సాక్షి, హైదరాబాద్ : సెమీ హైస్పీడ్ రైలు.. ఇది పట్టాలెక్కితే, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ రెండు ముఖ్య నగరాల మధ్య గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. రష్యన్ రైల్వేస్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం, సాధ్యాసాధ్యాలపై ఆ దేశ రైల్వే అధికారులు, సాంకేతిక నిపుణుల బృందం కొద్ది రోజుల క్రితమే భారతీయ రైల్వే బోర్డుకు తుది నివేదికను అందజేసింది. దీనిపై రష్యన్ అధికారుల బృందం మూడు దఫాలుగా అధ్యయనం చేసింది. రెండేళ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును రష్యన్ రైల్వేస్, భారతీయ రైల్వే 50:50 చొప్పున భరించేలా ఒప్పందం కుదిరింది. ట్రాక్ సామర్థ్యం పెంపు, వంతెనలు, ట్రైన్ నిర్మాణం తదితర అంశాలపై సమర్పించిన తుది నివేదికను ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉండటంతో ఏ క్షణంలోనైనా పనులు ప్రారంభం కావచ్చునని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రెండు దశల్లో ప్రాజెక్టు..
సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మార్గాన్ని రెండు దశల్లో పూర్తి చేస్తారు. నాగ్‌పూర్ నుంచి బల్లార్ష వరకు, బల్లార్ష నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రాజెక్టు చేపడతారు. ఈ మార్గంలో 1770 బ్రిడ్రిలు, కల్వర్టులు ఉన్నట్లు రష్యన్ అధికారుల బృందం అంచనా వేసింది. వీటిలో వంద మీటర్ల పొడవైన పెద్ద బ్రిడ్జిలు 18 ఉన్నాయి. సెమీ హైస్పీడ్ రైలు వేగాన్ని తట్టుకొనేందుకు అనుగుణంగా ఈ వంతెనల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. ఇప్పుడున్న ట్రాక్ 80 – 120 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే తట్టుకోగలుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్‌కు రాకపోకలు సాగిస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, 7.50 గంటల వ్యవధిలో గమ్యం చేరుతోంది. మిగతా రైళ్లు గంటకు 60 – 80 కి.మీ. వేగంతో 10 గంటల్లో చేరుకుంటున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వందలాది రైళ్లకు గ్రాండ్ ట్రంక్ లైన్ అయిన సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య సెమీ హై స్పీడ్ కారిడార్ ఏర్పాటైతే, ప్రయాణికులకు అత్యధిక వేగంతో కూడిన రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ–లక్నో మధ్య మొట్ట మొదటిప్రైవేట్ రైలు తేజాస్ గంటకు 200 కి.మీ. వేగంతో నడుస్తోంది.
సెమీ హైస్పీడ్ రైలు ప్రత్యేకతలు..
- గంటకు ప్రయాణ వేగం - 200కి.మీ.
- సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య దూరం- 577కి.మీ.
- ప్రయాణ సమయం.. - 3గంటలు
- ప్రాజెక్టు నిర్మాణ వ్యయం- రూ.3 వేల కోట్లు (అంచనా)
- నిర్మాణ లక్ష్యం- ఐదేళ్లు
Comments
Please login to add a commentAdd a comment