సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్‌ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్‌లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్‌సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు.
శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్‌లలో రాకపోకలు సాగిస్తున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది.
ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది...
హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్‌లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మించారు.
ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు.
చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు..
గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగో టర్మినల్‌గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్‌లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment