
ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యను గవర్నర్ వాజుభాయ్ వాలా ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు బీఎస్ యడ్యూరప్పను ఆయన కాపాడటమే దీనికి కారణమని తెలుస్తోంది.
2009-13 మధ్యకాలంలో కర్ణాటక శాసనసభా స్పీకర్‌గా బోపయ్య పనిచేశారు. 2011, అక్టోబర్‌లో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పపై తిరుగుబాటు చేశారు. దీంతో శాసనసభలో యడ్యూరప్ప అవిశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి వచ్చింది. స్పీకర్‌గా ఉన్న బోపయ్య తిరుగుబాటు చేసిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి యెడ్డీ సర్కారును కాపాడారు. బోపయ్య నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించగా, సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో ఆయన అతి వేగంగా స్పందించారని వ్యాఖ్యానించింది.
సర్వత్రా ఉత్కంఠ..
గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్‌కు నియమించివుంటారన్న అనుమానాన్ని కాంగ్రెస్, జేడీఎస్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా యడ్యూరప్ప సర్కారుకు ఆయన అనుకూలంగా వ్యవహరించే అవకాశముందని ఆరోపించాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసేటప్పుడు అత్యంత అనుభవశాలి అయిన ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్‌వీ దేశ్‌పాండే అత్యంత సీనియర్ సభ్యుడు. ఆయనను పక్కనపెట్టేసి బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కర్ణాటక అసెంబ్లీలో రేపు ఏం జరుగుతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment