కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి
గంగావతి: గంగావతి నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరచి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తామని కేఆర్‌పీపీ సంస్థాపకులు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నగరంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఓటర్ల అభినందన కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను రెండేళ్లలో పూర్తి చేస్తానని చెప్పారు. ఆరు నెలలలోపు మహిళలకు గార్మెంట్ ఫ్యాక్టరీని నిర్మించి వారికి ఉపాధి కల్పిస్తానని అన్నారు.
నియోజక వర్గంలోని ఇరకల్‌గడ ఏరియా మెట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తానని, ఇందుకోసం నాలుగు సమాంతర జలాశయాలను నిర్మిస్తానని తెలిపారు. యువకులకు ప్రధానంగా స్థానికంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రమాణికంగా కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రదేశాలైన వెంకటగిరి, ఆనెగుంది, ఇతర ప్రాంతాల్లో తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి, అందులో వలంటీర్లను నియమించి ప్రజలకు ఇంటి వద్దకే సౌకర్యాలను తీసుకెళ్లే ఏర్పాటు చేస్తానన్నారు.
నగరంలో రహదారులు, స్లం ఏరియా మౌలిక సదుపాయాలు, కల్పించి మాడ్రన్ సిటీగా మారుస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాధ్యక్షుడు మనోహర్ గౌడ హెరూరు, పార్టీ యువజన విభాగపు రాష్ట్ర అధ్యక్షులు భీమశంకర్ పాటిల్, పార్టీ మహిళ విభాగపు జిల్లాధ్యక్షురాలు రాజేశ్వరి సురేష్, చెన్నవీరణ్ణగౌడ, టీజీ బాబు, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జనార్ధన్‌రెడ్డిని ఈ సందర్భంగా నియోజక వర్గం నుంచి వచ్చిన అభిమానులు భారీ ఎత్తున పూలమాలలతో సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment