సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఈసారి రైల్వేబడ్జెట్‌లో రూ.4,400 కోట్లు కేటాయించామని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి స్టేషన్‌గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలకు రెండు వందే భారత్ రైళ్లను అందించామని చెప్పారు.
శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో అశ్వనీ వైష్ణవ్ మాట్లాడారు. ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్.. సబ్‌కా ప్రయాస్’పేరుతో ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వేల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శ్రీవెంకటేశ్వర స్వామి సులభతర దర్శనం కోసమే వందేభారత్ రైలును ప్రారంభించినట్లు చెప్పారు.
తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు: కిషన్‌రెడ్డి
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని.. మంచి మౌలిక వసతులు కల్పించేందుకే మోదీ హైదరాబాద్‌కు వచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు.
ఇప్పటివరకు దేశంలో 14 వందే భారత్ రైళ్లను ప్రారంభించామని, అందులో రెండింటిని తెలంగాణకు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారని పేర్కొన్నారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తుండటం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొంతకాలం ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఆగిపోయిందని.. బీజేపీ ఎంపీలు వెళ్లి ప్రధానికి విజ్ఞప్తి చేయగా.. కేంద్రం చొరవ తీసుకుని మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్‌ను, 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తోందని చెప్పారు. తెలంగాణను అన్నిరకాలుగా ఆదుకుంటున్న ప్రధాని మోదీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment