కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నాయకత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహణకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేజీ బోపయ్యను గవర్నర్ వజూభాయ్ వాలా నియమించడంతో ప్రొటెం స్పీకర్ నియామకం, పాత్రపై చర్చ మొదలైంది. లోక్‌సభ ప్రొటెం స్పీకర్ నియామకానికి అనుసరించే పద్ధతులనే శాసనసభ ప్రొటెం స్పీకర్ విషయంలోనూ పాటిస్తారు. ప్రొటెం స్పీకర్ పదవికి సీనియర్ సభ్యుడిని నియమిస్తారు. లోక్‌సభకైతే పార్లమెంటు సభా వ్యవహారాల విభాగం, అసెంబ్లీకైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కొందరు సీనియర్ సభ్యుల జాబితా రూపొందించి పంపితే ఆయా ప్రభుత్వాలు ఒకరిని ఎంపిక చేస్తాయి. లోక్‌సభకైతే ప్రొటెం స్పీకర్‌ను రాష్ట్రపతి, అసెంబ్లీకైతే ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్ నియమించి ప్రమాణం చేయిస్తారు. సంప్రదాయంగా దీన్ని పాటిస్తున్నారు.
అత్యధిక సీనియర్ అయిన సభ్యుడినే ఈ పదవికి నియమించాలనే నిబంధనలేమీ లేవు. ప్రొటెం స్పీకర్ ప్రధాన విధులు కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడంతోపాటు, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం. ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేయడం లేదా మరణించడం జరిగితే కూడా ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు ప్రొటెం స్పీకర్ అప్పటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ లేనిదే తేల్చే బలపరీక్ష నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం తప్పేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారీ చెప్పారు. స్పీకర్‌ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రొటెం స్పీకర్ బలపరీక్ష నిర్వహించడం సక్రమమేనని ఆయన వివరించారు.
నెలలో ముగ్గురు ప్రొటెంలు
ఆంధ్రప్రదేశ్‌లో 1984 ఆగస్ట్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వం బర్తరఫ్ తర్వాత గద్దెనెక్కిన నాదెండ్ల భాస్కరరావు సర్కారు బలపరీక్ష సమయంలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రొటెమ్ స్పీకర్లు(నెల రోజుల్లో)గా పనిచేశారు. అప్పటి స్పీకర్ తంగి సత్యనారాయణ, డెప్యూటీ స్పీకర్ ఎ.భీమ్‌రెడ్డి రాజీనామా చేసి నాదెండ్ల కేబినెట్‌లో చేరడంతో సభా నిర్వహణకు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం. బాగారెడ్డిని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. సభలో రోజూ రభస జరగడంతో బాగారెడ్డి రాజీనామా చేశారు. తర్వాత ఎంఐఎం నేత సుల్తాన్‌సలాహుద్దీన్ ఒవైసీని ఈ పదవిలో నియమించగా ఆయన నాదెండ్లకు సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తూ సభలో గొడవలను అదుపు చేయలేకపోయారనే ఆరోపణలొచ్చాయి. ఫలితంగా ఆయనను గవర్నర్‌తొలగించారు. నెల తర్వాత మళ్లీ సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ సర్కారు బలపరీక్ష నిర్వహణకు నియమితుడైన సీనియర్ సభ్యుడు పి.మహేంద్రనాథ్ ప్రొటెం స్పీకర్‌గా ఆ పని పూర్తి చేశారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment