విధానసౌధలో సీఎం కుర్చీలో ఆసీనుడైన యడ్యూరప్పకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎస్ రత్నప్రభ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత బూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప (75) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో యడ్యూరప్పతో రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే రైతు రుణమాఫీపై యడ్యూరప్ప అధికారులతో చర్చించారు. రెండ్రోజుల్లో దీనిపై తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలన్న కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో గురువారం ఉదయం యడ్డీ ప్రమాణం చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్, జేడీఎస్ నేతల నుంచి ఆటంకం కలుగుతుందనే ముందస్తు సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. యడ్డీ సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది మూడోసారి. గతంలో 2007లో నవంబర్ 12న తొలిసారిగా (వారం రోజులపాటు), రెండోసారి 2008, మే 3న మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. రెండోసారి సీఎం అయ్యాక మూడేళ్ల 10 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు.
రైతుల సాక్షిగా..
ప్రచారంలో తనను రైతుబంధుగా చెప్పుకున్న యడ్యూరప్ప తెల్లని సఫారీపై ఆకుపచ్చ శాలువా వేసుకుని విజయ సంకేతం చూపుతూ రాజ్‌భవన్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ యడ్డీని ఆహ్వానించారు. ‘భగవంతుడి సాక్షిగా, రైతు సాక్షిగా..’ అని ఆయన ప్రమాణం చేశారు. సాధారణంగా బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు ఈసారి గైర్హాజరవటం గమనార్హం. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంత్‌కుమార్ సహా ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. యడ్యూరప్ప కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 104 మంది శాసనసభ్యులున్న బీజేపీ తగిన సంఖ్యాబలం సాధించాలంటే మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పటికే ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ప్రకటించారు. గవర్నర్ ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా రాష్ట్ర విధానసభలో యడ్యూరప్ప బలనిరూపణ చేయాల్సి ఉంది. ఆ తరువాతే కేబినెట్ విస్తరణ చేపడతామని యడ్యూరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎంతో ఉద్విగ్నంగా కనిపించారు.
‘విశ్వాసం’ నిలబెట్టుకుంటా
ప్రమాణం తరువాత నేరుగా విధానసౌధకు వెళ్లిన యడ్డీ.. ముఖద్వారం మెట్లకు నమస్కరించి లోపలికెళ్లారు. సీఎస్ రత్నప్రభ, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అధికారులతో సమావేశం అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులందరికి రూ. లక్ష రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకుని మరో రెండు రోజుల్లో రుణమాఫీపై ప్రకటన చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని.. విశ్వాస పరీక్షలో 100% విజయం సాధిస్తామన్నారు. ‘మా ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గుతుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. గవర్నర్ అవకాశం ఇచ్చిన 15 రోజుల పాటు నేను వేచిచూడను. వీలైనంత త్వరగా మెజారిటీ నిరూపించుకుంటాను’ అని యడ్డీ పేర్కొన్నారు.
‘రిసార్టు’ భద్రత ఉపసంహరణ
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మకాం వేసిన బెంగళూరు బిడది సమీపంలోని ఈగల్‌టన్ రిసార్డు వద్ద భద్రతను ఉపసంహరించారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో తమ ఎమ్మెల్యేల భద్రతపై కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. పాత్రికేయులను రిసార్ట్ లోనికి అనుమతించటం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే అక్కడ పహారా కాస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను సంప్రదించటానికి గురువారం మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment