ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించడాన్ని కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ అన్యాయం, అక్రమమని గొంతు చించుకుంటున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్‌లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్లు కనిపిస్తోంది.
గవర్నర్ సిఫార్సుతో మెహతా బర్తరఫ్!
అది 1996 సెప్టెంబర్. గుజరాత్‌లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా వర్గీయులు తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వాఘేలా, కాంగ్రెస్‌కు చెందిన పారిఖ్ కలిసి సురేశ్‌మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్‌ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో సభను నడిపిన కాంగ్రెస్‌కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా–పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు. మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలకు దారితీసింది. అసెంబ్లీలో రభస జరగడంతో బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ నేతలు గవర్నర్ కృష్ణపాల్ సింగ్‌ను కలసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు
దాంతో మెహతా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశా>రు. ఆ సమయంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటినుంచి మద్దతిస్తోంది. దేవెగౌడ ప్రభుత్వం గుజరాత్ నుంచి గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు.. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే దేవెగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు.
వాజ్‌పేయి ఔట్.. దేవెగౌడ ఇన్
1996లోనే సభలో మెజారిటీ నిరూపించుకోలేక ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత 161 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అటల్ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించారు. బలపరీక్ష నాటికి అవసరమైన మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో.. ఓటింగ్‌కు ముందే వాజ్‌పేయి రాజీనామా చేశారు. అయితే, విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వాజ్‌పేయి చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్ని నేటికీ గుర్తు చేసుకుంటారు. అనంతరం, కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించకపోవడంతో.. కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ ప్రభుత్వానికి దేవెగౌడ నేతృత్వం వహించడం కొసమెరుపు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
1996లో అలా.. 2018లో ఇలా!
Published Fri, May 18 2018 4:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment