new Railway Zone
-
వార్షికాదాయ లక్ష్యం..రూ.20వేల కోట్లు!
విశాఖ కేంద్రంగా మంజూరైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖను జోన్ ప్రధాన కేంద్రం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇక్కడ ఉన్న రైల్వే డివిజన్‌ను విడగొట్టి రాయగడ, విజయవాడ డివిజన్లలో సర్దుబాటు చేసే ప్రక్రియతోపాటు.. రైల్వేజోన్ ఏర్పాట్లూ సాగుతున్నాయి. సరిహద్దులు, స్టేషన్లు, ఆదాయ వనరులు, సిబ్బంది, రైల్వే ప్రాజెక్టుల వర్గీకరణ వంటివాటికి ఒక రూపం ఇస్తున్నారు. ఈ వివరాలన్నింటితో రెండు నెలల్లో సమగ్ర నివేదిక(డీపీఆర్)ను రైల్వే బోర్డుకు అందజేయనున్నారు. ప్రధానంగా వాల్తేర్ డివిజన్ విభజన వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేస్తూ.. జోన్ పరిధిలో ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చర్యలు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగా వాల్తేరు డివిజన్‌ను విభజించి ఒక భాగాన్ని కొత్తగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్లో, మరో భాగాన్ని విజయవాడ డివిజన్లో కలిపేందుకు ఇప్పటికే మ్యాపింగ్ సిద్ధమవుతోంది. మరోవైపు దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను రెండు నెలల్లో సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కొత్త జోన్లో సుమారు 50 వేల మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. వాల్తేర్ డివిజన్ విభజనపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దానిపై కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ.. కొత్త జోన్‌కు అడ్డంకులు లేకపోవడంతో రైల్వే బోర్డు సన్నాహాలతో ముందుకెళ్తోంది. ప్రారంభంలోనే 50 వేల మంది సిబ్బంది.. కొత్త జోన్‌ను ఏదో నామమాత్రంగా కాకుండా పక్కాగానే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సాధారణంగా జోన్ ఏర్పాటు సమయంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచడం ఆనవాయితీ. కానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ మాత్రం 50 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్ కార్యాలయంలో 17,755 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయంలో 900 మంది ఉద్యోగులున్నారు. ఈ డివిజన్‌ను విడదీస్తున్నందున వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేస్తున్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్ కోస్ట్ జోన్ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లు కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండు నెలల్లో సమగ్ర నివేదిక.. కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) తయారీలో ఓఎస్డీతో పాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తలమునకలయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు కొత్త జోన్లో చేరుతున్నాయి. జోన్ స్వరూపం ఎలా ఉండాలి.. డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి.. జోన్ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు, ఉద్యోగుల విభజన, పని విభజన, తదితర అంశాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్ కేంద్రంగా కొత్తగా నడపాల్సిన రైళ్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం వివరాలు సేకరించామని.. మిగతా వివరాల సేకరించి.. డీపీఆర్ నివేదిక తయారీకి మరో రెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన జోన్లతో పోలిస్తే.. విశాఖ కేంద్రంగా> ఏర్పాటవుతున్న సౌత్ కోస్ట్ జోన్ పటిష్టంగా ఉండబోతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ జోన్ వార్షికాదాయం రూ.20 వేల కోట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు. -
రైల్వే జోన్లు కావాలంటున్న సచిన్, గడ్కరీ, అద్వానీ
న్యూఢిల్లీ : తమ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం మాములే. కానీ రైల్వే విషయంలో మాత్రం నేతల నుంచి కేంద్రానికి అధిక డిమాండ్లు వస్తున్నాయి. కేవలం మూడేళ్ల కాలంలో ఏకంగా 174 మంది ప్రముఖలు తమ పాంతాల్లో కొత్త రైల్వే జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. అందులో మాజీ రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్, శశి థరూర్ వంటి ప్రముఖలు ఉన్నారు. ఇందులో 55 మంది కొత్త రైల్వే జోన్ల అంశాన్ని ప్రస్తావించగా, 119 మంది రైల్వే డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. వీరిలో రైల్వే శాఖ సహాయ మంత్రి రాజేన్ గోహేన్ కూడా ఉండటం విశేషం. ఈ డిమాండ్లపై రైల్వే బోర్డు మాజీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రైల్వే జోన్లు ఏర్పాటు చేయడం రాజకీయాలతో ముడిపడిన అంశం. కమిటీలను ఏర్పాటు చేయడం.. వాటి అనుకూలతలను తెలుసుకోవడం జరుగుతుంది. కానీ అలా ఏర్పాటు చేసిన కమిటీలే రైల్వే జోన్ల సంఖ్యను తగ్గించాలని చెబుతున్నాయి. 2002-2003 మధ్య కాలంలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో నేతలు ఆయా ప్రాంతాల్లో రైల్వే జోన్లు, డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు. 2009-2013 మధ్య కాలంలో రైల్వే జోన్లకు సంబంధించి 92, డివిజన్లకు సంబంధించి 45 డిమాండ్లు వచ్చాయి. వీటిపై కమిటీ వేసి పరిశీలన జరపగా.. అందులో ఏ ఒక్క డిమాండ్ కూడా సముచితమైనది కాదని తేలిందని’ అన్నారు కొందరు ప్రముఖల డిమాండ్లు : 1. నితిన్ గడ్కరీ- నాగ్‌పూర్ కొత్త రైల్వే జోన్‌తో పాటు రైల్వే డివిజన్ 2. రాజేన్ గోహేన్- ఈశాన్య ప్రాంతాలకు కొత్త రైల్వే జోన్ 3. సచిన్ టెండూల్కర్- ముంబై సబ్ అర్బన్ రైల్వే జోన్ 4. శశి థరూర్- తిరువనంతపురం కొత్త రైల్వే జోన్, కానూర్ రైల్వే డివిజన్ 5. ఎల్కే అద్వానీ- గుజరాత్లో కొత్త రైల్వే జోన్ 6. యోగీ ఆదిత్యనాథ్- గోరఖ్‌పూర్ రైల్వే డివిజన్ 7. జితేంద్ర సింగ్- ఉదంపూర్‌లో రైల్వే డివిజన్ -
కొత్త రైల్వే జోన్ లేనట్టేనా?
- రైల్వే బడ్జెట్లో ప్రకటనపై ఆశలు అడియాశలేనా? - ఏపీలో కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదని సంకేతాలిచ్చిన రైల్వే శాఖ - బాబు, కేంద్ర మంత్రులపై మండిపడుతోన్న - రైల్వే జోన్ సాధన సమితి నేతలు సాక్షి, హైదరాబాద్: కొత్త రైల్వే జోన్‌పై ఆశలు అడియాశలేనా? గురువారం రైల్వే బడ్జెట్ సందర్భంగా ఏపీకి కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదా? విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తారని ఊదరగొట్టిన ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి తీసుకురాలేకపోయారా? విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారా? రైల్వే మంత్రిత్వ శాఖ, ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇస్తున్న సంకేతాల్ని చూస్తే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల త నను కలిసిన ఉత్తరాంధ్ర ఎంపీలకు.. మంత్రి సురేశ్ ప్రభు ఏపీలో కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదన్నట్టుగానే చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద ఓ కార్యకర్త అడిగిన సమాచారానికి రైల్వే శాఖ ఇచ్చిన వివరణను చూసినా కొత్త జోన్ ఉండబోదనే అభిప్రాయమే కలుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై విశాఖపట్నం, విజయవాడ డివిజన్లు పోటీ పడ్డాయి. ఉత్తర, దక్షిణ భారతావనిలను కలిపే విజయవాడ డివిజన్‌ను కొత్త రైల్వే జోన్‌గా ప్రకటించాలని ఒకవైపు, విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ (ఈస్ట్ కోస్ట్ రైల్వే)ను జోన్‌గా ప్రకటించాలని మరోవైపు గట్టిగా డిమాండ్లు వచ్చాయి. రాజధాని ప్రాంత ప్రకటన సందర్భంగా.. విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఉంటుందని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అయినా సరే జోన్‌ను సాధిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అధ్యయనానంతరం ఆర్నెల్లలో ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కొత్త జోన్‌పై ప్రకటన చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పింది. అయితే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్ధా రోడ్, సంబల్పూర్, వాల్తేరు డివిజన్లలో మన రాష్ట్రంలోని వాల్తేరు డివిజన్ నుంచే ఈస్ట్ కోస్ట్ రైల్వేకు గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. దీంతో ఈ డివిజన్‌ను వదులుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదు. 2,122 కిలోమీటర్ల ట్రాక్ సామర్ధ్యం ఉన్న ఈ డివిజన్‌కు ఏడాదికి రూ.7 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఈ దృష్ట్యానే ఒడిశా ముఖ్యమంత్రి, ఎంపీలు ప్రధాని మోదీని కలిసి వాల్తేరు డివిజన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి తప్పించవద్దంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు. మరోవైపు కొత్త జోన్ ఏర్పాటుపై నియమించిన కమిటీ కూడా ఇందుకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశాఖ రైల్వే జోన్ అటకెక్కిందని ఉన్నతస్థాయి రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒడిశా మాదిరిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జోన్ సాధించుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్ర మంత్రులు విఫలమయ్యారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో విలీనం అయ్యింది. అప్పుడూ బాబుపై విమర్శలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లోనూ కొత్త జోన్ లేకపోవడం గమనార్హం. కొత్త రైళ్ల ప్రకటనకే పరిమితం! రైల్వే బడ్జెట్లో విశాఖపట్నం మీదుగా మూడు కొత్త రైళ్ల ప్రకటన మాత్రమే ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అదీ వీక్లీ, బై వీక్లీ రైళ్ళు మాత్రమేనని తెలుస్తోంది. వీక్లీ రైళ్ళుగా విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-న్యూఢిల్లీ (వయా రాయపూర్) సూపర్ ఫాస్ట్, బై వీక్లీగా (వారానికి రెండు సార్లు) భువనేశ్వర్-బెంగళూరు రైళ్లను ప్రకటిస్తారని సమాచారం. -
ఒడిశా ఒత్తిడితోనే జోన్ గల్లంతు!
సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు దాదాపు ఖాయమైనా, దాని ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకపోవడానికి ఒడిశా ప్రభుత్వం ఒత్తిడే కారణమని తెలిసింది. వాల్తేరు డివిజన్లో భాగంగా ఉన్న విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంది. ఇక్కడ కొత్త జోన్ ఏర్పాటు చేస్తే ఒడిశా ప్రాంతాలను వాల్తేరు డివిజన్‌ను నుంచి వేరుచేసి, తెలుగు ప్రాంతాలను మాత్రమే అందులో కొనసాగిస్తారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ డివిజన్ లేకపోతే ఆ జోన్‌కు ఆదాయం దారుణంగా పడిపోయి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని నరేం ద్ర మోడీని కలిసి ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరినట్టు సమాచారం. వాల్తేరు డివిజన్‌ను వేరే చేస్తే నార్త్ కోస్ట్ జోన్ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఆయన ప్రధానికి చెప్పినట్లు తెలిసింది. -
విశాఖ కేంద్రంగా కొత్త జోన్!
రైల్వే బడ్జెట్లో ప్రతిపాదనలు! విశాఖలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్క్యులర్ రైలు సాక్షి, విజయవాడ బ్యూరో : మోడీ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న తొలి రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతోపాటు పలు కొత్త రైళ్లు, డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో ప్రత్యేక జోన్ ఏర్పాటును బడ్జెట్లో ప్రకటించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇందులోభాగంగా వాల్తేరు, గుంతకల్ డివిజన్లలో మార్పులు జరిపే అవకాశముంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న తెలుగు ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక డివిజన్‌గా ఏర్పాటు చేసి, మిగిలిన ఒరిస్సా ప్రాంతాలను నార్త్‌కోస్ట్ జోన్లో కలపనున్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటును ప్రతిపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గుంతకల్ డివిజన్ పరిస్థితి ఏమిటనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. విశాఖపట్నంలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. గతంలో ఈ ఫ్యాక్టరీ ఒరిస్సాకు తరలిపోయింది. అక్కడ దాన్ని ఏర్పాటు చేస్తే ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉండటంతో విశాఖపట్నంలో ఏర్పాటుచేయనున్నారు. విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-నర్సాపురం-నిడదవోలు రైల్వే లైను డబ్లింగ్, విద్యుదీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారు. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య మూడో రైల్వే లైనుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంలు పెంచడంతోపాటు సౌకర్యాలకు నిధులు కేటాయించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లోనూ ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయడానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య సర్క్యులర్ రైలు నడిపేందుకు అనుమతి ఇవ్వనున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా ఢిల్లీకి ఒక రైలును నడిపేందుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే విశాఖపట్నం నుంచి రాయలసీమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు విశాఖ నుంచి కర్నూలుకు ఒక రైలును నడిపే సూచనలున్నాయి. -
'ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్'
భారతదేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశాకిరణం లాంటి వారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఆదివారం విశాఖపట్నంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ... కేంద్రంలో ఇంకా సీట్లు సర్ధుబాటు జరగలేదని... అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయిని ఆయన ఆరోపించారు. 100 ఏళ్లకుపైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిందని ఆయన గుర్తు చేశారు. అలాంటి పార్టీ దేశానికి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పర్యావరణం, అభివృద్ధిల మధ్య సమతుల్యత అవసరమని ఆయన పేర్కొన్నారు. సీఆర్‌జెడ్ ఏర్పాటుపై సమీక్షలు జరపాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్భంగా విశదీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టిందని వెంకయ్యనాయుడు వివరించారు. గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం చిత్తశుద్దితో వ్యవహరిస్తుందన్నారు. -
కొత్త రైల్వే జోన్‌తో చాలా సమస్యలు: ద.మ.రై జీఎం
కొత్త రైల్వేజోన్ ఏర్పాటు వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం డి.కె.శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్‌లో తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని చెప్పారు. నెలరోజుల్లో ఆ కమిటీ తన నివేదికను రైల్వేబోర్డుకు అందనుందని వెల్లడించారు. అయితే కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై తుది నిర్ణయం మాత్రం రైల్వే బోర్డుదే అని డి.కె.శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు కేటాయించాలని... అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. అందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులతో పాటు పలు నగరాలను ఆ ఉన్నత స్థాయి కమిటీ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కోసం పరిశీలించనుంది. నెలరోజుల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై వివిధ అంశాలతో కూడిన నివేదికను ఆ కమిటీ రైల్వే బోర్డుకు నివేదించనుంది. -
కొత్త రైల్వే జోన్ అవకాశం బెజవాడకే
రైల్వే శాఖ సన్నాహాలు మరో జోన్ కావాలని ఎప్పటినుంచో డిమాండ్ ఆదాయం బాగున్నా కేటాయింపుల్లో విదిలింపులే రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావస్తుండడంతో కొత్త జోన్ ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వే జోన్ కోసం విజయవాడ, విశాఖపట్నం మధ్య పోటీ నెలకొంది. విజయవాడ కేంద్రంగానే ఈ జోన్ ఏర్పాటవుతుందని అధికారులు చెబుతున్నారు. దక్షిణమధ్య రైల్వే చాలా పెద్ద జోన్ కావడంతో పరిపాలనాపరంగా కూడా మరో జోన్ కావాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. సాక్షి, విజయవాడ : దక్షిణ మధ్య రైల్వేలోనే అత్యధిక ఆదాయం సాధించే డివిజన్‌గా బెజవాడకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా అధిక ఆదాయం వస్తున్నా కేటారుుంపుల్లో మాత్రం చిన్నచూపే చూస్తున్నారు. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన విజయవాడ డివిజన్ ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే కీలక జంక్షన్. దీంతోపాటు కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా సరకు రవాణాపై ఆదాయం సమకూరుతోంది. కొన్నేళ్లుగా విజయవాడ డివిజన్ ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సరకు రవాణాపై కూడా ఏటా ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఎరువులు, సిమెంట్, బొగ్గు తదితరాల రవాణాకు విజయవాడ డివిజన్ కీలకంగా మారింది. మచిలీపట్నం పోర్టు కూడా కార్యరూపం దాలిస్తే డివిజన్ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తూర్పు రైల్వేలో ఉన్న విశాఖపట్నాన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేసే జోన్లో కలపాల్సిఉంటుంది. పెండింగ్ ప్రాజెక్టుల్లో కదలిక.. కొత్త జోన్ ఏర్పాటైతే నిధులు రావడం ద్వారా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో రైల్వే బడ్జెట్లో విజయవాడ డివిజన్‌కు మొండిచెయ్యే మిగులుతోంది. కొన్ని ప్రాజెక్టులు మంజూరు చేసినా వాటికి నిధులు మంజూరు కాకపోవడంతో ముందుకు కదలడం లేదు. 15 ఏళ్ల క్రితం మంజూరైన కాకినాడ-కోటిపల్లి-నర్సాపూర్ లైన్ ఇప్పటికీ పూర్తికాలేదు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు లైన్ పూర్తికాగా, కోటిపల్లి నుంచి నర్సాపూర్ లైన్ పెండింగ్‌లోనే ఉంది. కోటిపల్లి-నర్సాపూర్ మధ్య 57 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.695 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికి రూ.10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కాకినాడ-పిఠాపురం మధ్య 21 కిలోమీటర్ల లైన్‌కు రూ.85.51 కోట్లు బడ్జెట్ కాగా, ఇప్పటివరకు లక్షల్లోనే కేటాయింపులు జరిగాయి. ఓబులాపురం-కృష్ణపట్నం మధ్య 113 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.732.81 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటికి సగం ఖర్చు కూడా కాలేదు. రాయనపాడు వర్క్‌షాపు ఆధునికీకరణ కోసం రూ.12.61 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. నిధులు లేకపోవడంతో పనులు సాగడం లేదు. విజయవాడ ఎలక్ట్రికల్ లోకో షెడ్ సామర్థ్యాన్ని 120 ఇంజిన్ల నుంచి 175 ఇంజిన్లకు పెంచడానికి రూ.12.50 కోట్లు మంజూరై ఐదేళ్లు దాటినా నిధులు మాత్రం రావడం లేదు. గద్వాల్-రాయచోటి లైను నిర్మాణం, గుంతకల్-బెంగళూరు, సికిందరాబాద్-ముంబై మధ్య విద్యుదీకరణ పనులు కూడా ముందుకు సాగడం లేదు. కొవ్వూరు-భద్రాచలం, కృష్ణపట్నం-కడప రూట్లలో కొత్త రైలుమార్గం ఏర్పాటు గత బడ్జెట్లకే పరిమితమైంది. విజయవాడ డివిజన్‌కు పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ సెంటర్ వస్తుందని భావించారు. అదీ రాకపోవడం కొంత నిరాశకు గురిచేసింది. గుంటూరు-తెనాలి-విజయవాడ మధ్య, విశాఖపట్నానికి మెట్రో రైళ్లు వేస్తామన్న హామీలు కూడా నెరవేరతాయన్న ఆశ ఈ ప్రాంతంలో కనపడుతోంది.