రీజినల్ రింగురోడ్డు అనుసంధాన రైల్వే ప్రాజెక్టులో కదలిక
గతేడాది ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రూ.13.95 కోట్లు మంజూరు
ఇప్పుడు ప్రాథమిక డెస్క్‌టాప్ స్టడీ మొదలు... త్వరలో హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే
ఉత్తర రింగు రోడ్డులో స్పష్టత.... దక్షిణ రింగు వివరాలు కోరిన రైల్వే శాఖ
నిడివి దాదాపు 536 కి.మీ., ప్రాథమిక అంచనా వ్యయం రూ.12వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ నిర్మించబోయే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు అలైన్‌మెంట్ రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పనులకు శ్రీకారం చుట్టింది. స్థూలంగా లైన్ మార్గం ఎలా ఉండాలో డెస్‌్కటాప్ స్టడీ మొదలుపెట్టింది. ఇది పూర్తి కాగానే, హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే ప్రారంభించనుంది. దీని ద్వారా అక్షాంశ రేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్‌మెంట్ సిద్ధమవుతుంది.
హైదరాబాద్‌కు అన్నివైపులా విస్తరించి ఉన్న ఔటర్ రింగురోడ్డు చుట్టూ 50 కి.మీ. నుంచి 70 కి.మీ.దూరంలో రీజినల్ రింగురోడ్డును నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే 158 కి.మీ. నిడివి గల ఉత్తర భాగానికి కేంద్రప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవబోతోంది. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇక దాదాపు 182 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంటును రూపొందించి ఎన్‌హెచ్‌ఏఐకి సమర్పించింది.
త్వరలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే దానికి ఆమోదముద్ర పడనుంది. ఈ రీజినల్ రింగురోడ్డును అనుసరిస్తూ ఔటర్ రింగ్ రైల్ పేరుతో రైల్వే లైన్ నిర్మించేందుకు కూడా కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. గతేడాది ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ రూ.13.95 కోట్లను మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పనులు మొదలయ్యాయి.
ఆ అలైన్‌మెంటు కోసం ఎన్‌హెచ్‌ఏఐని కోరిన రైల్వే
ఉత్తర భాగం రింగురోడ్డు అలైన్‌మెంటు ఇప్పటికే ఖరారైంది. కానీ, దక్షిణ రింగురోడ్డు అలైన్‌మెంటు ఖరారు కాలేదు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐని కోరిన రైల్వే అధికారులు అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రాథమిక అలైన్‌మెంటు సిద్ధం చేసుకుని, వెంటనే ఏరియల్ లైడార్ సర్వే ప్రారంభిస్తారు. హెలికాప్టర్‌లో లైడార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని.. 300 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంటు కోసం 3డీ మ్యాపింగ్ చేస్తారు. నీటి వనరులు, కాలువలు, గుట్టలు, నిర్మాణాలు.. ఇలాంటి వాటిని గుర్తించి తదనుగుణంగా మార్గాన్ని ఖరారు చేస్తారు.
గ్రేడియంట్ ఆధారంగా స్టేషన్ల పాయింట్లను కూడా గుర్తిస్తారు. అక్షాంశరేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్‌మెంటు ఖరారు చేస్తారు. దాన్ని 3డీ మ్యాపింగ్ చేస్తారు. భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున, దీని వల్ల ఆదాయం ఎంత ఉంటుందని తేల్చే రేట్ ఆఫ్ రిటర్న్స్ (ఆర్‌ఓఆర్) ట్రాఫిక్ సర్వే కూడా చేయనున్నారు. ఆదాయం బాగా ఉంటుందని తేలితే రెండో లైన్ కోసం కూడా ప్రతిపాదిస్తారు. ముందుగా ఒక్క లైన్‌ను మాత్రమే నిర్మిస్తారు. లైన్‌తోపాటు విద్యుదీకరణ పనులను కూడా సమాంతరంగా చేపట్టనున్నట్టు తెలిసింది.
సరుకు రవాణా రైళ్లకూ ప్రాధాన్యం
రింగురోడ్డును ఆసరా చేసుకుని రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మించటం దేశంలోనే తొలిసారి. దీన్ని కూడా సరుకు రవాణా రైళ్లకు ఎక్కువగా ఉపయోగపడేలా చూస్తున్నారు. ప్రస్తుతం గూడ్సు రైళ్లు సికింద్రాబాద్ లాంటి రద్దీ స్టేషన్ల గుండా సాగాల్సి వస్తోంది. అయితే ఔటర్‌రింగ్ రైల్ కారిడార్ పలు రైల్వే మార్గాలతో అనుసంధానమై ఉండటంతో సరుకు రవాణా రైళ్లు నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే గమ్యం వైపు పరుగుపెట్టే వీలు కలుగుతుంది. ఇది రైల్వే ట్రాఫిక్‌కు కూడా రిలీఫ్ క ల్పిస్తుంది.
536 కి.మీ... రూ.12 వేల కోట్లు..
♦ రీజినల్ రింగురోడ్డు దాదాపు 343 కి.మీ. నిడి వి ఉండనుండగా, దాని చుట్టూ విస్తరించే రైల్వే లైన్ మాత్రం దాదాపు 536 కి.మీ. నిడివితో ఉండనుంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.12వేల కోట్లుగా అంచనా.
♦ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన రైల్వే లైన్లను అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. రైల్వే ట్రాక్ మీదుగా రోడ్డును నిర్మించినట్టుగానే ఆయా ప్రాంతాల్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జిలను నిరి్మస్తారు. అక్కన్నపేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో ఆ తరహా వంతెనలు నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
♦ ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు.
♦ 75 మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది. స్టేషన్ ఉండే చోట రెండు కి.మీ. పొడవుతో 200 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు.
♦ ఈ ప్రాజెక్టులో ప్రతి కి.మీ.కు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుంది. భూసేకరణలో సగం మొత్తాన్ని కేంద్రం భరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment