సాక్షి, గాజువాక(విశాఖ) : రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులను గాజువాక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో రైల్వే ఉద్యోగులైన మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కె.రఘునాథరావు, పి.శ్రీనివాసరావు పలువురు నిరుద్యోగులను నమ్మించారు. ఇద్దరు రైల్వే ఉద్యోగుల అండతో 2017, 2018వ సంవత్సరంలో 43 మంది నుంచి రూ.2.50కోట్లు వసూలు చేశారు.
ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారు. వారికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లను కూడా తయారు చేసి ఇవ్వడంతోపాటు వైద్య పరీక్షలను కూడా చేయించి ఉద్యోగాల్లో చేరాలని చెప్పారు. నిరుద్యోగులు ఆ ఆర్డర్లను తీసుకొని భువనేశ్వర్‌లోని ఈస్టుకోస్టు రైల్వే ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ ఆర్డర్లను పరిశీలించిన రైల్వే అధికారులు అవి నకిలీ ఉత్తర్వులని నిర్థారించారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అప్పటి నుంచి నిందితుల కోసం గాలిస్తున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడటంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు గాజువాక సీఐ సూరినాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment