తొలుత ప్రమాణం చేసిన మోదీ
తర్వాత ప్యానెల్ స్పీకర్లు, మంత్రులు..
తర్వాత అక్షరమాల ప్రకారం రాష్ట్రాలవారీగా సభ్యుల ప్రమాణం
న్యూఢిల్లీ: లోక్‌సభ తొలిరోజు సమావేశాల్లో ప్రమాణస్వీకార పర్వం కొనసాగింది. సోమవారం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్యానెల్ స్పీకర్‌లు రాధా మోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తేలు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్‌లో భర్తృహరి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణంచేయించారు.
ఆ తర్వాత లోక్‌సభ ప్రారంభం అయిన వెంటనే వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రకటించారు. అనంతరం 11:07 గంటలకు ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ఎంపీగా హిందీలో ప్రమాణం చేయడంతో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది.
ప్రధాని తర్వాత ప్యానెల్ స్పీకర్లు రాధామోహన్, కులస్తేలు ప్రమాణం చేశారు. తర్వాత మంత్రిమండలి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ప్రమాణం చేశారు. ముందుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితర మంత్రులు ప్రమాణం చేశారు. తర్వాత స్వతంత్ర హోదా ఉన్న సహాయకమంత్రులు తర్వాత సహాయక మంత్రులు ప్రమాణంచేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో ‘నీట్ ఫెయిల్డ్ మినిస్టర్’, నీట్–నెట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. తర్వాత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించినందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యుడు కె.సురేశ్, డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, టీఎంసీ సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ్‌లు స్పీకర్‌ప్యానెల్ సభ్యులుగా ప్రమాణంచేయలేదు.
ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచిన దళిత నేత సురేశ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపికచేయనందుకు నిరసన తెలపాలని విపక్షపార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ముగ్గురు ప్యానెల్ స్పీకర్ల పదవులకు దూరంగా ఉండిపోయారు. ప్రమాణస్వీకారం మొదలుకాగానే సురేశ్, టీఆర్ బాలు, సుదీప్‌లు సభ నుంచి వాకౌట్‌చేశారు. ప్యానెల్ సభ్యుల ప్రమాణంవేళ ‘ రాజ్యాంగ ఉల్లంఘన’ అని విపక్షసభ్యులు నినాదాలు చేశారు. తర్వాత అక్షరమాల ప్రకారం రాష్ట్రాలవారీగా సభ్యులు ప్రమాణంచేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు.
పలు భాషల్లో ప్రమాణాలు
ప్రమాణస్వీకారం వేళ సభలో భాషా వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణంచేశారు. ఇంగ్లిష్‌తోపాటు సంస్కృతం, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, మరాఠీ, తదితర భాషల్లో ప్రమాణంచేశారు. అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, ఖట్టర్ హిందీలో ప్రమాణంచేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కన్నడలో, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడియాలో, పోర్ట్‌లు, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సామీలో, విద్యుత్, పునరుత్పాదక ఇంధన సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్ సంస్కృతంలో, పర్యాటకం, పెట్రోలియం మంత్రి సురేష్ గోపి మలయాళంలో సభ్యులుగా ప్రమాణంచేశారు. లోక్‌సభ ప్రారంభానికి శుభసూచకంగా సభ్యులంతా తొలుత లేచి నిలబడి కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.
తొలి వరుసలో రాహుల్, అఖిలేశ్
సభలో విపక్షాలకు కేటాయించిన కుర్చీల్లో మొదటి వరుసలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ, ఎస్పీ నేతలు అఖిలేశ్ యాదవ్, అవధేశ్ ప్రసాద్‌లు కూర్చున్నారు. మాజీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మూడో వరుసలో కూర్చున్నారు. తొలిసారి సభకు ఎన్నికైన దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె భాన్సురీ స్వరాజ్ సభలో అందరినీ పలకరిస్తూ కనిపించారు. సెల్ఫీలు దిగారు. ఎస్పీ సభ్యులు ఎర్రని టోపీలు, ఎర్ర కండువాలు ధరించి హిందీలో ముద్రించిన రాజ్యాంగ ప్రతులను పట్టుకొచ్చారు.
సభలో హైలైట్స్
→ రైతు నేత, సీపీఐ (ఎం) ఎంపీ ఆమ్రా రామ్ ట్రాక్టర్‌లో పార్లమెంట్‌కు వచ్చారు.
→ కొందరు సభ్యులు తమ రాష్ట్ర సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు.
→ ‘రేసుగుర్రం’ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ధోతీలో అలరించారు.
→ తొలిసారి ఎంపీగా గెలిచిన మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు అనిత నగర్‌సింగ్ చౌహాన్ వేళ్లకు పెద్ద ఉంగరాలు, మెడలో భారీ సంప్రదాయ నగలతో సభకు వచ్చారు.
→ శ్వేతవర్ణ చీరకట్టులో మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
→ తిహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.
→ టీవీ రాముడు అరుణ్ గోవిల్ అందరితో మాట్లాడుతూ కనిపించారు.
→ మోదీ ప్రమాణం చేసేటపుడు ఎన్‌డీఏ నేతలంతా జైశ్రీరాం అని నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష సభ్యులంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు. కొందరు సభ్యులు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి వచ్చారు
Comments
Please login to add a commentAdd a comment