షా చాణక్యం.. యడ్డీకే 'కర్ణాటక' పట్టం
న్యూఢిల్లీ/ బెంగళూరు: సంస్థాగతంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పూర్తయింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బలమైన లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్పకే బీజేపీ చీఫ్ పదవి దక్కింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశం అనంతరం యడ్డీని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్ణాటకతోపాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ లకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు.
మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే కర్ణాటక అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించింది. యడ్యూరప్పను అధ్యక్షుణ్ని చేసేందుకు అమిత్ షా గొప్ప చాణక్యమే నెరపాల్సివచ్చింది. నిజానికి యడ్డీకి మోదీ, షాలతో సత్సంబంధాలు లేవు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన యడ్డీ.. పార్టీ కురువృద్ధుడు అద్వానీకి వీర విధేయుడు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీలో నెలకొన్న తాజా పరిస్తితులు, బీజేపీ నుంచి దూరమై సొంతకుంపటి పెట్టుకోవటం వల్ల ఒరిగేదేమీ ఉండదని తెలిసిరావటం యడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరేలా చేశాయి.
మరోవైపు కేసుల విషయంలోనూ యడ్డీకి హైకోర్టులో ఊరట లభించింది. యడ్డీపై విచారణకు గవర్నర్ ఇచ్చిన అనుమతి చెల్లదని జనవరిలో కర్ణాటక హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. దీంతో అధ్యక్ష పదవి చేపట్టేందుకు యడ్డీకి ఉన్న కేసుల అడ్డంకి కూడా తొలిగిపోయినట్లయింది. గనులు, భూముల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ యడ్డీ సహా ఆయన మంత్రివర్గంలోని పలువురిపై నాటి లోకాయుక్త తీవ్ర ఆరోపణలు చేయడం, యడ్యూరప్ప ఏడాదిన్నరపాటు జైలులో గడపటం తెలిసిందే.
తిరిగి పార్టీలోకి వచ్చిన యడ్డీకి సారధ్యబాధ్యతలు అప్పగించేవిషయంలో సీనియర్ నాయకులైన సీటీ రవి, నళిన్ కుమార్ కటేల్, ఆర్.అశోక్ ల పేర్లతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే యడ్డీతో పోల్చుకుంటే మిగతా ఎవ్వరికీ పేద, మధ్యతరగతి వర్గాల్లో పట్టులేదు. అందుకు చిన్న ఉదాహరణ ఇటీవల జరిగన బీజేపీ రైతు యాత్ర. కాంగ్రెస్ పాలనలో రైతుల దీన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారంటూ బీజేపీ చేపట్టిన యాత్రకు మొదట్లో అంతగా స్పందనరాలేదు. ఎప్పుడైతే యడ్యూరప్ప రంగప్రవేశం చేశారో, అప్పటినుంచి యాత్ర స్వరూపమే మారిపోయింది. పెద్దెసంఖ్యలో జనం బీజేపీ యాత్రకు హాజరవుతున్నారు. ' ఒకవేళ ఇంకో నాయకుడికి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే 2018లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేం కానీ యడ్యూరప్పకు ఇస్తే మాత్రం తప్పక ప్రభావం ఉంటుంది' అని అమిత్ షా బలంగా నమ్మటంవల్లే యడ్డీకి పదవి దక్కిందని, యడ్యూరప్ప ఆ నమ్మకాన్ని నిజం చేయగల సత్తాఉన్న నేత అని బీజేపీ నాయకులు అంటున్నారు.