బెంగళూరు: పలు అవినీతి ఆరోపణలు, వివాదాలు ఎదుర్కొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మరోసారి రాజకీయంగా ప్రముఖంగా వెలుగులోకి వచ్చారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఆయన అధికారికంగా గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో కమల దళపతిగా మూడుసార్లు వ్యవహరించిన యెడ్డీ.. దక్షిణాదిలో బీజేపీ తొలిసారి పాగా వేయడంలో కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో రాజకీయంగా అడుగున ఉన్న బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం మరోసారి బీజేపీని అధికార పీఠం మీద కూచోబెట్టే లక్ష్యంతోనే తాను కర్ణాటక పార్టీ పగ్గాలను చేపట్టానని, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇదే లక్ష్యాన్ని తన భుజస్కంధాలపై ఉంచారని ఆయన విలేకరులకు తెలిపారు. 'వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించడమే మా ధ్యేయం. ఇదే లక్ష్యాన్ని మోదీ, షా మాకు ఇచ్చారు' అని చెప్పారు. అవినీతి ఆరోపణలతో సీఎం పదవి నుంచి దిగిపోయి.. ఆ తర్వాత పరిణామాలతో 2012లో బీజేపీకి రాజీనామా చేసి.. సొంత కుంపటి పెట్టుకున్న యెడ్డీ ఏడాది తర్వాత తిరిగి కమలం గూటికి చేరారు. ఆయన పార్టీని వీడటంతో 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో మరోసారి కమలం పగ్గాలు చేపటిన యెడ్డీ 2018 ఎన్నికల్లో పార్టీకి గత వైభవాన్ని కట్టబెడతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
యెడ్డీ ఈజ్ బ్యాక్!
Published Thu, Apr 14 2016 6:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement