కొత్త రైల్వేజోన్ ఏర్పాటు వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం డి.కె.శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్లో తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని చెప్పారు. నెలరోజుల్లో ఆ కమిటీ తన నివేదికను రైల్వేబోర్డుకు అందనుందని వెల్లడించారు. అయితే కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై తుది నిర్ణయం మాత్రం రైల్వే బోర్డుదే అని డి.కె.శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు కేటాయించాలని... అలాగే ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. అందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులతో పాటు పలు నగరాలను ఆ ఉన్నత స్థాయి కమిటీ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కోసం పరిశీలించనుంది. నెలరోజుల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై వివిధ అంశాలతో కూడిన నివేదికను ఆ కమిటీ రైల్వే బోర్డుకు నివేదించనుంది.