First railway budget
-
విశాఖ కేంద్రంగా కొత్త జోన్!
రైల్వే బడ్జెట్లో ప్రతిపాదనలు! విశాఖలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్క్యులర్ రైలు సాక్షి, విజయవాడ బ్యూరో : మోడీ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న తొలి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతోపాటు పలు కొత్త రైళ్లు, డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో ప్రత్యేక జోన్ ఏర్పాటును బడ్జెట్లో ప్రకటించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇందులోభాగంగా వాల్తేరు, గుంతకల్ డివిజన్లలో మార్పులు జరిపే అవకాశముంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న తెలుగు ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక డివిజన్‌గా ఏర్పాటు చేసి, మిగిలిన ఒరిస్సా ప్రాంతాలను నార్త్‌కోస్ట్ జోన్లో కలపనున్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటును ప్రతిపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గుంతకల్ డివిజన్ పరిస్థితి ఏమిటనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. విశాఖపట్నంలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. గతంలో ఈ ఫ్యాక్టరీ ఒరిస్సాకు తరలిపోయింది. అక్కడ దాన్ని ఏర్పాటు చేస్తే ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉండటంతో విశాఖపట్నంలో ఏర్పాటుచేయనున్నారు. విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-నర్సాపురం-నిడదవోలు రైల్వే లైను డబ్లింగ్, విద్యుదీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య మూడో రైల్వే లైనుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంలు పెంచడంతోపాటు సౌకర్యాలకు నిధులు కేటాయించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లోనూ ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయడానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్క్యులర్ రైలు నడిపేందుకు అనుమతి ఇవ్వనున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా ఢిల్లీకి ఒక రైలును నడిపేందుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే విశాఖపట్నం నుంచి రాయలసీమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు విశాఖ నుంచి కర్నూలుకు ఒక రైలును నడిపే సూచనలున్నాయి. -
ఖర్చు తగ్గింపు.. ఆదాయం పెంపు!
* ఇవే లక్ష్యంగా రైల్వే బడ్జెట్ కసరత్తు! * ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి * సౌకర్యాలకు, భద్రతకు పెద్దపీట * ప్రైవేటు భాగస్వామ్యం, ఎఫ్‌డీఐలను * అనుమతించడంపై ప్రకటన! * నేడే సభ ముందుకు రైల్వే బడ్జెట్ న్యూఢిల్లీ: మోడీ సర్కారు తొలి రైల్వే బడ్జెట్ నేడు సభ ముందుకు రానుంది. రైల్వే మంత్రి సదానంద గౌడ 2014-15 సంవత్సరానికి రైల్వే శాఖ బడ్జెట్‌ను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ప్రమాద రహిత ప్రయాణాలే తన ప్రాథమ్యాలని రైల్వే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే గౌడ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ దిశగా ఈ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రయాణ, రవాణా చార్జీలను ఇప్పటికే పెంచిన కేంద్ర ప్రభుత్వం.. రైల్వేలు ఎదుర్కొంటున్న నష్టాలను అధిగమించే దిశగా.. అదనపు ఆదాయం లక్ష్యంగా వ్యూహాలకు పదనుపెడుతోంది. ప్రస్తుతం రైల్వే శాఖ రూ. 26 వేల కోట్ల నష్టంలో ఉంది. అందువల్ల ప్రస్తుతం లాభదాయకంగా లేని ప్రాజెక్టులను రద్దు చేయడంతో పాటు.. కొత్తగా పలు ప్రాజెక్టులను ఈ బడ్జెట్లో గౌడ ప్రకటించవచ్చు. ఇంధన ధరల భారం రోజురోజుకీ పెరుగుతుండటంతో.. రైల్వేల్లో సౌరశక్తి, బయో డీజిల్ లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. రైల్ టారిఫ్ అథారిటీ, హైస్పీడ్ రైల్ అథారిటీల ఏర్పాటుపై ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి కూడా ఈ బడ్జెట్లో వెల్లడికానుందని సమాచారం. భారీ పెట్టుబడులు అవసరమైన ప్రాజెక్టుల్లో ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేయడం తప్పనిసరైన పరిస్థితుల్లో.. అందరూ లబ్ధి పొందేలా ప్రణాళికలను రైల్వేలు రూపొందించాల్సి ఉంది. రైల్వేల్లో పెట్టుబడులకు ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, ఆ దిశగా ముందుకు వెళ్లాలనుకుంటున్నామని ఇటీవలే ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ బడ్జెట్లో వస్తాయని ఆశిస్తున్న అంశాలు: - నడుస్తున్న రైళ్లలోంచి ప్రమాదవశాత్తు పడిపోవడాన్ని నిరోధించేందుకు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో, ముంబై సబర్బన్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లను ఏర్పాటు చేయడం. - పలు పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్తగా రైళ్లను ప్రారంభించడం. - హైస్పీడ్ రైల్ వ్యవస్థ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ సహా మౌలిక వసతుల కల్పనకు విదేశీ నిధులను ఉపయోగించుకునేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి. - హైస్పీడ్ రైళ్ల ‘డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టు’ భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన - నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం అధిక సామర్థ్యం కలిగిన పాల వ్యాగన్లను ప్రారంభించడం. - ఉప్పు రవాణా కోసం పార్శిల్ వ్యాగన్లు, తక్కువ బరువు కలిగిన వ్యాగన్ల ఏర్పాటు - వర్క్‌షాపులు, రైల్వే కాలనీలు, రైల్వే ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లలో సౌరశక్తిని వినియోగించేలా చర్యలు. - రైల్వేలకు చెందిన ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు.. రైళ్ల ఉపరితలంపై సౌర ఫలకాల ఏర్పాటు - రాయ్‌బరేలీ కోచ్ ఫ్యాక్టరీలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, మరోచోట బయో డీజిల్ ప్లాంటు ఏర్పాటు. - {పయాణికుల సౌకర్యం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం. రైళ్లలో పాడైపోయిన యంత్ర భాగాలను గుర్తించేందుకు ట్రాక్‌ల వెంట ఎక్స్‌రే యంత్రవ్యవస్థను ఏర్పాటు చేయడం. రైళ్ల, రాబోయే స్టేషన్ల సమాచారం తెలిపేందుకు రైల్వే స్టేషన్లలో, రైళ్లలో జీఐఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ ఏర్పాటు. ట్విటర్, ఫేస్బుక్ల్లోకి రైల్వే శాఖ: గౌడ సోషల్ మీడియా అనుకూల మోడీ సర్కారులో భాగమైన రైల్వే శాఖ సోమవారం సామాజిక అనుసంధాన వెబ్సైట్లు ట్విటర్, ఫేస్‌బుక్‌ల్లో తమ అధికారిక అకౌంట్లను ప్రారంభించింది. సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం పూర్తికాగానే ముఖ్య వివరాలన్నీ ఆ వెబ్సైట్లలో ప్రత్యక్షమవుతాయని ఆ కార్యక్రమం సదానంద గౌడ వెల్లడించారు. బడ్జెట్లో సమాచార సాంకేతికతకు సముచిత ప్రాధాన్యతనిచ్చానన్నారు. మొత్తం ఒక పేజీని దీనికే కేటాయించానన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 139తో పాటు ప్రత్యేకంగా 022-4501555 ఫోన్ నెంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. -
అభివృద్ధి రైలు పట్టాలెక్కేనా?
నెల్లూరు (నవాబుపేట) : కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్లో మంగళవారం ప్రవేశ పెట్టనుంది. జిల్లాలో రైల్వేపరమైన అభివృద్ధి దశాబ్దాలుగా సర్వేలు, ప్రతిపాదనలు, మంజూ రుకే పరిమితమైంది. జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి వర్గంలో ఉండటంతో ఈ దఫా అయినా జిల్లాకు అభివృద్ధి రైలొస్తుందని ప్రజానీకం ఆశిస్తోంది. రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. జిల్లాకు గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు రైలు ప్రాజెక్టులు, రైలు మార్గాలు కేటాయించారు. అయితే ఇందుకు సంబంధించి శంకుస్థాపనలు జరిగినా నిధులు మంజూరు జరగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగా రాష్ట్రం 50 శాతం భరించే విధంగా నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా తొలుత నిధులు కేటాయిస్తోంది. వాటిలో కొన్ని పరిశీలిస్తే.. * బిట్రగుంటలో కాంక్రీటు స్లీపర్ల డిపోకు 2004 సెప్టెంబర్ 17న అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రగతి అతీగతీ లేదు. * శ్రీకాళహస్త్రి-నడికుడి రైల్వే మార్గానికి 2010-11 బడ్జెట్లో మోక్షం లభించినప్పటికీ ఇంత వరకు ముందడుగు లేదు. 2005, 2007లో సర్వే చేయగా రైల్వే మార్గం నిర్మాణానికి రూ.1300 కోట్లకు పైగా అంచనా వేశారు. గతేడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించినప్పటికీ పనులు జరగలేదు. ఈ రైలు మార్గం ఏర్పడితే జిల్లాలోని రాపూరు, పొదలకూరు, ఆత్మకూరు, కలిగిరి, వింజమూరు ప్రాంతాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఈ మార్గంలో దాదాపు 160 కి.మీ దూరం తగ్గుతుంది. * గూడూరు-దుగ్గరాజుపట్నం రైలు మార్గంకు సర్వే చేయగా రూ.280 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.1.50 కోట్లు కేటాయించింది. దీంతో ఈ మార్గం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. * కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులాపురంపల్లి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ ప్రాంతంలో భూసేకరణ చేశారు. అప్పట్లో రూ.930 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీంతో 2011 రాష్ట్ర బడ్జెట్లో రూ.6 కోట్లు కేటాయించారు. * కృష్ణపట్నం-వెంకటాచలం మధ్య రెండు లైన్లు రైల్వేట్రాక్‌ను నిర్మిస్తున్నారు. 2011 బడ్జెట్లో రూ.87 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదికి రూ.25 కోట్లకు పైగా ఆదాయం ఉన్నా... నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి రోజుకు దాదాపు రూ.7 నుంచి రూ.8 లక్షలు వరకు ఆదాయం వస్తుంది. అంటే ఏడాదికి దాదాపు రూ.25 కోట్లకు పైగా ఆదాయాన్ని రైల్వే శాఖకు చేకూరుతున్నా రైల్వేస్టేషన్ అభివృద్ధికి మాత్రం నోచుకోవడంలేదు. రైల్వే శాఖలో ఏ గ్రేడ్ ఆదాయం కలిగిన నెల్లూరు రైల్వేస్టేషన్‌కు వసతులు నామమాత్రంగా ఉన్నాయి. ప్రధానంగా గూడూరు, కావలి, వెంకటగిరి రైల్వేస్టేష న్ల నుంచి ఎగుమతులు, దిగుమతులు, ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయాన్ని లభిస్తోంది. మొత్తంగా జిల్లా నుంచి రైల్వే శాఖ వంద కోట్లకుపైగా లాభాలొస్తున్నట్లు అంచనా. బిట్రగుంట భవిత మారేనా? మూడు దశాబ్దాలకు పైగా బిట్రగుంటలో రైల్వేపరమైన ప్రగతి కాగితాలకే పరిమితమవుతుంది. వేలాది ఎకరాలు, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ బిట్రగుంట ప్రగతి భవిత రైలు పట్టాలు ఎక్కించేందుకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆసక్తి చూపడంలేదు. ‘లిటిల్ ఇంగ్లాండ్’గా పేరుగాంచిన బిట్రగుంటలో ఆసియాలోనే ప్రఖ్యాతగాంచిన లోకోషెడ్ ఆ నాడు వేలాది మంది కార్మికులతో నిత్యం కలకలలాడుతుండేది. ప్రస్తుతం చెట్లపొదలతో నిండిపోయి అటవీప్రాంతాన్ని తలపిస్తోంది. ఇక్కడ రైలు ఇంజన్ మరమ్మతుల కర్మాగారం నెలకొల్పాలని పలువురు కోరుతున్నారు. పలు రైళ్లకు స్టాపింగ్ ప్రతిపాదనలు నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్లో పలు రైళ్లస్టాపింగ్కు ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై-హౌరా (కోరమండల్ ఎక్స్‌ప్రెస్), చెన్నై-న్యూఢిల్లీ (గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్) రైళ్లకు స్టాపింగ్‌కు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదే విధంగా నగరంలోని వేదాయపాళెం రైల్వేస్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇక్కడ కొన్ని ప్యాసింజర్ రైళ్లు, మెమో రైళ్లు ఆగుతుంటాయి. మరెన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని పలువురు కోరుతున్నారు. తిరుపతి-పూరి (పూరిఎక్స్ప్రెస్), చెన్నై-హైదరాబాద్(చెన్నై ఎక్స్‌ప్రెస్), చెన్నై-అండమాన్ (జమ్మూతావిఎక్స్ప్రెస్) రైళ్లను ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. మెమూ రైళ్లను పొడిగించాలి గుంటూరు, విజయవాడ నుంచి ఒం గోలు వరకు వచ్చే మెమూ రైళ్లను నెల్లూరు వరకు, చెన్నై, తిరుపతి నుంచి నెల్లూరు వరకు వచ్చే మెమూ రైళ్లను ఒంగోలు వరకు పొడిగించాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉంది. జిల్లా నుంచి నాగూరు- నాగపట్నం వరకు ప్రత్యేక రైళ్లు నడపాలని జిల్లా ప్రజల ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.