మాణాలకు ఆటంకంగా పరిణమించింది. మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంభన చేకూర్చేందుకు, ఇసుక మాఫీయాను అరికట్టేందుకు ఆన్‌లైన్ విధానంలో ఇసుక విక్రయాలను ప్రభుత్వం చేపట్టింది. ఈ విధానంలో మహిళా సంఘాల ముసుగులో తెలుగుదేశం వారే పెత్తనం చెలాయిస్తున్నారు తప్ప మహిళా సంఘాలకు చేకూరుతున్న ప్రయోజనమేమీ లేదు. ఒకే వే బిల్లు మీద పలుమార్లు రవాణా జరుగుతుండడం, యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలు జరుపుతుండడం, నియంత్రణ లేకపోవడం, స్థానిక ఎమ్మార్వో, ఎస్‌ఐలకు అధికారాలు తగ్గించి కేసుల్ని ఆర్డీవోలకే బదలాయించడం వంటివి జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా పరిణమించాయి.
ధర తడిసి మోపెడు
గతంలో మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక (ఓ యూనిట్) రూ.900కే లభ్యమయ్యేది. కొత్త విధానంలో క్యూబిక్ మీటర్ రూ.500గా ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ప్రకటించింది. కానీ రవాణా చార్జీలతో కలిపి ఇది తడిసి మోపెడవుతోంది. జిల్లాలో 13 రీచ్‌లను గుర్తించగా ఇసుక కొరత కారణంగా ఐదు ఆగిపోయాయి. ఉన్నవి కూడా శ్రీకాకుళం పట్టణానికి 10 నుంచి 15కి.మీ దూరంలో ఉన్నాయి.
ట్రాక్టర్ ఇసుక కావాలంటే మూడు క్యూబిక్ మీటర్లకు రూ.1500 ఆన్‌లైన్‌లో చెల్లించి రసీదు తీసుకుంటున్నా దాన్ని ఇంటి వరకూ తీసుకురావాలంటే కనీసం రూ.2 వేలు రవాణా చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అది కూడా తమ వాహనాల్లోనే తరలించాలన్నది స్థానిక టీడీపీ నాయకుల డిమాండ్. రీచుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రభుత్వ వాహనాలు సమకూర్చడం వంటివి పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఇసుక మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. గతంలో రూ.1000లోపు దొరికే ఇసుకకు ఇప్పుడు రూ.3500 వరకూ చెల్లించాల్సివస్తోంది. దీంతో భవన నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. కొత్త విధానం వల్ల తమకు ఇబ్బందులెదురవుతున్నాయని బిల్డర్స్ కూడా జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.
ఇలా తరలుతోంది
పేద, మధ్య తరగతి ప్రజలకు ఇంటి నిర్మాణం మరింత ఇబ్బందికరంగా పరిణమించింది. పెరిగిన ధర పెట్టి కొనలేక నదీతీర ప్రాంతాల్లోని ప్రజలు నదీ గర్భం నుంచి అనధికారికంగా ఇసుక తరలించుకుపోతున్నారు. కూలీలను, రిక్షాలను పెట్టి నదిలోని ఇసుకను ప్లాస్టిక్ బస్తాల్లో తెప్పిస్తున్నారు.
తోపుడు, నాటు బళ్లపై ఇసుక తరలింపును ప్రభుత్వం నిషేధించడంతో రిక్షాలపై ట్రిప్పుకు పది బస్తాలు (క్యూబిక్ మీటర్‌కు తగ్గకుండా) తీసుకువచ్చేందుకు పురమాయిస్తున్నారు. దీని ద్వారా కూలీలకు డిమాండ్ పెరిగింది. రోజుకు రూ.250 కూలి సంపాదించేవారు ప్రస్తుతం ఇసుక తరలింపు ద్వారా కనీసం రూ.500 సంపాదిస్తున్నారు. కొంతమంది మేస్త్రీలు రిక్షాలను అద్దెకు తీసుకొని, కూలీలను పెట్టుకొని, భవన నిర్మాణదారులతో ఒప్పందాలు చేసుకొని రోజుకు నాలుగైదు ట్రిప్పులు తరలిస్తూ అన్ని ఖర్చులు పోనూ రూ.1000 మిగుల్చుకుంటున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి, ప్రభుత్వ రీచ్‌ల వద్ద రవాణా కోసం గంటల తరబడి వేచి చూడడం, భారీగా సొమ్ము వెచ్చించడం కంటే పలువురు ఈ మార్గం వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల క్యూబిక్ మీటరుకు రూ.200 నుంచి రూ.300 మిగులుతోందని నిర్మాణదారులు చెబుతున్నారు. ఇదే అదనుగా స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు కూలీలు, రిక్షావాలాల నుంచి ఆశీలు, చలానాలంటూ దండుకోవడం మొదలెట్టారు.
భవన నిర్మాణాలకు ఇసుక సెగ
Published Mon, Feb 23 2015 3:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement