Rail projects
-
ఔటర్ రింగ్ రైల్ సర్వే షురూ!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ నిర్మించబోయే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పనులకు శ్రీకారం చుట్టింది. స్థూలంగా లైన్ మార్గం ఎలా ఉండాలో డెస్‌్కటాప్ స్టడీ మొదలుపెట్టింది. ఇది పూర్తి కాగానే, హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే ప్రారంభించనుంది. దీని ద్వారా అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్మెంట్ సిద్ధమవుతుంది. హైదరాబాద్‌కు అన్నివైపులా విస్తరించి ఉన్న ఔటర్ రింగురోడ్డు చుట్టూ 50 కి.మీ. నుంచి 70 కి.మీ.దూరంలో రీజినల్ రింగురోడ్డును నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 158 కి.మీ. నిడివి గల ఉత్తర భాగానికి కేంద్రప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవబోతోంది. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇక దాదాపు 182 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంటును రూపొందించి ఎన్హెచ్ఏఐకి సమర్పించింది. త్వరలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే దానికి ఆమోదముద్ర పడనుంది. ఈ రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ ఔటర్ రింగ్ రైల్ పేరుతో రైల్వే లైన్ నిర్మించేందుకు కూడా కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. గతేడాది ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ రూ.13.95 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పనులు మొదలయ్యాయి. ఆ అలైన్‌మెంటు కోసం ఎన్హెచ్ఏఐని కోరిన రైల్వే ఉత్తర భాగం రింగురోడ్డు అలైన్‌మెంటు ఇప్పటికే ఖరారైంది. కానీ, దక్షిణ రింగురోడ్డు అలైన్‌మెంటు ఖరారు కాలేదు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐని కోరిన రైల్వే అధికారులు అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రాథమిక అలైన్‌మెంటు సిద్ధం చేసుకుని, వెంటనే ఏరియల్ లైడార్ సర్వే ప్రారంభిస్తారు. హెలికాప్టర్లో లైడార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని.. 300 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంటు కోసం 3డీ మ్యాపింగ్ చేస్తారు. నీటి వనరులు, కాలువలు, గుట్టలు, నిర్మాణాలు.. ఇలాంటి వాటిని గుర్తించి తదనుగుణంగా మార్గాన్ని ఖరారు చేస్తారు. గ్రేడియంట్ ఆధారంగా స్టేషన్ల పాయింట్లను కూడా గుర్తిస్తారు. అక్షాంశరేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్‌మెంటు ఖరారు చేస్తారు. దాన్ని 3డీ మ్యాపింగ్ చేస్తారు. భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున, దీని వల్ల ఆదాయం ఎంత ఉంటుందని తేల్చే రేట్ ఆఫ్ రిటర్న్స్ (ఆర్ఓఆర్) ట్రాఫిక్ సర్వే కూడా చేయనున్నారు. ఆదాయం బాగా ఉంటుందని తేలితే రెండో లైన్ కోసం కూడా ప్రతిపాదిస్తారు. ముందుగా ఒక్క లైన్‌ను మాత్రమే నిర్మిస్తారు. లైన్‌తోపాటు విద్యుదీకరణ పనులను కూడా సమాంతరంగా చేపట్టనున్నట్టు తెలిసింది. సరుకు రవాణా రైళ్లకూ ప్రాధాన్యం రింగురోడ్డును ఆసరా చేసుకుని రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మించటం దేశంలోనే తొలిసారి. దీన్ని కూడా సరుకు రవాణా రైళ్లకు ఎక్కువగా ఉపయోగపడేలా చూస్తున్నారు. ప్రస్తుతం గూడ్సు రైళ్లు సికింద్రాబాద్ లాంటి రద్దీ స్టేషన్ల గుండా సాగాల్సి వస్తోంది. అయితే ఔటర్‌రింగ్ రైల్ కారిడార్ పలు రైల్వే మార్గాలతో అనుసంధానమై ఉండటంతో సరుకు రవాణా రైళ్లు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే గమ్యం వైపు పరుగుపెట్టే వీలు కలుగుతుంది. ఇది రైల్వే ట్రాఫిక్‌కు కూడా రిలీఫ్ క ల్పిస్తుంది. 536 కి.మీ... రూ.12 వేల కోట్లు.. ♦ రీజినల్ రింగురోడ్డు దాదాపు 343 కి.మీ. నిడి వి ఉండనుండగా, దాని చుట్టూ విస్తరించే రైల్వే లైన్ మాత్రం దాదాపు 536 కి.మీ. నిడివితో ఉండనుంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12వేల కోట్లుగా అంచనా. ♦ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. రైల్వే ట్రాక్ మీదుగా రోడ్డును నిర్మించినట్టుగానే ఆయా ప్రాంతాల్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జిలను నిరి్మస్తారు. అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో ఆ తరహా వంతెనలు నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ♦ ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. ♦ 75 మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది. స్టేషన్ ఉండే చోట రెండు కి.మీ. పొడవుతో 200 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. ♦ ఈ ప్రాజెక్టులో ప్రతి కి.మీ.కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది. భూసేకరణలో సగం మొత్తాన్ని కేంద్రం భరించనుంది. -
విశాఖ టు శంషాబాద్ ఇక 4.30 గంటలే
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్‌సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది... హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్‌లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగో టర్మినల్‌గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. -
హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగేసింది. ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చజెండా ఊపింది. ఇందు కోసం రూ.14 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. ఓవైపు రీజనల్ రింగ్ రోడ్డు, మరో వైపు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు.. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల మూలంగా హైదరాబాద్ నగరంతో పాటు, నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన సానుకూల మార్పులు రావడం ఖాయమన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. హైదరాబాద్ నలువైపుల ఉన్నటువంటి రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. ప్రజారవాణాతో పాటుగా వస్తువుల రవాణా కూడా పెరిగి, వ్యాపారపరంగా గణనీయమైన అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన అన్నారు. ఇదివరకూ రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం లభిస్తుందని, ఆయా ప్రాంతాల నుండి హైదరాబాద్ నగరానికి తొందరగా, ఈజీగా చేరుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టుక్కల వచ్చే పరిశ్రమలు, మాల్స్, వినోద కేంద్రాలు, శాటిలైట్ టౌన్స్ మొదలైన వాటి ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని, దీని ద్వారా విద్య, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరగటంతో పాటు, మెడికల్ సౌకర్యాలు కూడా సమయానికి అందుబాటులో ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో ఈ సరికొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా సౌలభ్యం చాలా పెరుగుతుందన్నారు. ఓవరాల్‌గా హైదరాబాద్‌తోపాటుగా తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా మారనుందని ఆయన అన్నారు. దీంతో పాటుగా కరీంనగర్-హసన్‌పర్తి మధ్య 61 కిలోమీటర్ల రైల్వే లైన్ సర్వే కోసం కోటిన్నర రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.330 కోట్లతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం మూడింట రెండొంతుల ఖర్చును (2/3) రాష్ట్రం భరించాల్సిన ఉన్నా.. వారు ముందుకు రాకపోవడంతో మొత్తం ఖర్చును కేంద్రమే భరించేందుకు ముందుకొచ్చిందన్నారు. రాష్ట్రాల్లో జరిగే అభివృద్ధి పనులకు.. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మూలధన వ్యయాలకు సమయానుగుణంగా మరింత సహకారాన్ని అందించేందుకు 2020-21లో కేంద్రం ప్రారంభించిన ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,102 కోట్లను కేంద్రం మంజూరుచేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రాలకు జరిగిన నష్టం నుంచి కొంతమేరకు ఉపశమనం కల్గించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాలకు గానూ వడ్డీ లేని రుణంగా.. ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020-21 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసింది. చదవండి: ఈటలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ పథకాలను, కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయటానికి, అభివృద్ధి చెందుతున్న వ్యాధుల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని అందించటానికి వీలుగా అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కిషన్ రెడ్డి తెలిపారు. అయితే జినోమ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్రం ఇంతవరకు బదలాయించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టని.. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే గోవాలో ముగిసిన జీ20 పర్యాటక మంత్రుల స్థాయి సమావేశాలు చాలా ఫల ప్రదంగా జరిగాయని, గోవా రోడ్ మ్యాప్ ద్వారా ప్రపంచ పర్యాటక రంగాభివృద్ధితోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారత పర్యాటకాన్నిసరికొత్త పుంతలు తొక్కించేందుకు.. సెప్టెంబర్‌లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం మార్పుపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని ఆయన అన్నారు. -
సెమీ హైస్పీడ్ రైలు దూసుకొస్తోంది!
సాక్షి, హైదరాబాద్ : సెమీ హైస్పీడ్ రైలు.. ఇది పట్టాలెక్కితే, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ రెండు ముఖ్య నగరాల మధ్య గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. రష్యన్ రైల్వేస్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం, సాధ్యాసాధ్యాలపై ఆ దేశ రైల్వే అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం కొద్ది రోజుల క్రితమే భారతీయ రైల్వే బోర్డుకు తుది నివేదికను అందజేసింది. దీనిపై రష్యన్ అధికారుల బృందం మూడు దఫాలుగా అధ్యయనం చేసింది. రెండేళ్ల క్రితం కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును రష్యన్ రైల్వేస్, భారతీయ రైల్వే 50:50 చొప్పున భరించేలా ఒప్పందం కుదిరింది. ట్రాక్ సామర్థ్యం పెంపు, వంతెనలు, ట్రైన్ నిర్మాణం తదితర అంశాలపై సమర్పించిన తుది నివేదికను ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉండటంతో ఏ క్షణంలోనైనా పనులు ప్రారంభం కావచ్చునని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు దశల్లో ప్రాజెక్టు.. సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మార్గాన్ని రెండు దశల్లో పూర్తి చేస్తారు. నాగ్‌పూర్ నుంచి బల్లార్ష వరకు, బల్లార్ష నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రాజెక్టు చేపడతారు. ఈ మార్గంలో 1770 బ్రిడ్రిలు, కల్వర్టులు ఉన్నట్లు రష్యన్ అధికారుల బృందం అంచనా వేసింది. వీటిలో వంద మీటర్ల పొడవైన పెద్ద బ్రిడ్జిలు 18 ఉన్నాయి. సెమీ హైస్పీడ్ రైలు వేగాన్ని తట్టుకొనేందుకు అనుగుణంగా ఈ వంతెనల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. ఇప్పుడున్న ట్రాక్ 80 – 120 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే తట్టుకోగలుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు రాకపోకలు సాగిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, 7.50 గంటల వ్యవధిలో గమ్యం చేరుతోంది. మిగతా రైళ్లు గంటకు 60 – 80 కి.మీ. వేగంతో 10 గంటల్లో చేరుకుంటున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వందలాది రైళ్లకు గ్రాండ్ ట్రంక్ లైన్ అయిన సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య సెమీ హై స్పీడ్ కారిడార్ ఏర్పాటైతే, ప్రయాణికులకు అత్యధిక వేగంతో కూడిన రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ–లక్నో మధ్య మొట్ట మొదటిప్రైవేట్ రైలు తేజాస్ గంటకు 200 కి.మీ. వేగంతో నడుస్తోంది. సెమీ హైస్పీడ్ రైలు ప్రత్యేకతలు.. గంటకు ప్రయాణ వేగం - 200కి.మీ. సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య దూరం- 577కి.మీ. ప్రయాణ సమయం.. - 3గంటలు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం- రూ.3 వేల కోట్లు (అంచనా) నిర్మాణ లక్ష్యం- ఐదేళ్లు -
అభివృద్ధి రైలు పట్టాలెక్కేనా?
నెల్లూరు (నవాబుపేట) : కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి రైల్వే బడ్జెట్‌ను పార్లమెంట్లో మంగళవారం ప్రవేశ పెట్టనుంది. జిల్లాలో రైల్వేపరమైన అభివృద్ధి దశాబ్దాలుగా సర్వేలు, ప్రతిపాదనలు, మంజూ రుకే పరిమితమైంది. జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి వర్గంలో ఉండటంతో ఈ దఫా అయినా జిల్లాకు అభివృద్ధి రైలొస్తుందని ప్రజానీకం ఆశిస్తోంది. రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. జిల్లాకు గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు రైలు ప్రాజెక్టులు, రైలు మార్గాలు కేటాయించారు. అయితే ఇందుకు సంబంధించి శంకుస్థాపనలు జరిగినా నిధులు మంజూరు జరగలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగా రాష్ట్రం 50 శాతం భరించే విధంగా నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా తొలుత నిధులు కేటాయిస్తోంది. వాటిలో కొన్ని పరిశీలిస్తే.. * బిట్రగుంటలో కాంక్రీటు స్లీపర్ల డిపోకు 2004 సెప్టెంబర్ 17న అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రగతి అతీగతీ లేదు. * శ్రీకాళహస్త్రి-నడికుడి రైల్వే మార్గానికి 2010-11 బడ్జెట్లో మోక్షం లభించినప్పటికీ ఇంత వరకు ముందడుగు లేదు. 2005, 2007లో సర్వే చేయగా రైల్వే మార్గం నిర్మాణానికి రూ.1300 కోట్లకు పైగా అంచనా వేశారు. గతేడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించినప్పటికీ పనులు జరగలేదు. ఈ రైలు మార్గం ఏర్పడితే జిల్లాలోని రాపూరు, పొదలకూరు, ఆత్మకూరు, కలిగిరి, వింజమూరు ప్రాంతాల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఈ మార్గంలో దాదాపు 160 కి.మీ దూరం తగ్గుతుంది. * గూడూరు-దుగ్గరాజుపట్నం రైలు మార్గంకు సర్వే చేయగా రూ.280 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.1.50 కోట్లు కేటాయించింది. దీంతో ఈ మార్గం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. * కృష్ణపట్నం పోర్టు నుంచి ఓబులాపురంపల్లి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ ప్రాంతంలో భూసేకరణ చేశారు. అప్పట్లో రూ.930 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీంతో 2011 రాష్ట్ర బడ్జెట్లో రూ.6 కోట్లు కేటాయించారు. * కృష్ణపట్నం-వెంకటాచలం మధ్య రెండు లైన్లు రైల్వేట్రాక్‌ను నిర్మిస్తున్నారు. 2011 బడ్జెట్లో రూ.87 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదికి రూ.25 కోట్లకు పైగా ఆదాయం ఉన్నా... నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి రోజుకు దాదాపు రూ.7 నుంచి రూ.8 లక్షలు వరకు ఆదాయం వస్తుంది. అంటే ఏడాదికి దాదాపు రూ.25 కోట్లకు పైగా ఆదాయాన్ని రైల్వే శాఖకు చేకూరుతున్నా రైల్వేస్టేషన్ అభివృద్ధికి మాత్రం నోచుకోవడంలేదు. రైల్వే శాఖలో ఏ గ్రేడ్ ఆదాయం కలిగిన నెల్లూరు రైల్వేస్టేషన్‌కు వసతులు నామమాత్రంగా ఉన్నాయి. ప్రధానంగా గూడూరు, కావలి, వెంకటగిరి రైల్వేస్టేష న్ల నుంచి ఎగుమతులు, దిగుమతులు, ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయాన్ని లభిస్తోంది. మొత్తంగా జిల్లా నుంచి రైల్వే శాఖ వంద కోట్లకుపైగా లాభాలొస్తున్నట్లు అంచనా. బిట్రగుంట భవిత మారేనా? మూడు దశాబ్దాలకు పైగా బిట్రగుంటలో రైల్వేపరమైన ప్రగతి కాగితాలకే పరిమితమవుతుంది. వేలాది ఎకరాలు, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ బిట్రగుంట ప్రగతి భవిత రైలు పట్టాలు ఎక్కించేందుకు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆసక్తి చూపడంలేదు. ‘లిటిల్ ఇంగ్లాండ్’గా పేరుగాంచిన బిట్రగుంటలో ఆసియాలోనే ప్రఖ్యాతగాంచిన లోకోషెడ్ ఆ నాడు వేలాది మంది కార్మికులతో నిత్యం కలకలలాడుతుండేది. ప్రస్తుతం చెట్లపొదలతో నిండిపోయి అటవీప్రాంతాన్ని తలపిస్తోంది. ఇక్కడ రైలు ఇంజన్ మరమ్మతుల కర్మాగారం నెలకొల్పాలని పలువురు కోరుతున్నారు. పలు రైళ్లకు స్టాపింగ్ ప్రతిపాదనలు నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్లో పలు రైళ్లస్టాపింగ్కు ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై-హౌరా (కోరమండల్ ఎక్స్‌ప్రెస్), చెన్నై-న్యూఢిల్లీ (గరీబ్థ్ ్రఎక్స్‌ప్రెస్) రైళ్లకు స్టాపింగ్‌కు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదే విధంగా నగరంలోని వేదాయపాళెం రైల్వేస్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇక్కడ కొన్ని ప్యాసింజర్ రైళ్లు, మెమో రైళ్లు ఆగుతుంటాయి. మరెన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని పలువురు కోరుతున్నారు. తిరుపతి-పూరి (పూరిఎక్స్ప్రెస్), చెన్నై-హైదరాబాద్(చెన్నై ఎక్స్‌ప్రెస్), చెన్నై-అండమాన్ (జమ్మూతావిఎక్స్ప్రెస్) రైళ్లను ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. మెమూ రైళ్లను పొడిగించాలి గుంటూరు, విజయవాడ నుంచి ఒం గోలు వరకు వచ్చే మెమూ రైళ్లను నెల్లూరు వరకు, చెన్నై, తిరుపతి నుంచి నెల్లూరు వరకు వచ్చే మెమూ రైళ్లను ఒంగోలు వరకు పొడిగించాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉంది. జిల్లా నుంచి నాగూరు- నాగపట్నం వరకు ప్రత్యేక రైళ్లు నడపాలని జిల్లా ప్రజల ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది.