ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య చేత ప్రమాణంచేయిస్తున్న గవర్నర్ వజూభాయ్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ శుక్రవారం నియమించారు. సభలో అత్యంత అనుభవజ్ఞుడిని కాకుండా బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. సభలోని సభ్యుల్లో అత్యంత అనుభవజ్ఞుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సంప్రదాయం. అలా చూస్తే ప్రస్తుతం ఎన్నికైన శాసనసభ్యుల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆర్వీ దేశ్‌పాండే అత్యంత అనుభవజ్ఞుడు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బోపయ్య నాలుగుసార్లే ఎమ్మెల్యే అయ్యారు. కానీ గవర్నర్ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. గవర్నర్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరించడం బాధాకరమనీ, ఆయన నిర్ణయం విస్తుగొల్పిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూ రావ్ అన్నారు. కళంకితుడైన, గతంలో స్పీకర్‌గా సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని చవిచూసిన అదే వ్యక్తిని మళ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ల ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.
ప్రొటెం స్పీకర్ విధులు ఇవే..
కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడం, స్పీకర్ ఎన్నిక జరిగే వరకూ సభను నిర్వహించడం ప్రొటెం స్పీకర్ విధులు. ఎన్నికలు జరిగిన వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. మధ్యలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ రాజీనామా చేసినా లేదా మరణించినా కూడా ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు ప్రొటెం స్పీకర్ అప్పటి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదీ లేనిదే తేల్చే బలపరీక్ష నిర్వహించడం రాజ్యాంగం ప్రకారం తప్పేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి చెప్పారు. స్పీకర్‌ను ఎన్నుకునే స్థితిలో సభ లేనప్పుడు ప్రొటెం స్పీకర్ బలపరీక్ష నిర్వహించడం సక్రమమేనన్నారు.
సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్.. నేడు విచారణ
ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యను గవర్నర్ నియమించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్, జేడీఎస్‌లు శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించనుంది. ఈ కేసును జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి కేటాయిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌లు కూడా సభ్యులుగాగల ధర్మాసనం కాంగ్రెస్, జేడీఎస్‌ల పిటిషన్‌ను ఉదయం 10.30 గంటలకే విచారించనుంది. బల పరీక్ష 4 గంటలకు జరగాల్సి ఉండగా, అంతకు ముందే విచారణ చేపట్టనుండటం గమనార్హం.
గతంలో సుప్రీం మొట్టికాయలు
2008లోనూ బోపయ్య ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జగదీశ్ షెట్టర్ స్పీకర్‌గా నియమితులు కాగా, బోపయ్య డిప్యూటీ స్పీకర్ అయ్యారు. షెట్టర్ రాజీనామా అనంతరం 2009 నుంచి 2013 మధ్య స్పీకర్‌గా పనిచేశారు. బోపయ్య స్పీకర్ పదవిలో ఉండగా బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చింది. విశ్వాసపరీక్షలో యడ్యూరప్పను గెలిపించేందుకు 11 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా మొత్తం 16 మందిపై బోపయ్య అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించగా, సుప్రీంకోర్టు 2011లో కొట్టివేసింది. బోపయ్య ప్రాథమిక రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారనీ, ఆయనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సుప్రీంకోర్టు అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించింది.
Comments
Please login to add a commentAdd a comment