విశాఖ కేంద్రంగా కొత్త జోన్!
రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదనలు!
విశాఖలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ
విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్క్యులర్ రైలు
సాక్షి, విజయవాడ బ్యూరో : మోడీ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న తొలి రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతోపాటు పలు కొత్త రైళ్లు, డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో ప్రత్యేక జోన్ ఏర్పాటును బడ్జెట్‌లో ప్రకటించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇందులోభాగంగా వాల్తేరు, గుంతకల్ డివిజన్లలో మార్పులు జరిపే అవకాశముంది.
వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న తెలుగు ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక డివిజన్‌గా ఏర్పాటు చేసి, మిగిలిన ఒరిస్సా ప్రాంతాలను నార్త్‌కోస్ట్ జోన్‌లో కలపనున్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటును ప్రతిపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గుంతకల్ డివిజన్ పరిస్థితి ఏమిటనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. విశాఖపట్నంలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. గతంలో ఈ ఫ్యాక్టరీ ఒరిస్సాకు తరలిపోయింది. అక్కడ దాన్ని ఏర్పాటు చేస్తే ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉండటంతో విశాఖపట్నంలో ఏర్పాటుచేయనున్నారు.
విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-నర్సాపురం-నిడదవోలు రైల్వే లైను డబ్లింగ్, విద్యుదీకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య మూడో రైల్వే లైనుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంలు పెంచడంతోపాటు సౌకర్యాలకు నిధులు కేటాయించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లోనూ ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయడానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్క్యులర్ రైలు నడిపేందుకు అనుమతి ఇవ్వనున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా ఢిల్లీకి ఒక రైలును నడిపేందుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే విశాఖపట్నం నుంచి రాయలసీమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు విశాఖ నుంచి కర్నూలుకు ఒక రైలును నడిపే సూచనలున్నాయి.