సుప్రీం తీర్పుపై ఎవరేమన్నారు..
వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ గౌరవం విషయంలో ఈ తీర్పుతో కొత్త శకం మొదలైంది. సామాన్యుల వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసేందుకు ప్రభుత్వం, దాని ఏజెన్సీలు చేస్తున్న అతిక్రమణ, నిఘాకు ఇది చెంపపెట్టు. ఈ హక్కు కోసం కాంగ్రెస్, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ప్రతిపక్షాలు, కోర్టులో, పార్లమెంటులో కలసికట్టు గా పోరాడాయి. ప్రభుత్వ అహంకారపూరిత ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాం.
– సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఈ తీర్పు ప్రతి ఒక్క భారతీయుడి విజయం. ఫాసిస్టు శక్తులకు పెద్ద ఎదురుదెబ్బ. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం, గౌరవంలో గోప్యత హక్కు అంతర్భాగం. నిఘా వంటి చర్యలతో అణచివేయాలన్న బీజేపీ భావజాలానికి ఇది తిరుగులేని తిరస్కారం
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత ముఖ్యమైన తీర్పుల్లో ఇదొకటి. వ్యక్తిగత స్వేచ్ఛలో గోప్యత అత్యంత ముఖ్యమైంది. ఈ తీర్పుతో ఆర్టికల్ 21కి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.ఈ రోజు మనం మరోసారి స్వాతంత్య్ర సంబరాల్ని జరుపుకుంటున్నాం. భవిష్యత్తులో వ్యక్తిగత గోప్యతను దోచుకునేందుకు ప్రయత్నాలు జరిగినా ఆ సవాళ్లను కూడా అధిగమిస్తాం. సుప్రీం తీర్పు నేపథ్యంలో .. ఐపీసీ 377 కింద స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీం తీర్పును పునః పరిశీలించమని కోరే అవకాశముంది.
– చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి
వ్యక్తిగత గోప్యత హక్కును సుప్రీంకోర్టులో వ్యతిరేకించి మోదీ ప్రభుత్వం అవివేకంగా ప్రవర్తించింది. ఈ అంశంలో ప్రభుత్వ వైఫల్యం దాని సంకుచిత మనస్తత్వాన్ని ప్రతిఫలిస్తుంది. సుప్రీం తీర్పు చరిత్రాత్మకం, ప్రగతిశీలం. వ్యక్తిగత ఇల్లు, వివాహాలు, లైంగిక ధోరణి, స్వేచ్ఛగా తిరిగే హక్కు, నచ్చింది తినే హక్కు, ఒంటరిగా ఉండే హక్కుకు ఇంట్లో, బహిరంగ పదేశాల్లో తప్పనిసరిగా సంపూర్ణ రక్షణ ఉంది.
– కపిల్ సిబల్, పిటిషనర్ల తరఫు న్యాయవాది
తన పాత తీర్పుల్ని మార్చేందుకు వెనకాడమనే మంచి సంప్రదాయాన్ని సుప్రీంకోర్టు చాటిచెప్పింది. ఇది చాలా ప్రగతిశీల తీర్పు. అయితే ఆధార్‌ను నిషేధించాలని మాత్రం ఎవరూ డిమాండ్ చేయలేరు. ఏ ప్రాథమిక హక్కు సంపూర్ణ హక్కు కాదు. కొన్ని పరిమితులుంటాయి.
– సోలీ సొరాబ్జీ, మాజీ అటార్నీ జనరల్
‘ సుప్రీంకోర్టు తీర్పు మోదీ ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగానే ఉంది. ఇది ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను సుదృఢం చేస్తుంది. ఈరోజు గోప్యత గురించి రాద్ధాంతం చేస్తున్న వారంతా(కాంగ్రెస్) దశాబ్దాలుగా మనకు ఈ విషయంలో పటిష్ట చట్టం లేకుండా చేశారు. ఆధార్ గురించి మాట్లాడుతున్న వారు కూడా దానికి చాలా ఏళ్ల పాటు చట్ట బద్ధత చేకూర్చలేకపోయారు. ఎమర్జెన్సీ పేరిట ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను లాగేసుకున్న వారే నేడు ప్రాథమిక హక్కులకు అంగరక్షకులమని నాటకాలు ఆడుతున్నారు’ – అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు