శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను, తర్వాత వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలన్నీ పూర్తి స్థాయిలో దెబ్బతినటంతో జిల్లాలోని రైతులు ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించటం లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందకపోవటం, అందుతుందన్న భరోసా లేకపోవటమే ఇందుకు కారణం. మరోవైపు బోట్లు, వలలు కోల్పోయిన మత్స్యకారులు, ఇళ్లు కూలిన పేదల పరిస్థితీ ఇలాగే ఉంది. సహాయ చర్యలు నత్తనడకన సాగుతుండటంతో బాధితులందరికీ కన్నీరే మిగిలింది.
ఇప్పటికీ అందని అప్పటి పెట్టుబడి రాయితీ
గతంలో నీలం తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు మంజూరు చేసిన పెట్టుబడి రాయితీని వారం రోజుల్లో అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పది రోజులవుతున్నా ఒక్కరికీ అందలేదు. మరోవైపు, ప్రస్తుత పంట నష్టాలపై అధికారులు సీఎం కిరణ్‌కు సమర్పించిన నష్టాల అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా ప్రాంతాల్లోని వరి తదితర పంటలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు నష్టాలను ఎలా అంచనా వేశారనేది సందేహాలు కలిగిస్తోంది.
వాస్తవ నష్టం రూ.1600 కోట్లు!
పై-లీన్ తుపాను వల్ల జిల్లాలో రూ.432 కోట్లు, భారీ వర్షాల కారణంగా రూ.529.17 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు నివేదికలను సీఎం కిరణ్‌కు అందజేశారు. వాస్తవానికి క్షేత్ర స్థాయికి వెళ్లి సరైన విధంగా అంచనాలు రూపొందిస్తే నష్టాల మొత్తం 1600 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అధికారులే ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు.
కౌలు రైతుకు సహాయం అందేనా
పంటలు పూర్తిగా దెబ్బతినటంతో కౌలు రైతులు పూర్తిగా కుదేలయ్యారు. వీరికి సైతం నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ సీఎం హామీ అమలుపై కౌలు రైతులకు ఎన్నో సందేహాలున్నాయి. ఇప్పటికే అప్పుల పాలయ్యామని, ప్రభుత్వం ఆదుకోకపోతే జీవితాంతం కోలుకోలేమని వారు వాపోతున్నారు. బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా బాధితులు విశ్వసించటం లేదు. సీఎం మాటలను బట్టి రుణాల మాఫీ జరిగే అవకాశం లేదని స్పష్టమవటంతో ఆందోళన చెందుతున్నారు.
హామీలే తప్ప నిధులేవీ?
వరద బాధితులకు అదన ంగా బియ్యం, వంటపాత్రల కొనుగోలుకు నగదు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఇప్పట్లో ఇది జరిగే పరిస్థితి కనిపించటం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే దీనికి కారణం. జిల్లాలో కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. వేలాది చెరువులు, కాలువులకు గండ్లు పడ్డాయి. విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. తాగునీటి పథకాలు పనికిరాకుండా పోయాయి. దీంతో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు రూ.700 కోట్లకు పైగా అవసరమమని అధికారులు చెబుతున్నారు. బాధితులకు తక్షణ సహాయం కూడా సకాలంలో అందించలేని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పనకు ఇంత మొత్తాన్ని విడుదల చేసే పరిస్థితి లేనేలేదు. సమస్యపై పోరాడాల్సిన ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు మిగిలేది కన్నీరు కాక మరేమిటి?
మిగిలింది కన్నీరే..
Published Fri, Nov 1 2013 4:19 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement