SCR GM
-
'అమరావతి రైల్వేలైన్ కోసం త్వరలో సర్వే'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి రైల్వే లైన్ కోసం త్వరలో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా తెలిపారు. ఈ సర్వే ప్రక్రియ ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రూ. 40 కోట్లతో వసతుల కల్పన చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే 9 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తామన్నారు. పుష్కారాల కోసం 500 ప్రత్యేక రైళ్లు, 2000 కోచ్‌లు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు మంగళగిరిలోని శ్రీపానకాల లక్ష్మీనరసింహస్వామిని రవీంద్రగుప్తా దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి త్వరలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్
నిజామాబాద్: కరీంనగర్ - నిజామాబాద్ రైల్వే లైన్ ఏడాదిలోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ వెల్లడించారు. మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీవాత్సవ మాట్లాడారు. హైదరాబాద్ నుంచి త్వరలో న్యూఢిల్లీకి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్ట్‌ల కోసం కృషి చేస్తామన్నారు. -
'వారం రోజుల్లో రైల్వేక్రాసింగ్‌ల వద్ద గేట్లు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల్లోగా కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య రేల్వే జీఎం శ్రీవాత్సవ గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అంతకు ముందు మెదక్ జిల్లాలో రైలు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్... జీ ఎం శ్రీవాత్సవతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఈ సందర్బంగా శ్రీవాత్సవకు విజ్ఞప్తి చేశారు. దాంతో వారం రోజుల్లోగా రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేస్తామని శ్రీవాత్సవ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హమీ ఇచ్చారు. -
కొత్త రైల్వే జోన్‌తో చాలా సమస్యలు: ద.మ.రై జీఎం
కొత్త రైల్వేజోన్ ఏర్పాటు వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం డి.కె.శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్‌లో తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని చెప్పారు. నెలరోజుల్లో ఆ కమిటీ తన నివేదికను రైల్వేబోర్డుకు అందనుందని వెల్లడించారు. అయితే కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై తుది నిర్ణయం మాత్రం రైల్వే బోర్డుదే అని డి.కె.శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేను తెలంగాణకు కేటాయించాలని... అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. అందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులతో పాటు పలు నగరాలను ఆ ఉన్నత స్థాయి కమిటీ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కోసం పరిశీలించనుంది. నెలరోజుల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై వివిధ అంశాలతో కూడిన నివేదికను ఆ కమిటీ రైల్వే బోర్డుకు నివేదించనుంది.