వార్షికాదాయ లక్ష్యం..రూ.20వేల కోట్లు! | Fastest Preparation For South Coast Railway Zone | Sakshi
Sakshi News home page

వార్షికాదాయ లక్ష్యం..రూ.20వేల కోట్లు!

Published Fri, Aug 30 2019 6:29 AM | Last Updated on Fri, Aug 30 2019 6:30 AM

Fastest Preparation For South Coast Railway Zone - Sakshi

విశాఖ కేంద్రంగా మంజూరైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖను జోన్‌ ప్రధాన కేంద్రం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఇక్కడ ఉన్న రైల్వే డివిజన్‌ను విడగొట్టి రాయగడ, విజయవాడ డివిజన్లలో సర్దుబాటు చేసే ప్రక్రియతోపాటు.. రైల్వేజోన్‌ ఏర్పాట్లూ సాగుతున్నాయి. సరిహద్దులు, స్టేషన్లు, ఆదాయ వనరులు, సిబ్బంది, రైల్వే ప్రాజెక్టుల వర్గీకరణ వంటివాటికి ఒక రూపం ఇస్తున్నారు. ఈ వివరాలన్నింటితో రెండు నెలల్లో సమగ్ర నివేదిక(డీపీఆర్‌)ను రైల్వే బోర్డుకు అందజేయనున్నారు. ప్రధానంగా వాల్తేర్‌ డివిజన్‌ విభజన వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేస్తూ.. జోన్‌ పరిధిలో ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చర్యలు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగా వాల్తేరు డివిజన్‌ను విభజించి ఒక భాగాన్ని కొత్తగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్‌లో, మరో భాగాన్ని విజయవాడ డివిజన్‌లో కలిపేందుకు ఇప్పటికే మ్యాపింగ్‌ సిద్ధమవుతోంది. మరోవైపు దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌ను రెండు నెలల్లో సిద్ధం చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కొత్త జోన్‌లో సుమారు 50 వేల మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. వాల్తేర్‌ డివిజన్‌ విభజనపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దానిపై కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ.. కొత్త జోన్‌కు అడ్డంకులు లేకపోవడంతో రైల్వే బోర్డు సన్నాహాలతో ముందుకెళ్తోంది.


ప్రారంభంలోనే 50 వేల మంది సిబ్బంది..
కొత్త జోన్‌ను ఏదో నామమాత్రంగా కాకుండా పక్కాగానే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రతిపాదనలు చేస్తున్నారు. సాధారణంగా జోన్‌ ఏర్పాటు సమయంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉండేవారు. క్రమంగా ఆ సంఖ్యను పెంచడం ఆనవాయితీ. కానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ మాత్రం 50 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్‌ కార్యాలయంలో 17,755 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వాల్తేర్‌ డీఆర్‌ఎం కార్యాలయంలో 900 మంది ఉద్యోగులున్నారు. ఈ డివిజన్‌ను విడదీస్తున్నందున వీరిని రెండు డివిజన్లకు సర్దుబాటు చేస్తున్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు సౌత్‌ కోస్ట్‌ జోన్‌ పరిధిలోకి వస్తున్నాయి. ఈ మూడు డివిజన్లు కలిపి మొత్తం 50 వేల ఉద్యోగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రెండు నెలల్లో సమగ్ర నివేదిక..
కొత్త జోన్‌ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు(డీపీఆర్‌) తయారీలో ఓఎస్‌డీతో పాటు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ అధికారులు తలమునకలయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు కొత్త జోన్‌లో చేరుతున్నాయి. జోన్‌ స్వరూపం ఎలా ఉండాలి.. డివిజన్లతో సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి.. జోన్‌ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు, ఉద్యోగుల విభజన, పని విభజన, తదితర అంశాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ కేటగిరీల రైల్వే స్టేషన్లు, వాటిని కొత్త జోన్‌లో అభివృద్ధి చేసేందుకు ఉన్న వనరులు, జోన్‌ కేంద్రంగా కొత్తగా నడపాల్సిన రైళ్ల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం వివరాలు సేకరించామని.. మిగతా వివరాల సేకరించి.. డీపీఆర్‌ నివేదిక తయారీకి మరో రెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన జోన్లతో పోలిస్తే.. విశాఖ కేంద్రంగా> ఏర్పాటవుతున్న సౌత్‌ కోస్ట్‌ జోన్‌ పటిష్టంగా ఉండబోతోందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ జోన్‌ వార్షికాదాయం రూ.20 వేల కోట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement