అభివృద్ధి రైలు పట్టాలెక్కేనా? | today railway budget | Sakshi
Sakshi News home page

అభివృద్ధి రైలు పట్టాలెక్కేనా?

Published Tue, Jul 8 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

అభివృద్ధి రైలు పట్టాలెక్కేనా?

అభివృద్ధి రైలు పట్టాలెక్కేనా?

నెల్లూరు (నవాబుపేట) : కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశ పెట్టనుంది. జిల్లాలో రైల్వేపరమైన అభివృద్ధి దశాబ్దాలుగా సర్వేలు, ప్రతిపాదనలు, మంజూ రుకే పరిమితమైంది. జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి వర్గంలో ఉండటంతో ఈ దఫా అయినా జిల్లాకు అభివృద్ధి రైలొస్తుందని ప్రజానీకం ఆశిస్తోంది.  
 
రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
జిల్లాకు గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు రైలు ప్రాజెక్టులు, రైలు మార్గాలు కేటాయించారు. అయితే ఇందుకు సంబంధించి శంకుస్థాపనలు జరిగినా నిధులు మంజూరు జరగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగా రాష్ట్రం 50 శాతం భరించే విధంగా నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా తొలుత నిధులు కేటాయిస్తోంది. వాటిలో కొన్ని పరిశీలిస్తే..

* బిట్రగుంటలో కాంక్రీటు స్లీపర్ల డిపోకు 2004 సెప్టెంబర్ 17న అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రగతి అతీగతీ లేదు.  
* శ్రీకాళహస్త్రి-నడికుడి రైల్వే మార్గానికి 2010-11 బడ్జెట్‌లో మోక్షం లభించినప్పటికీ ఇంత వరకు ముందడుగు లేదు. 2005, 2007లో సర్వే చేయగా రైల్వే మార్గం నిర్మాణానికి రూ.1300 కోట్లకు పైగా అంచనా వేశారు. గతేడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించినప్పటికీ పనులు జరగలేదు. ఈ రైలు మార్గం ఏర్పడితే జిల్లాలోని రాపూరు, పొదలకూరు, ఆత్మకూరు, కలిగిరి, వింజమూరు ప్రాంతాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఈ మార్గంలో దాదాపు 160 కి.మీ దూరం తగ్గుతుంది.

* గూడూరు-దుగ్గరాజుపట్నం రైలు మార్గంకు సర్వే చేయగా రూ.280 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.1.50 కోట్లు కేటాయించింది. దీంతో ఈ మార్గం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
* కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులాపురంపల్లి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ ప్రాంతంలో భూసేకరణ చేశారు. అప్పట్లో రూ.930 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీంతో 2011 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6 కోట్లు కేటాయించారు.
* కృష్ణపట్నం-వెంకటాచలం మధ్య రెండు లైన్లు రైల్వేట్రాక్‌ను నిర్మిస్తున్నారు. 2011 బడ్జెట్‌లో రూ.87 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి.
 
 ఏడాదికి రూ.25 కోట్లకు పైగా ఆదాయం ఉన్నా...
 నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి రోజుకు దాదాపు రూ.7 నుంచి రూ.8 లక్షలు వరకు ఆదాయం వస్తుంది. అంటే ఏడాదికి దాదాపు రూ.25 కోట్లకు పైగా ఆదాయాన్ని రైల్వే శాఖకు చేకూరుతున్నా రైల్వేస్టేషన్ అభివృద్ధికి మాత్రం నోచుకోవడంలేదు. రైల్వే శాఖలో ఏ గ్రేడ్ ఆదాయం కలిగిన నెల్లూరు రైల్వేస్టేషన్‌కు వసతులు నామమాత్రంగా ఉన్నాయి. ప్రధానంగా గూడూరు, కావలి, వెంకటగిరి రైల్వేస్టేష న్ల నుంచి ఎగుమతులు, దిగుమతులు, ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయాన్ని లభిస్తోంది. మొత్తంగా జిల్లా నుంచి రైల్వే శాఖ వంద కోట్లకుపైగా లాభాలొస్తున్నట్లు అంచనా.
 
బిట్రగుంట భవిత మారేనా?
మూడు దశాబ్దాలకు పైగా బిట్రగుంటలో రైల్వేపరమైన ప్రగతి కాగితాలకే పరిమితమవుతుంది. వేలాది ఎకరాలు, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ బిట్రగుంట ప్రగతి భవిత రైలు పట్టాలు ఎక్కించేందుకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆసక్తి చూపడంలేదు. ‘లిటిల్ ఇంగ్లాండ్’గా పేరుగాంచిన బిట్రగుంటలో ఆసియాలోనే ప్రఖ్యాతగాంచిన లోకోషెడ్ ఆ నాడు వేలాది మంది కార్మికులతో నిత్యం కలకలలాడుతుండేది. ప్రస్తుతం చెట్లపొదలతో నిండిపోయి అటవీప్రాంతాన్ని తలపిస్తోంది. ఇక్కడ రైలు ఇంజన్ మరమ్మతుల కర్మాగారం నెలకొల్పాలని పలువురు కోరుతున్నారు.

 పలు రైళ్లకు స్టాపింగ్ ప్రతిపాదనలు
 నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లస్టాపింగ్‌కు ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై-హౌరా (కోరమండల్ ఎక్స్‌ప్రెస్), చెన్నై-న్యూఢిల్లీ (గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్) రైళ్లకు స్టాపింగ్‌కు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదే విధంగా నగరంలోని వేదాయపాళెం రైల్వేస్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇక్కడ కొన్ని ప్యాసింజర్ రైళ్లు, మెమో రైళ్లు ఆగుతుంటాయి. మరెన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని పలువురు కోరుతున్నారు. తిరుపతి-పూరి (పూరిఎక్స్‌ప్రెస్), చెన్నై-హైదరాబాద్(చెన్నై ఎక్స్‌ప్రెస్), చెన్నై-అండమాన్ (జమ్మూతావిఎక్స్‌ప్రెస్) రైళ్లను ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు.  
 
 మెమూ రైళ్లను పొడిగించాలి
 గుంటూరు, విజయవాడ నుంచి ఒం గోలు వరకు వచ్చే మెమూ రైళ్లను నెల్లూరు వరకు, చెన్నై, తిరుపతి నుంచి నెల్లూరు వరకు వచ్చే మెమూ రైళ్లను ఒంగోలు వరకు పొడిగించాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉంది. జిల్లా నుంచి నాగూరు- నాగపట్నం వరకు ప్రత్యేక రైళ్లు నడపాలని జిల్లా ప్రజల ప్రతిపాదన   చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement