KG Bopaiah
-
ప్రత్యక్ష ప్రసారమే పరిష్కారం
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెంస్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నియమించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్–జేడీఎస్‌ల దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో బలపరీక్ష సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలపై కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ‘యడ్యూరప్ప బలనిరూపణను అన్ని చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అసెంబ్లీ కార్యకలాపాలు పారదర్శకంగా కొనసాగేందుకు ఇది అత్యుత్తమ మార్గం’ అని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. సభలో జరిగే కార్యకలాపాలను రికార్డు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వుల్ని కాంగ్రెస్–జేడీఎస్ కూటమి శుక్రవారం రాత్రి సుప్రీంలో సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్‌పై విచారణను కొనసాగించాలంటే ప్రొటెం స్పీకర్ వాదనను వినాల్సి ఉంటుందని, దాంతో బలపరీక్ష వాయిదా పడుతుందని ధర్మాసనం స్పష్టం చేయడంతో కాంగ్రెస్–జేడీఎస్‌లు వెనక్కి తగ్గాయి. గవర్నర్‌ను ఆదేశించలేం: సుప్రీం సభలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలన్న సంప్రదాయాన్ని పక్కనపెట్టారని కాంగ్రెస్–జేడీఎస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. సిక్రీ జోక్యం చేసుకుంటూ.. ‘అది సంప్రదాయం మాత్రమే. ప్రొటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్‌ను నియమించమని మేం గవర్నర్‌ను ఆదేశించలేం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ శుక్రవారం నియమించారు. సభలో అత్యంత అనుభవజ్ఞుడిని కాకుండా బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. సభలోని సభ్యుల్లో అత్యంత అనుభవజ్ఞుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సంప్రదాయం. అలా చూస్తే ప్రస్తుతం ఎన్నికైన శాసనసభ్యుల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆర్వీ దేశ్‌పాండే అత్యంత అనుభవజ్ఞుడు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోపయ్య నాలుగుసార్లే ఎమ్మెల్యే అయ్యారు. కానీ గవర్నర్ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. గవర్నర్ బీజేపీ ఏజెంట్లా వ్యవహరించడం బాధాకరమనీ, ఆయన నిర్ణయం విస్తుగొల్పిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూ రావ్ అన్నారు. కళంకితుడైన, గతంలో స్పీకర్‌గా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన అదే వ్యక్తిని మళ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ప్రొటెం స్పీకర్ విధులు ఇవే.. కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడం, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం ప్రొటెం స్పీకర్ విధులు. ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేసినా లేదా మరణించినా కూడా ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు ప్రొటెం స్పీకర్ అప్పటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ లేనిదే తేల్చే బలపరీక్ష నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం తప్పేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి చెప్పారు. స్పీకర్‌ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రొటెం స్పీకర్ బలపరీక్ష నిర్వహించడం సక్రమమేనన్నారు. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్.. నేడు విచారణ ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యను గవర్నర్ నియమించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్‌లు శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించనుంది. ఈ కేసును జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి కేటాయిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌లు కూడా సభ్యులుగాగల ధర్మాసనం కాంగ్రెస్, జేడీఎస్‌ల పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే విచారించనుంది. బల పరీక్ష 4 గంటలకు జరగాల్సి ఉండగా, అంతకు ముందే విచారణ చేపట్టనుండటం గమనార్హం. గతంలో సుప్రీం మొట్టికాయలు 2008లోనూ బోపయ్య ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జగదీశ్ షెట్టర్ స్పీకర్‌గా నియమితులు కాగా, బోపయ్య డిప్యూటీ స్పీకర్ అయ్యారు. షెట్టర్ రాజీనామా అనంతరం 2009 నుంచి 2013 మధ్య స్పీకర్‌గా పనిచేశారు. బోపయ్య స్పీకర్ పదవిలో ఉండగా బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చింది. విశ్వాసపరీక్షలో యడ్యూరప్పను గెలిపించేందుకు 11 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా మొత్తం 16 మందిపై బోపయ్య అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించగా, సుప్రీంకోర్టు 2011లో కొట్టివేసింది. బోపయ్య ప్రాథమిక రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారనీ, ఆయనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సుప్రీంకోర్టు అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించింది. -
తాత్కాలిక స్పీకర్‌పై తకరారు!
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప నాయకత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం బలపరీక్ష నిర్వహణకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేజీ బోపయ్యను గవర్నర్ వజూభాయ్ వాలా నియమించడంతో ప్రొటెం స్పీకర్ నియామకం, పాత్రపై చర్చ మొదలైంది. లోక్‌సభ ప్రొటెం స్పీకర్ నియామకానికి అనుసరించే పద్ధతులనే శాసనసభ ప్రొటెం స్పీకర్ విషయంలోనూ పాటిస్తారు. ప్రొటెం స్పీకర్ పదవికి సీనియర్ సభ్యుడిని నియమిస్తారు. లోక్‌సభకైతే పార్లమెంటు సభా వ్యవహారాల విభాగం, అసెంబ్లీకైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కొందరు సీనియర్ సభ్యుల జాబితా రూపొందించి పంపితే ఆయా ప్రభుత్వాలు ఒకరిని ఎంపిక చేస్తాయి. లోక్‌సభకైతే ప్రొటెం స్పీకర్‌ను రాష్ట్రపతి, అసెంబ్లీకైతే ప్రొటెం స్పీకర్‌ను గవర్నర్ నియమించి ప్రమాణం చేయిస్తారు. సంప్రదాయంగా దీన్ని పాటిస్తున్నారు. అత్యధిక సీనియర్ అయిన సభ్యుడినే ఈ పదవికి నియమించాలనే నిబంధనలేమీ లేవు. ప్రొటెం స్పీకర్ ప్రధాన విధులు కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడంతోపాటు, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం. ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేయడం లేదా మరణించడం జరిగితే కూడా ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు ప్రొటెం స్పీకర్ అప్పటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ లేనిదే తేల్చే బలపరీక్ష నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం తప్పేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారీ చెప్పారు. స్పీకర్‌ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రొటెం స్పీకర్ బలపరీక్ష నిర్వహించడం సక్రమమేనని ఆయన వివరించారు. నెలలో ముగ్గురు ప్రొటెంలు ఆంధ్రప్రదేశ్‌లో 1984 ఆగస్ట్‌లో ఎన్టీఆర్ ప్రభుత్వం బర్తరఫ్ తర్వాత గద్దెనెక్కిన నాదెండ్ల భాస్కరరావు సర్కారు బలపరీక్ష సమయంలో ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రొటెమ్ స్పీకర్లు(నెల రోజుల్లో)గా పనిచేశారు. అప్పటి స్పీకర్ తంగి సత్యనారాయణ, డెప్యూటీ స్పీకర్ ఎ.భీమ్‌రెడ్డి రాజీనామా చేసి నాదెండ్ల కేబినెట్లో చేరడంతో సభా నిర్వహణకు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం. బాగారెడ్డిని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. సభలో రోజూ రభస జరగడంతో బాగారెడ్డి రాజీనామా చేశారు. తర్వాత ఎంఐఎం నేత సుల్తాన్సలాహుద్దీన్ ఒవైసీని ఈ పదవిలో నియమించగా ఆయన నాదెండ్లకు సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తూ సభలో గొడవలను అదుపు చేయలేకపోయారనే ఆరోపణలొచ్చాయి. ఫలితంగా ఆయనను గవర్నర్తొలగించారు. నెల తర్వాత మళ్లీ సీఎంగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ సర్కారు బలపరీక్ష నిర్వహణకు నియమితుడైన సీనియర్ సభ్యుడు పి.మహేంద్రనాథ్ ప్రొటెం స్పీకర్‌గా ఆ పని పూర్తి చేశారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కర్నాటకం: బోపయ్యతో బేఫికర్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యను గవర్నర్ వాజుభాయ్ వాలా ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు బీఎస్ యడ్యూరప్పను ఆయన కాపాడటమే దీనికి కారణమని తెలుస్తోంది. 2009-13 మధ్యకాలంలో కర్ణాటక శాసనసభా స్పీకర్‌గా బోపయ్య పనిచేశారు. 2011, అక్టోబర్‌లో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పపై తిరుగుబాటు చేశారు. దీంతో శాసనసభలో యడ్యూరప్ప అవిశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి వచ్చింది. స్పీకర్‌గా ఉన్న బోపయ్య తిరుగుబాటు చేసిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి యెడ్డీ సర్కారును కాపాడారు. బోపయ్య నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించగా, సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో ఆయన అతి వేగంగా స్పందించారని వ్యాఖ్యానించింది. సర్వత్రా ఉత్కంఠ.. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్‌కు నియమించివుంటారన్న అనుమానాన్ని కాంగ్రెస్, జేడీఎస్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా యడ్యూరప్ప సర్కారుకు ఆయన అనుకూలంగా వ్యవహరించే అవకాశముందని ఆరోపించాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసేటప్పుడు అత్యంత అనుభవశాలి అయిన ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్వీ దేశ్‌పాండే అత్యంత సీనియర్ సభ్యుడు. ఆయనను పక్కనపెట్టేసి బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కర్ణాటక అసెంబ్లీలో రేపు ఏం జరుగుతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కే జీ బోపయ్య
-
కర్ణాటక: ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు అత్యంత ఉత్కంఠ రేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప శాసనసభలో రేపు బలనిరూపణకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఉత్తర్వులు వెలువరించిన 5 నిమిషాల్లోనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ వాజూభాయ్ వాలా నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం సీనియర్ అయిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ పార్టీ నేత ఆర్వీ దేశ్‌పాండేను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజే బోపయ్యను నియమిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరాజ్‌పేట స్థానం నుంచి బోపయ్య గెలిచారు. 2009లోనూ ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. నియమ నిబంధనల ప్రకారమే ప్రొటెం స్పీకర్ నియామకం జరిగిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలోనూ ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణల్లో పసలేదని కొట్టిపారేశారు.