యెడ్డీకి తిరుగుబాటు సెగలు!
కర్ణాటకలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత పార్టీలో అసమ్మతి ఎదుర్కొంటుండగా.. అటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు వ్యతిరేకంగా తిరుగుబాటు సెగలు ఎగిసిపడుతున్నాయి.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీని అధికారంలో తెచ్చే లక్ష్యంతో గత ఏప్రిల్‌లో పార్టీ పగ్గాలను కమల అధినాయకత్వం యెడ్డీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, అందరినీ కలుపుకొని ముందుకెళ్లడానికి బదులు యెడ్డీ నియంతలాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కర్ణాటక సీనియర్ నేతలు మండిపడుతున్నారు. సీనియర్ నాయకులైన కేఎస్ ఈశ్వరప్ప, జగదీశ్ షెట్టర్, కేంద్రమంత్రులు అనంత్ కుమార్, డీవీ సదానంద గౌడ యెడ్డీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో సీనియర్ నేతలను విస్మరించి.. వారి అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా యడ్యూరప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు భగ్గుమంటున్నారు. మాజీ సీఎం అయిన యెడ్డీ తాజాగా చేపట్టిన జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్ల నియామకంలో తమను సంపద్రించలేదని, తమ అభిప్రాయాలు ఏమాత్రం వినకుండా ఇష్టానుసరం ఈ నియామకాలు చేపట్టారని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మీడియా ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర సీనియర్ నేతలు మీడియా ముందుకు రానప్పటికీ వారు కూడా ఇదేవిధంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక బీజేపీలోని యెడ్డీ వ్యతిరేక గ్రూపు తమ అసంతృప్తిని మూకుమ్మడిగా పార్టీ అధిష్ఠానానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. శీతాకాలం సమావేశాల సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీకి యెడ్డీ తీరుపై ఫిర్యాదు చేయాలని అసమ్మతి నేతలు నిర్ణయించారు.