Karnataka Election Results 2018
-
కుమారస్వామి ప్రమాణానికి ఆయనెందుకు రాలేదు?
బెంగళూరు/భువనేశ్వర్: నరేంద్ర మోదీ ప్రాభవానికి, ఎన్డీఏ వరుస విజయాలకు అడ్డుకట్టవేసే క్రమంలో ఒక్కటవుతోన్న విపక్ష పార్టీలు నేడు ఓకే వేదికపై చేరాయి. జనతాదళ్(సెక్యూలర్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలంతా హాజరయ్యారు. ముగ్గురు తప్ప! వారు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్. కేసీఆర్, స్టాలిన్లు కుమార ప్రమాణానికి రాలేకపోవడానికి గల కారణాలను ఇదివరకే ప్రకటించారు. బీజేపీ-కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం యత్నిస్తోన్న కేసీఆర్.. రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టంలేదు. అందుకే మంగళవారమే బెంగళూరు వెళ్లి కుమారస్వామి, దేవేడౌడలను కలిసొచ్చారు. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం కావడంతో తాను రాలేనని డీఎంకే నేత స్టాలిన్ కుమారస్వామికి వర్తమానం పంపారు. అయితే నవీన్ పట్నాయక్ మాత్రం స్పష్టమైన కారణాలేవీ వెల్లడించలేదు. 2019 ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు వేదికగా విపక్షాల ఐక్యతను చాటిచెప్పాలని ఆయా నేతలు భావిస్తున్నవేళ నవీన్ గైర్హాజరు రాజకీయంగా చర్చనీయాంశమైంది. నవీన్ ఎందుకు రాలేదు?: 18 ఏళ్లుగా ఒడిశాలో అధికారంలో కొనసాగుతోన్న నవీన్ పట్నాయక్.. తొలి నుంచీ ఢిల్లీ రాజకీయాలపట్ల అనాసక్తిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో సఖ్యతగా మెలగటం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఆర్ఎస్, ఎన్సీపీ, టీఎంసీ తదితర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవ్వాలని భావిస్తున్న సందర్భంలోనూ నవీన్ స్థిమితంగా ఉండిపోయారుతప్ప కూటమిలో కలిసేందుకు పెద్దగా ఆసక్తిని ప్రదర్శించలేదు. ఒకవైపు ఒడిశాలో తన ప్రత్యర్థి బీజేపీనే అయినా.. కాషాయ వ్యతిరేక కూటమిలో చేరికపై నవీన్ నిర్లిప్తత ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు. మైనింగ్ కుంభకోణం, శారద స్కామ్ వంటి కేసుల్లో బీజేడీ పెద్ద తలల ప్రమేయం ఉండటం, ఆ కేసుల్లో సీబీఐ నేతృత్వంలో కొనసాగుతోన్న దర్యాప్తు.. కేంద్రం సూచనలకు అనుగుణంగా జరుగుతుండటం తదితర కారణాల వల్లే నవీన్ బీజేపీపై గట్టిగా గళం విప్పడంలేదని ఒడిశా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విచిత్రమేమంటే బీజేపీ కూడా నవీన్-కాంగ్రెస్‌ల సయోధ్యపై సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తుంది. ఇటు బీజేపీకి-అటు కాంగ్రెస్‌కు సమదూరాన్ని పాటించే నవీన్ పట్నాయక్.. ఏ ఒక్క పార్టీని వ్యతిరేకించే కూటమిలోనో చేరబోరని బీజేడీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఆయన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. -
‘కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని నిలిపేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై మరోమారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని అఖిల భారత హిందూ మహాసభ(ఏడీహెచ్‌ఎం) సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలు పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఆ కోణంలో కుమారస్వామికి గవర్నర్ పిలుపు కూడా రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని ఏడీహెచ్‌ఎం తన పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు న్యాయవాది వరుణ్ కుమార్ సిన్హా సోమవారం సాయంత్రం ఒక పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించేది, లేనిది తెలియాల్సిఉంది. గతవారం యడ్యూరప్పను సీఎం చేసిన ఇదే కర్ణాటక గవర్నర్ నిర్ణయంపై జేడీయూ-కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఫలితాంగా మే 19న అసెంబ్లీలో బలపరీక్షలో జరగడం, డివిజన్ ఓటింగ్‌కు ముందే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆ వెంటనే గవర్నర్.. కుమారస్వామినా ఆహ్వానించడం తెలిసిందే. ఈ నెల 23న బెంగళూరులో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. -
కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు?
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో సాధారణ మెజారిటీ(112 సీట్లు) రాకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించింది? అలా చేయడం ప్రజాస్వామ్యాన్ని, ఓటరు తీర్పును అవమానించడం కాదా? అన్న ప్రశ్నలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సవివరంగా సమాధానమిచ్చారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?: ‘‘చాలా మంది అడుగుతున్నారు.. బలం లేకపోయినా మీరు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెలా వచ్చారు? అని. నిజమే, మరి ఏ పార్టీకి బలం రాలేదు కాబట్టి కర్ణాటకలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా? అలా చేస్తే ప్రజా తీర్పును గౌరవించినట్లవుతుందా? అతిపెద్ద పార్టీగా అవతరించిది కాబట్టే బీజేపీకి మొదటి అవకాశం లభించింది. నిజానికి కర్ణాటక ప్రజలు ఇచ్చింది అయోమయ తీర్పు కాదు. సుస్పష్టంగా కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు. కాబట్టే, ప్రజా తీర్పును గౌరవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రుల్లో చాలా మంది ఓడిపోయారు. ముఖ్యమంత్రి కూడా ఒక స్థానంలో ఓడిపోయి, రెండో స్థానంలో బొటాబొటి మెజారిటీతో గెలిచారు. జేడీఎస్ సైతం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంతోనే 38 సీట్లు గెలుచుకుంది. ఎక్కడిక్కడ ఓటర్లు కాంగ్రెస్ వ్యతిరేకులనే గెలిపించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు కాబట్టే.. అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంది. కోర్టుకు అబద్ధాలు చెప్పారు: కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో గెలిచిన జేడీఎస్.. తిరిగి అదే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం ముమ్మాటికీ అపవిత్రచర్యే. అధికారం కోసం విలువలు, సిద్ధాంతాలు వదిలేసిన ఆ రెండు పార్టీలను కన్నడజనం అసహ్యించుకుంటున్నారు. ఈ అపవిత్రపొత్తుతో అక్కడి జనం సంతోషంగాలేరు. యడ్యూరప్ప బలనిరూపణ కోసం ఏడు రోజులు గడువు అడిగారని, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నారని తీర్పును ప్రభావితం చేసేలా వాళ్లు కోర్టుకు అబద్ధాలు చెప్పారు’’ అని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ సంబురాలపై సెటైర్లు: కర్ణాటకలో కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకోవడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘ఏం సాధించారని వీళ్లు సంబురాలు చేసుకుంటున్నారు? ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకా, దొంగ ఓట్లు, నకిలీ ఐడీకార్డులు సృష్టించినందుకా, కులం, మతం ప్రాతిపదికన జనాన్ని చీల్చేందుకు ప్రయత్నించినందుకా, 122 సీట్ల నుంచి 78 సీట్లకు దిగజారినందుకా, ముఖ్యమంత్రి ఒక స్థానంలో చిత్తుగా ఓడిపోయినందుకా లేక జేడీఎస్‌తో అపవిత్రపొత్తు పెట్టుకున్నందుకా? ఎందుకు వాళ్లు జరుపుకొంటున్నారో అర్థంకావడంలేదు. కర్ణాటక ప్రజలు బీజేపీని మాత్రమే ఆశీర్వదించారు. అందుకే 40 స్థానాల నుంచి 107 స్థానాలకు ఎదిగాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ నెల 23న కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. -
కుమారస్వామికి దిమ్మతిరిగే సవాల్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ఓడిపోలేదని, అసెంబ్లీలో యడ్యూరప్ప అత్యుత్తమ ప్రజాస్వామ్యస్ఫూర్తిని ప్రదర్శించి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్రజాతీర్పుకు విరుద్ధంగా ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకున్న జేడీఎస్-కాంగ్రెస్‌లు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్న ఆయన.. కాబోయే సీఎం కుమారస్వామికి దిమ్మతిరిగేరీతిలో సవాల్ విసిరారు. దమ్ముంటే..: ‘‘ఎన్నికల ముందు కాకుండా.. ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకున్న జేడీఎస్-కాంగ్రెస్‌ల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. నిన్నటిదాకా సాగిన కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపించకూడదనేదే ఆ రహస్య ఒప్పందం. నేను ముఖ్యమంత్రినైతే కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ప్రచారంలో కుమారస్వామి అన్నారు. ఇప్పుడు మేం ఆయనకు సవాలు విసురుతున్నాం.. దమ్ముంటే చెప్పిన మాట(కాంగ్రెస్ అవినీతిపై దర్యాప్తు) మీద నిలబడండి. జేడీఎస్-కాంగ్రెస్‌ది ఫక్తూ అవకాశవాద పొత్తేకానీ సైద్ధాంతిక పొత్తు కానేకాదు’’ అని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. (చదవండి:బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) ఒక్కడికి భయపడి..: ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపైనా కేంద్ర మంత్రి జవదేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.‘‘బీజేపీ వ్యవస్థలను నాశనం చేస్తున్నదని రాహుల్ ఆరోపించారు. కానీ వాస్తవానికి ఈ దేశంలో వ్యవస్థలను భ్రష్టుపట్టించిందే కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్‌ను జరగనీయకుండా అడ్డుకోవడం, కాగ్‌ను విపరీతంగా నిందించడం, సుప్రీంకోర్టును ప్రభావితం చేయడం, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. నిజంగా మేము ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిఉంటే వాళ్లు మా వెంట వచ్చేవాళ్లేకదా, తప్పుడు ఆడియోలతో కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. ఎన్నికల్లో ఓడిపోతే తప్పు ఈవీఎంలపై నెడతారు. యడ్యూరప్పను సీఎంగా ప్రమాణం చేసియిస్తే గవర్నర్‌ను నిందిస్తారు. మరి వీళ్ల సీఎంతో ప్రమాణం చేయిచేటప్పుడు మాత్రం గవర్నర్ మంచోడే అంటారు. మోదీ ఒక్కడికి భయపడి, ఆయనకు వ్యతిరేకంగా కూటములు నిర్మించడం నిజమైన రాజకీయం కానేకాదు. ఆ కూటములు ఎప్పటికీ నిలబడలేవు’’ అని జవదేకర్ వివరించారు. (చూడండి: అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం) -
జేడీఎస్-కాంగ్రెస్ అత్యవసర భేటీ
సాక్షి, బెంగళూరు: బలపరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించిన దరిమిలా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు జేడీఎస్-కాంగ్రెసలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఇరుపార్టీలు ఉమ్మడిగా లెజిస్లేటివ్ భేటీని నిర్వహించాయి. బెంగళూరులోని హిల్టన్ హోటల్లో జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్ కూర్పు, ఇతర పదవుల పంపకాలకు సంబంధించి చర్చ జరిగింది. ఆయా శాఖల మంత్రులు వీరేనంటూ కొన్నిపేర్లు కూడా వెల్లడయ్యాయి. మరోవైపు సోమవారం తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వివిధపక్షాల నాయకులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) -
అసెంబ్లీలో బీజేపీ ఘోరతప్పిదం..
రాయ్‌పూర్: బలపరీక్ష సందర్భంలో ప్రొటెం స్పీకర్ సహా బీజేపీ ఎమ్మెల్యేలంతా జాతీయగీతాన్ని అవమానించి ఘోరతప్పిదం చేశారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గుర్తుచేశారు. ‘‘మీరంతా టీవీల్లో గమనించే ఉంటారు.. జాతీయగీతం ఆలపించడానికి ముందే ప్రొటెం స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యేలు అసహనంగా సీట్లలో నుంచి లేచిపోవడాన్ని చూసేఉంటారు. ఆ చర్యతో బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తమ దేశవ్యతిరేక నైజాన్ని బయటపెట్టుకున్నాయి’’ అని అన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న ఆయన.. కర్ణాటక బలపరీక్షలో బీజేపీ ఓటమిపై స్పందించారు. పార్టీ అధికార ప్రతినిధి సుర్జేవాలాతో కలిసి శనివారం రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) ‘‘ఇదే..దీని గురించే మా పోరాటమంతా. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు జాతీయగీతం పట్ల గౌరవంలేదు. ప్రజాస్వామ్యమంటే అసలే గిట్టదు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. కాబట్టే మేం జనంతో కలిసి మేము గట్టిగా పోరాడుతున్నాం. బలం లేకపోయినా యడ్యూరప్పను సీఎం చేయడం ద్వారా ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకునే వ్యవహారానికి తెరలేపారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారమంతా నడిచిందని చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటకలోగానీ, మొన్న గోవా, మణిపూర్లలోగానీ వీళ్లు ప్రజాతీర్పును గౌరవించకుండా అడ్డదారుల్లో అధికారం కైవసం చేసుకునేందుకు యత్నించారు. జాతిని కల్లోలం వైపునకు నెడుతోన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం. కర్ణాటక పరిణామం వాళ్లకొక గుణపాఠం కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో విజయంసాధించిన జేడీయూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, దేవేగౌడ గారికి, ప్రత్యేకించి కన్నడిగలకు నా అభినందనలు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. (చూడండి: కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!) ఉత్కంఠభరితంగా సాగుతుందనుకున్న బలపరీక్ష.. యడ్యూరప్ప నిష్క్రమణతో ఊహించని మలుపు తిరిగినట్లైంది. డివిజన్ ఓటింగ్‌కు ఆదేశించకముందే యడ్డీ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కసరత్తు ప్రారంభించారు. -
కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది. ఇప్పటికే జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన దరిమిలా గవర్నర్ వజుభాయ్ వాలా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారమే కుమారస్వామికి గవర్నర్ నుంచి పిలుపు రానున్నట్లు తెలిసింది. ఈ రోజే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని కన్నడ రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇటు కుమారస్వామి సైతం మీడియాతో మాట్లాడుతూ ‘గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నారు. (చదవండి: బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప) -
బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష తీర్మానంపై ప్రసంగిస్తూ.. మా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మాత్రమే ఉన్నారు కాబట్టి బలపరీక్షలో విఫలమయ్యామని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఇది నిజంగా అగ్నిపరీక్ష. ఇలాంటి పరీక్షలు ఎన్నో నా జీవితంలో ఎదుర్కొన్నాను. గతంలో రాష్ట్రం కోసం ఎంతో చేశాను. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టంకట్టారు. కాంగ్రెస్, జేడీఎస్‌లను ఓటర్లు విశ్వసించలేదు. కానీ ఇవాళ వారు అపవిత్రపొత్తుతో ముందుకొచ్చారు. అవును. మాదగ్గర 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి బలపరీక్షలో మేం విఫలమయ్యాం అని చెప్పడానికి చింతిస్తున్నాం. అయితే నా ఆఖరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పాటుపడతా. 2019లో 28కి 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటాం’’ అని యడ్యూరప్ప చెప్పారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజనీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస 78, జేడీఎస్ 38, బీఎస్పీ 1, ఇతరులు 2 సీట్లను గెలుచుకోవడం, అతిపెద్ద పార్టీ అయిన కారణంగా బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, ఆ వెంటనే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం లాంటి పరిణామాలు చకచక జరిగిపోయాయి. సరిగ్గా 60 గంటలు కూడా గడవకముందే యడ్డీ బలపరీక్షలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. -
బలపరీక్షలో నెగ్గేది కాంగ్రెసే
-
కర్నాటకం: హైదరాబాద్ టూ బెంగళూరు
-
వేసవి విడిది కాదు, రాజకీయ వేడిఇది!
వేసవి విడిది కోసం అంతా చల్లని ప్రాంతాలకు పరుగులు పెడుతోంటే, కర్నాటక రాజకీయం నేతల్ని మండుటెండల్లో భాగ్యనగరానికి పరుగులు పెట్టించింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి ధాటినుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జెడిఎస్ లకు హైదరాబాద్ రాజకీయ విడిదిగా మారడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం లే నప్పుడు ఎమ్మెల్యేలను గంపగుత్తాగా తీసుకెళ్లి ప్రత్యర్థులకు చిక్కకుండా దాచిపెట్టే సాంప్రదాయం గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో కొనసాగుతూ వస్తోంది. పాలిటిక్స్‌లోని ఈ రిసార్ట్ రాజకీయాలు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ రాజకీయ విడిదిని ఏర్పాటు చేసాయన్నది ఓసారి చూద్దాం. హర్యాణా... హర్యాణా రాజకీయాలు 1982లో ఇదే రిసార్ట్స్ రాజకీయాలకు తెరమీదకొచ్చాయి. అక్కడ కాంగ్రెస్‌కి దీటుగా పురోగమిస్తోన్న లోక్ దళ్ పార్టీ, బీజేపీల కలయికని కాదని, కాంగ్రెస్‌ని బలనిరూపణ కోసం పిలవడంతో లోక్ దళ్ అధినేత దేవీలాల్ తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి కాపాడుకోవడం కోసం తన పార్టీ 48 ఎమ్మెల్యేలతో సహా, తనకు మద్దతునిస్తానన్న బిజెపి ఎమ్మెల్యేలను ఢిల్లీలోని ఓ హోటల్‌కి తరలించారు. అయితే ఇంత భద్రంగా దాచినా ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయింది ఆ పార్టీ. ఒక ఎమ్మెల్యే బయటకు పోయే దారిలేక హోటల్లోని పైప్‌లైన్‌పైన జారుకుంటూ తప్పించుకుపోవడంతో చివరకు కాంగ్రెస్ పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. కర్నాటక... చాలా రాష్ట్రాలకు రిసార్ట్ రాజకీయాల అనుభవం ఉన్నా, కర్నాటకకి మాత్రం ఈ విషయంలో ఎక్కువ అనుభవాలను చవిచూడాల్సి వచ్చిందని చెప్పొచ్చు. కర్నాటక పలుసందర్భాలో రాజకీయ విడిదికి కేంద్రంగా మారింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేసిన ప్రయత్నం నుంచి కాపాడుకునేందుకు 1983 లో రామకృష్ణ హె గ్డే రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించారు. 2004, 2006, 2008, 2009–11, 2012 వరకు అనేక సందర్భాల్లో కర్నాటక రాజకీయాలు రిసార్ట్స్‌లో సేదదీరాయి. ప్రధానంగా 2009 నుంచి, 2011 మధ్య కాలంలో ప్రత్యర్థి పార్టీలనుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు దాదాపు 80 మంది బిజెపి ఎమ్మెల్యేలను బెంగుళూరులోని స్టార్ హోటల్‌కి తరిలించారు. ఆంధ్రప్రదేశ్ ... మన తెలుగు రాష్ట్రంలో కూడా రిసార్ట్ రాజకీయాల్లో స్థానం ఉంది. 1984లో నందమూరి తారక రామారావుని గద్దె దించేందుకు రెండు సార్లు రిసార్ట్ రాజకీయాలకు నాంది పలికారు. 1984లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాటి గవర్నర్ రామ్‌లాల్ ఠాకూర్ , ఎన్‌టిఆర్‌ని బర్తరఫ్ చేసి, నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యేలను హైదరాబాద్ నుంచి బెంగుళూరులోని నంది హిల్స్‌కి, అక్కడి నుంచి ఢిల్లీకి తరలించారు. ప్రభుత్వం పడిపోవడంతో. మళ్ళీ ఎన్‌టి రామారావు రథయాత్ర ద్వారా జనంలోకెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇందిరాగాంధీ ఆరోజు శంకర్ దయాళ్ శర్మని గవర్నర్‌గా నియమించారు. ఆ తరువాత 1995లో చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టిరామారావుని గద్దెదించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యేలందర్నీ రాత్రికి రాత్రే హైదరాబాద్‌లోని అప్పటి వైస్రాయ్ హోటల్‌కి తరలించి దాచిపెట్టి, ఎవ్వర్నీ కలవనివ్వకుండా కట్టడి చేసారు. బలనిరూపణకు అవసరమైన ఎమ్మెల్యేలను నయానా భయానా దక్కించుకునేవరకూ ఈ నాటకం కొనసాగడం తెలిసిందే. గుజరాత్ ... 1995లో 47 మంది ఎమ్మెల్యేలున్న శంకర్ సింగ్ వఘేలా బీజేపీ పైన తిరుగుబాటు చేసి తన ఎమ్మెల్యేలందర్నీ మధ్యప్రదేశ్‌లోని స్టార్ హోటల్ ఖజురహో తరలించారు. చివరకు ఒప్పందం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కి బదులుగా వఘేలా మద్దతుదారుడైన సురేష్ మెహతా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అది ఎంతోకాలం నిలవలేదు. తరువాత తన అనుయాయులతో పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఉత్తర ప్రదేశ్ ... 1998 లోక్ సభ ఎన్నికల సందర్భంలో కళ్యాణ్ సింగ్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని నాటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రమేష్ భండారీ డిస్మిస్ చే శారు. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జగదాంబికా పాల్ ని ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన 48 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బలనిరూపణ సందర్భంగా బిజెపి తన సభ్యులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సింగ్ కోర్టుకి వెళ్లడంతో తిరిగి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. బిహార్... బీహార్‌లో 2000 సంవత్సరంలో జనతాదళ్‌యూ(జేడీయూ) నేత నితీష్ కుమార్‌ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆçహ్వనించిన సందర్భంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు తమ శాసన సభ్యులను పాట్నా లోని ఓ హోటల్లో దాచిపెట్టారు. అదే సందర్భంలో బలనిరూపణలో ఓటమిపాలవడానికి ముందు నితీష్ కుమార్ ఏడు రోజులపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2005లో లోక్ జనశక్తి పార్టీ, బీజేపీ, జేడీయూ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు తన ఎమ్మెల్యేలను జమ్షెడ్పూర్లోని ఓ హోటల్లో ఉంచింది. మహారాష్ట్ర ... 2002లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ–శివసేన లోకి తన సభ్యులు జారిపోకుండా ఉండేందుకు ఆనాటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ బెంగుళూరులోని హోటల్‌కి తన ఎమ్మెల్యేలను తరలించారు. ఉత్తరాఖండ్... 2016లో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో తన సభ్యులను కాపాడుకునేందుకు బిజెపి తన శాసన సభ్యులను తీసుకొని జైపూర్‌లోని ఓ హోటల్లో బసచేసింది. ఇరు పార్టీలు గెలుపుగుర్రాల్ని కైవసం చేసుకునేందుకు విపరీతంగా డబ్బు పాచికలు వేసారు. అయితే చివరకు రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్రం తొలుత నిర్ణయించినా అది హైకోర్టు జోక్యంతో ఆగిపోయింది. ఆ తరువాత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. తమిళనాడు... తమిళనాడు తమ్ముళ్ళు కూడా ఏం తక్కువ తినలేదనడానికి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతర రాజకీయాలు సాక్ష్యం. 2017లో పన్నీర్‌సెల్వం చేత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిన అనంతరం ఎఐడిఎంకె నాయకురాలు వి.కె.శశికళ తన ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడుకునేందుకు వాళ్లందర్నీ చెన్నై లోని రిసార్ట్స్‌కి తరలించడం తెలిసిందే. -
తాజ్‌కృష్ణలో ముగిసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్ - జేడీఎస్ అధినేతలు తాజ్‌కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం ముగిసింది. కర్ణాటక సీఎల్పీ నేతగా సిద్ధారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిన్నర్ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. వారికి టీ కాంగ్రెస్ ఏపీ సరిహద్దు వరకు 200 వాహనాల కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఏపీసీసీ, కర్ణాటక నాయకుల కాన్వాయ్ జత చేరనుంది. -
యడ్యూరప్ప నోటివెంట అసలు నిజం..
బెంగళూరు: బలపరీక్షలో బీజేపీనే నెగ్గుతుందని ఆ పార్టీ నాయకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎలా గెలుస్తారంటే మాత్రం.. ‘రేపు మీరే చూస్తారుగా..’. అని తప్పించుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం అసలు నిజం కక్కేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నూటికి నూటాఒక్కశాతం బలపరీక్షలో తమదే విజయమన్నారు. అంతటితో ఆగకుండా.. ‘‘అవును. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే మేమెలా గెలవగలం..’’ అని అనేశారు. రేపు రాష్ట్రంలో సంబురాలు: ‘‘ఊహించినదానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. రేపు సాయంత్రం కర్ణాటకలో సంబురాలు జరుగుతాయి. ఆ విజయాన్ని ఆరుకోట్ల కన్నడిగులకు అంకితం చేస్తాం. జేడీఎస్-కాంగ్రెస్‌లది అపవిత్రపొత్తు, వాళ్లు జాతి విద్వేషాలను రెచ్చగొట్టారు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. ప్రజలు బుద్ధిచెప్పినా, దొడ్డిదారిలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదిఏమైనా చివరికి గెలుపుమాదే’’ అని సీఎం యడ్యూరప్ప అన్నారు. -
అసంతృప్తితో వెళ్లిపోయిన కుమారస్వామి
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన తరహాలో కర్ణాటకలోనూ బీజేపీ పాచిక పారేలా కనిపిస్తోంది. కులాల ప్రాతిపదికగా ఎమ్మెల్యేలకు ఎర చూపుతూ బీజేపీ లింగాయత్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ దూకుడు పెంచడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మధ్య సఖ్యత కొరవడుతున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టడంతో జేడీఎస్ నేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్లో కర్ణాటక సీఎల్పీ సమావేశం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడిన ఆయన తీవ్ర అసంతృప్తితో హోటల్ నుంచి నోవాటెల్‌కు వెళ్లిపోయారు. మీ ఎమ్మెల్యేలను మీరే కాపాడుకోలేక పోతున్నారంటూ పెదవి విరిచారు. జాగ్రత్తగా ఉంటే మంచిదంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, పరమేశ్వరలకు సూచించారు. నోవాటెల్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో కుమారస్వామి భేటీ కానున్నారు. చుక్కలు చూపిస్తోన్న 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోని 8 మంది లింగాయత్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించేయత్నం చేయడం కారణంగా.. తాజ్‌కృష్ణలో జరిగిన సీఎల్పీ భేటీలో వీరి నుంచి సమావేశంలో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు సీఎల్పీ భేటీకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గమనార్హం. వీరిలో రాయచూర్ జిల్లా మక్కి ఎమ్మెల్యే ప్రతాఫ్ గౌడ, బళ్లారి జిల్లా హోస్పేట్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఉన్నారు. దీంతో బీజేపీ తమ నేతలను ప్రలోభాలకు గురిచేసిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర నేతలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించే పరిస్థితి నెలకొంది. -
ఎమ్మెల్యేల తరలింపు, ప్లాన్ వన్..టూ.. త్రీ..!
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అధికార పీఠం ఎవరికి దక్కబోతుందో మరికొన్ని గంటల్లో తేలబోతుంది. అధికారం దక్కించుకోవడానికి రేపు బెంగళూరులోని విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్-జేడీఎస్‌లు ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ, నోవాటెల్‌కు తరలించి, భేటీల మీద భేటీలు నిర్వహిస్తోంది. రేపు విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో ఏ విధంగా వ్యవహరించాలో ఎమ్మెల్యేలకు సూచిస్తోంది. నేడు ఉదయం ఇక్కడికి వచ్చిన వీరిని, రేపు ఉదయం కల్లా మళ్లీ బెంగళూరుకు తరలించాల్సి ఉంది. అయితే వీరిని ఏ విధంగా బెంగళూరు తీసుకెళ్లాలి.. మధ్యలో బీజేపీ ఎలాంటి పన్నాగాలకు పాల్పడకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలో అనే అంశాలపై కాంగ్రెస్-జేడీఎస్ ఇప్పటికే నిర్ణయించాయి. ఎమ్మేల్యేల తరలింపు మూడు రకాల ప్లాన్లను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అవేమిటంటే... ప్లాన్ వన్ : ఇప్పటికే ఎమ్మెల్యేల తరలింపుకు రెండు ప్రత్యేక విమానాలు సిద్ధమైనట్టు తెలిసింది. వీరు ఏ సమయానికి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతారో సరియైన టైం తెలియనప్పటికీ, ఏ క్షణమైనా ఇక్కడి నుంచి బయలుదేరటానికి ఎమ్మెల్యేలందరూ సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు అందింది. ప్రత్యేక విమానాలు కాబట్టి విమానశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి గంటన్నరలో బెంగళూరుకు చేరుకోవచ్చు. అయితే నిన్న రాత్రి బెంగళూరులో డీజీసీఏ.. ప్రత్యేక విమాన అనుమతిని నిరాకరించింది. దీనిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరో ప్లాన్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ప్లాన్ టూ : ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేల తరలింపుకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, బస్సుల ద్వారానైనా బెంగళూరుకు తరలించాలని నాలుగు ఏసీ స్లీపర్ బస్సులు రెడీ చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ టూ బెంగళూరు 550 కిలోమీటర్లు. హై ఎండ్ బస్సులు కావడంతో, బెంగళూరుకు 8 గంటల్లో చేరుకోవచ్చు. తెలంగాణ బోర్డర్ వరకు ఇక్కడి కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఇస్తూ తెలంగాణ బోర్డర్ దాటించిన తర్వాత, ఏపీలోకి ప్రవేశమవుతారు. ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బెంగళూరుకి అత్యంత సురక్షితంగా వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. అయితే నేడు హైదరాబాద్‌కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రోడ్డు మార్గం ద్వారానే వచ్చారు. దీంతో మళ్లీ రోడ్డు మార్గమే బెస్ట్ అని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్లాన్ త్రీ : ప్రత్యేక విమానాల్లో తరలింపు సాధ్యం కాక.. బస్సుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే మూడో ప్లాన్‌ను కూడా సిద్ధం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అదే కార్ల ద్వారా ఎమ్మెల్యేల తరలింపు. ఒక్కో కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున మొత్తం ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి బెంగళూరుకు తరలించడానికి సరిపడ కార్లను సిద్ధం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన కార్లతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ కార్లను ఎమ్మెల్యేల కోసం రెడీ చేశారు. ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా బెంగళూరు వెళ్లేందుకు రెడీగా అయ్యారు. ఇది మూడో ప్లాన్. ఈ మూడు రకాల ప్లాన్లతో కాంగ్రెస్-జేడీఎస్‌లు తమ పార్టీ ఎమ్మెల్యేలను రేపటికి బెంగళూరు తరలించబోతున్నాయి. విధాన సౌధలో బలపరీక్ష ఎదుర్కోబోతున్నాయి. -
తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్- జేడీఎస్ అధినేతలు చర్చిస్తున్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్లో కర్ణాటక సీఎల్పీ సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ కీలక భేటీలో పాల్గొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలపరీక్షలో నెగ్గాలని నేతలకు సూచించారు. తమ కూటమి అభ్యర్థి కుమారస్వామికే సీఎం పీఠం దక్కేలా చూసేందుకు అంతా సంసిద్ధం కావాలని సూచించారు. శనివారం బల నిరూపణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, మధుయాష్కీ, కుంతియలు పాల్గొన్నారు. మరోవైపు జేడీఎస్ అధినేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. తాజ్‌కృష్ణకు కుమారస్వామి చేరుకుని కాంగ్రెస్ నేతలను కలుసుకున్నారు. నోవాటెల్ నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు రానున్నారు. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కీలక సమావేశం అనంతరం రాత్రి బెంగళూరుకు పయనం అవుతారు. రెండు ప్రత్యేక విమానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపన్నను నియమించి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆర్డర్ ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే బోపన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన దేశ్‌పాండేను పక్కనపెట్టి బోపన్నను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
బలపరీక్షలో గెలిచేది బీజేపీనే! ఎలాగో తెలుసా..
న్యూఢిల్లీ: కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్‌లో నిమిషానికో మలుపు.. సెకనుకో ఊహాగానం! శుక్రవారం నాటి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కర్ణాటక అసెంబ్లీలో శనివారం జరుగనున్న బలపరీక్షలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఎదురుచూస్తున్నవేళ.. జేడీయూ-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారని, గవర్నర్‌కు సమర్పించిన 115 సంతకాల్లో ఆ ఎనిమిది మందివి ఫోర్జరీ చేసిఉండొచ్చని ‘రిపబ్లిక్ టీవీ’ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టుకు ఫోర్జరీ సంతకాల జాబితా: కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ శిబిరంలో లేరు. వారంతా ఢిల్లీలో బీజేపీ నేతల సంరక్షణలో ఉన్నారు. శనివారం బలపరీక్ష సమయానికి వారిని బెంగళూరుకు తరలించనున్నారు. నిజానికి బెంగళూరు ఈగిల్టన్ రిసార్ట్స్, షాంగ్రీ-లా హోటల్ల్లో శిబిరాలు ఏర్పాటేచేసేనాటికే ఆ ఎనిమిది మంది జంప్ అయ్యారట. గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలోనూ ఈ ఎనిమిది మంది సంతకాలు చేయలేదట. దీంతో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి సంతకాలను సేకరించి.. ఫోర్జరీ చేశారట. ఆ ఎనిమిది ఫోర్జరీ సంతకాల జాబితానే కాంగ్రెస్, జేడీఎస్‌లు గవర్నర్‌కు, ఆపై సుప్రీంకోర్టుకు పంపాయని ‘రిపబ్లిక్’ కథనంలో వెల్లడించింది. అలా 104కు మరో ఎనిమిది మంది జంప్ జిలానీలు తోడుకాగా బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్(112)కు చేరుకుంటుంది కాబట్టి బలపరీక్షలో యడ్యూరప్ప సునాయాసంగా గెలుస్తారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ ఏమంటోంది?: తమ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరిని.. బీజేపీ నేతలు ఢిల్లీలో బంధించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఎమ్మెల్యే (ఆనంద్ సింగ్) పేరును కూడా వెల్లడించింది. అయితే, ‘రిపబ్లిక్’ కథనం చెప్పినట్లు 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కాంగ్రెస్ వర్గాలు ఎక్కడా ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. -
తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్ కీలక సమావేశం
-
దేవెగౌడకు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీకి, జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి పోరు వాడివేడిగా ఉంది. కర్ణాటక రాజకీయ పరిస్థితులు ఓ వైపు నుంచి కాక పుట్టిస్తుంటే, ప్రధాని నరేంద్ర మోదీ కాస్త కూల్‌గా వ్యవహరించారు. రాజకీయాలన్నింటిన్నీ పక్కన పెట్టి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవె గౌడకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. దేవె గౌడకు ఫోన్ చేసిన మోదీ, ఆయన 85వ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.‘మన మాజీ ప్రధాని హెచ్డీ దేవె గౌడ జీతో మాట్లాడాను. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. దేవె గౌడ ఆరోగ్యవంతుడిగా సుదీర్ఘ కాలం పాటు జీవించాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు దేవె గౌడ మన దేశ ప్రధానిగా పనిచేశారు. నేడు ఆయన 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యడ్యూరప్పచే ప్రమాణ స్వీకారం చేయించడంపై ఆ రాష్ట్ర గవర్నర్‌పై కాంగ్రెస్, జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కొన్ని సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాయి. కానీ వారి ప్రయత్నాలకు చెక్‌పెట్టిన బీజేపీ, అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. బీజేపీ వైపే మొగ్గుచూపిన కర్ణాటక గవర్నర్ సైతం బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప చేతనే రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయించారు. రేపటి వరకు ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ ఉత్కంఠబరిత రాజకీయ పరిస్థితులతో బీజేపీపై కాంగ్రెస్, జేడీఎస్‌లు గుర్రుగా ఉన్నాయి. Spoke to our former Prime Minister Shri HD Deve Gowda Ji and conveyed birthday wishes to him. I pray for his good health and long life. — Narendra Modi (@narendramodi) May 18, 2018 -
నాలుగో రోజూ కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
ముంబై : కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న వాడివేడి రాజకీయాలు, ముడి చమురు ధరలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. మరోవైపు రూపాయి క్షీణత కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వీటన్నింటి ప్రభావంతో నేడు(శుక్రవారం) సెన్సెక్స్ 301 పాయింట్ల మేర కుప్పకూలింది. 301 పాయింట్ల దిగజారిన సెన్సెక్స్ చివరికి 34,848 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 86 పాయింట్ల నష్టంలో 10,600కు దిగువన 10,596 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్‌లో ఎల్ అండ్ టీ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, గ్రాసిమ్‌లు టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. అటు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, ఐటీసీ, కొటక్ మహింద్రా బ్యాంకులు టాప్ గెయినర్లుగా నిలిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ సైతం 250 పాయింట్లు కిందకి పడిపోయింది. అమర రాజా బ్యాటరీస్, ఎస్ఆర్ఎఫ్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, నాల్కో, గ్రాఫైట్ ఇండియా, జెట్ ఎయిర్వేస్, ఎస్కార్ట్స్, జ్యోతి ల్యాబ్స్‌లు దాదాపు 13 శాతం వరకు క్షీణించాయి. ఇప్పటికే మండుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు వచ్చే నెలల్లో మరింత పెరుగనున్నాయని గోల్డ్‌మ్యాన్ శాచ్స్ రిపోర్టు వెల్లడించడంతో, మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుల దేశీయ కరెంట్ అకౌంట్ లోటుకు ప్రమాదకరమని ఈ గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసు దిగ్గజం వెల్లడించింది. మరోవైపు కర్ణాటక రాజకీయ పరిస్థితులు వాడివేడిగా మారుతున్నాయి. శనివారం ఫ్లోర్ టెస్ట్ ఖాయం కావడంతో మార్కెట్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రారంభం నుంచి నష్టాలు పాలవుతూ వచ్చిన మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్‌కు వచ్చేసరికి ఆ నష్టాలను మరింత పెంచుకున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా క్రాష్ అయింది. 34 పైసలు బలహీనపడి 68.04 వద్ద నమోదైంది. -
ఎమ్మెల్యేల తరలింపు.. పె...ద్ద హైడ్రామా
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే వారిని తొలుత పంజాబ్‌గానీ, కేరళగానీ తరలించాలని భావించగా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఒకానోక దశలో శరవేగంగా పరిణామాలు మారే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకుండా వారిని హైదరాబాద్ తరలించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం... యెడ్డీ ఆదేశాల తర్వాత... ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గంట తర్వాత యెడ్యూరప్ప.. పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్, షాంగ్రీ-లా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తేయాలని, భద్రత ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు. గంటల వ్యవధిలోని పోలీస్‌శాఖ ఆ ఆదేశాలను అమలు చేసింది. దీంతో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు వారిని వెంటనే రాష్ట్రం తరలించాలని ఆయా పార్టీలు ప్రణాళిక రచించాయి. కాంగ్రెస్ తరపున డీకే శివకుమార్, జేడీఎస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఎమ్మెల్యేలు వారిని ఎక్కడ దాచాలన్న దానిపై మంతనాలు జరిపారు. ఆటంకాలు... తొలుత వారిని ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా కొచ్చి(కేరళ)కు గానీ తరలించాలని అనుకున్నారు. అయితే డీజీసీఏ(Directorate General of Civil Aviation) నుంచి విమానానికి అనుమతి లభించకపోవటం, దానికి తోడు కొచ్చిలో హోటళ్లు ఖాళీగా లేవని సమాచారం రావటంతో (ఇదంతా బీజేపీ కుట్ర అన్నది వారి ఆరోపణ) తప్పనిసరై మరోచోటకు తరలించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అంతకు ముందు జేడీఎస్ సుప్రీం దేవగౌడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి.. వారి నుంచి హామీ పొందిన విషయం తెలిసిందే. దీనికితోడు పొరుగునే ఉన్న తమిళనాడు అన్నాడీకేం ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అందుకే వారి కోసం హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని భావించి ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేల తరలింపు సాగిందిలా... తమ తరలింపు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఎమ్మెల్యేలు.. దుస్తులను నేరుగా హోటళ్ల వద్దకే తెప్పించుకున్నారు. రాత్రి 11.30 ని. సమయంలో డీజీసీఏ.. ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించింది. దీంతో ఫ్లాన్ మార్చి వారిని రాష్ట్రం దాటించాలని నిర్ణయించారు. చివరకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయం తెలీకుండా జాగ్రత్త పడ్డారు. అర్ధరాత్రి 12గం.15 ని. సమయంలో శర్మ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఈగల్టన్ రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరాయి. అనంతరం షాంగ్రీ-లా హోటల్ వద్దకు చేరుకుని అక్కడ జేడీఎస్ ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బయలుదేరాయి. బస్సులు నిండిపోవటంతో మరో బస్సు(స్లీపర్) వాటికి కలిసింది. ఎమ్మెల్యేలకు భోజనం, దుప్పట్లు ఇలా పరిస్థితులు సర్దుకున్నాక ఆ మూడు బస్సులు వేగంగా ఆంధ్రా సరిహద్దు వైపు కదిలాయి. ముందస్తు జాగ్రత్తగా... అయినప్పటికీ బీజేపీ నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి సరిహద్దు వరకు పలు ప్రాంతాల్లో(గౌరీబిదనూరు, చికబళ్లాపూర్ జిల్లాలో) ముందస్తుగా కొన్ని వాహనాలను ఉంచారు. ఒకవేళ వారిని అడ్డుకునే యత్నాలు జరిగితే స్థానిక నేతల సాయంతో ఆయా వాహనాల్లో వారిని రహస్య ప్రదేశాలకు తరలించాలని భావించారు. శర్మ ట్రావెల్స్ డ్రైవర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. ఆంధ్రా బార్డర్ వరకు ఎమ్మెల్యేలు జమీర్ అహ్మద్ ఖాన్, శివరామ హెబ్బర్‌లు స్వయంగా బస్సులు నడిపినట్లు తెలుస్తోంది. కర్నూల్ మీదుగా ప్రయాణించిన వాహనాలు ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు 80 కిలోమీటర్లు దూరంలో ఆగారు. అక్కడ ఎమ్మెల్యేలు కాఫీ బ్రేక్ తీసుకున్నాక తిరిగి బయలుదేరారు. చివరకు గంటర్నర ప్రయాణం తర్వాత నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మధు యాష్కీ మాటల్లో.. ‘మా పార్టీ ఎమ్మెల్యేల తరలింపు చాలా ప్రణాళిక బద్ధంగా జరిగింది. వారికి హైదరాబాద్‌లో ఉంచటమే సురక్షితమని భావించి ఇక్కడికి రప్పించాం. అధికారం కోసం బీజేపీ దారుణంగా దిగజారింది. అందుకు ప్రధాని మోదీ మద్ధతు పలకటం దారుణం. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ను బీజేపీ కిడ్నాప్ చేసింది. ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తోంది. బీజేపీ నేతలు క్రిమినల్స్‌లాగా వ్యవహరిస్తున్నారు’ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ మండిపడ్డారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమానం నిలిపివేత
సాక్షి, బెంగళూరు: కర్టాటక కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రయాణించాల్సిన విమానాన్ని గంటలపాటు నిలిపివేసిన ఘటన రాజకీయంగా కలకలం రేపింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని శిబిరానికి వచ్చేందుకుగానూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, మాజీ సీఎం సిద్దరామయ్య, ఆరుగురు తాజా ఎమ్మెల్యేలు కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో ఆసీనులయ్యారు. కానీ.. విమానం టేకాఫ్ అయ్యేందుకు అధికారులు అనుమతించలేదు. దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యేలు, నేతలు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో కలవరం పెరిగిపోయింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే విమానాన్ని నిలిపివేశారేమోనన్న అనుమానాలు వెల్లువెత్తాయి. అందుకే బస్సుల్లో వచ్చారు..: కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం రాత్రి కూడా సరిగ్గా ఇలానే జరిగింది. ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలనుకున్నా, అందుకు ఎయిర్‌పోర్టు అధికారులు నిరాకరించడంతో చివరికి బస్సుల్లో తరలించారు. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి నేతలు శుక్రవారం బయలుదేరారు. గంటల నిరీక్షణ అనంతరం.. విమానానికి అనుమతి దొరకడంతో నేతలు హైదరాబాద్ వైపునకు ఎగిరివెళ్లారు. తాజ్‌కృష్ణలో సీఎల్పీ భేటీ: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శనివారం కర్ణాటక అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో సీఎల్పీ సమావేశం జరుగనుంది. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరమైన హైదరాబాద్ తాజ్‌కృష్ణ హోటల్లోనే సాయంత్రం 5గంటలకు సీఎల్పీ భేటీ జరగనుంది. రేపటి బలపరీక్షలో సభ్యులు అనుసరించాల్సిన విధానంపై సీనియర్లు సూచనలు చేయనున్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
-
కొచ్చికి కాంగ్రెస్-జేడిఎస్ ఎమ్మెల్యేలు
-
గోవా,మణిపూర్,బీహార్‌లపై కర్ణాటక పరిణామాల ప్రభావం
-
యడ్యూరప్ప అనే నేను...
సాక్షి, బెంగళూరు: కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత బూకనకెరె సిద్ధలింగప్ప యడ్యూరప్ప (75) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో యడ్యూరప్పతో రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే రైతు రుణమాఫీపై యడ్యూరప్ప అధికారులతో చర్చించారు. రెండ్రోజుల్లో దీనిపై తీర్మానం చేస్తామని ఆయన వెల్లడించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలన్న కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో గురువారం ఉదయం యడ్డీ ప్రమాణం చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్, జేడీఎస్ నేతల నుంచి ఆటంకం కలుగుతుందనే ముందస్తు సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజ్‌భవన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. యడ్డీ సీఎంగా బాధ్యతలు తీసుకోవటం ఇది మూడోసారి. గతంలో 2007లో నవంబర్ 12న తొలిసారిగా (వారం రోజులపాటు), రెండోసారి 2008, మే 3న మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. రెండోసారి సీఎం అయ్యాక మూడేళ్ల 10 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. రైతుల సాక్షిగా.. ప్రచారంలో తనను రైతుబంధుగా చెప్పుకున్న యడ్యూరప్ప తెల్లని సఫారీపై ఆకుపచ్చ శాలువా వేసుకుని విజయ సంకేతం చూపుతూ రాజ్‌భవన్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ యడ్డీని ఆహ్వానించారు. ‘భగవంతుడి సాక్షిగా, రైతు సాక్షిగా..’ అని ఆయన ప్రమాణం చేశారు. సాధారణంగా బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాలు ఈసారి గైర్హాజరవటం గమనార్హం. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, అనంత్‌కుమార్ సహా ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. యడ్యూరప్ప కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 104 మంది శాసనసభ్యులున్న బీజేపీ తగిన సంఖ్యాబలం సాధించాలంటే మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇప్పటికే ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ప్రకటించారు. గవర్నర్ ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా రాష్ట్ర విధానసభలో యడ్యూరప్ప బలనిరూపణ చేయాల్సి ఉంది. ఆ తరువాతే కేబినెట్ విస్తరణ చేపడతామని యడ్యూరప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎంతో ఉద్విగ్నంగా కనిపించారు. ‘విశ్వాసం’ నిలబెట్టుకుంటా ప్రమాణం తరువాత నేరుగా విధానసౌధకు వెళ్లిన యడ్డీ.. ముఖద్వారం మెట్లకు నమస్కరించి లోపలికెళ్లారు. సీఎస్ రత్నప్రభ, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అధికారులతో సమావేశం అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులందరికి రూ. లక్ష రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకుని మరో రెండు రోజుల్లో రుణమాఫీపై ప్రకటన చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని.. విశ్వాస పరీక్షలో 100% విజయం సాధిస్తామన్నారు. ‘మా ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గుతుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. గవర్నర్ అవకాశం ఇచ్చిన 15 రోజుల పాటు నేను వేచిచూడను. వీలైనంత త్వరగా మెజారిటీ నిరూపించుకుంటాను’ అని యడ్డీ పేర్కొన్నారు. ‘రిసార్టు’ భద్రత ఉపసంహరణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మకాం వేసిన బెంగళూరు బిడది సమీపంలోని ఈగల్టన్ రిసార్డు వద్ద భద్రతను ఉపసంహరించారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో తమ ఎమ్మెల్యేల భద్రతపై కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. పాత్రికేయులను రిసార్ట్ లోనికి అనుమతించటం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే అక్కడ పహారా కాస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను సంప్రదించటానికి గురువారం మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. -
కర్ణాటకలో కీలక పరిణామాలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో కీలక మార్పులు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ శిబిరాల వద్ద పోలీస్ బందోబస్తును తొలగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఈగల్టన్ రిసార్ట్ వద్ద బందోబస్తును ఎత్తివేశారు. దీంతో కాంగ్రెస్ శిబిరం వద్ద స్థానిక కార్యకర్తలు రక్షణగా ఉన్నారు. అలాగే జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్న శాంగ్రిలా హోటల్ వద్ద కూడా బందోబస్తును ఎత్తివేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొచ్చికి తరలించే యోచనలో యడ్యూరప్ప ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే బీఎస్ యడ్యూరప్ప పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా అమర్‌కుమార్ పాండేను నియమించారు. ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఐజీగా సందీప్ పాటిల్‌ను నియమించారు. -
కర్ణాటక ఎఫెక్ట్: ఇతర రాష్ట్రాల్లో ప్రకంపనలు!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొన్ని నెలల కిందట ఎన్నికల అనంతరం అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తొలుత అతిపెద్ద పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గోవా కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను డిమాండ్ చేయగా... ఆపై మణిపూర్ మాజీ సీఎం ఇబోబి సింగ్, మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మాలు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిర్ణయంపై స్పందించారు. మాజీ సీఎంలు సైతం తమ రాష్ట్ర గవర్నర్లను కలుసుకుని ఈ విషయంపై చర్చించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు మణిపూర్ గవర్నర్‌ను ఇబోబి సింగ్, మేఘాలయ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శుక్రవారం సమయం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ల ఆధ్వర్యంలో రాజధానుల వద్ద, ఇతర నేతలు జిల్లా కలెక్టరెట్ల వద్ద ధర్నా చేసి తమ నిరసన తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నేతలను ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నేతలకు లేఖలు పంపిన విషయం తెలిసిందే. కర్ణాటక అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా గవర్నర్ వజుభాయ్ వాలా నామినేట్ చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ నేత యడ్యూరప్ప బల నిరూపణ పూర్తవకుండా గవర్నర్ ఇలా ఎమ్మెల్యేను నామినేటెడ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గతేడాది మార్చిలో మణిపూర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకుగానూ కాంగ్రెస్ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 21 సీట్లు సాధించిన బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)తో పాటు ఒక లోక్ జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ బలం 32కి పెరిగింది. బీజేపీ నేత నాంగ్తోంబం బీరేన్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చింది. -
అంతవరకు ఆగలేను: యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీలో బల నిరూపణకు కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా 15 రోజులు గడువు ఇవ్వడంపై సీఎం బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడోసారి బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం బీజేపీ నేతలతో సమావేశం సందర్భంగా యెడ్డీ మాట్లాడుతూ.. బల నిరూపణకు 15 రోజులు మనకు అక్కర్లేదని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా మెజార్టీ సంఖ్యా బలం ఉందని మనం చూపించాలి. కన్నడ ప్రజలు బీజేపీకి పట్టంకడుతూ తీర్పిచ్చారని గుర్తు చేశారు. దీన్ని బట్టి బీజేపీపై వారికున్న విశ్వాసం మరోసారి రుజువైందన్నారు. బెంగళూరులో బీజేపీ నేతలను ఉద్దేశించి యడ్యూరప్ప మాట్లాడుతూ.. మేం కాంగ్రెస్-జేడీఎస్‌లను, వాళ్లు బీజేపీని నిందించుకోవడం కంటే ప్రజల తీర్పును శిరసావహించడం ఉత్తమం. ఇప్పటికే వారు ఎన్నికల్లో మాకే ఎక్కువ సీట్లు అందించారు. ఎన్నికల సందర్భంగా వారికిచ్చిన హామీలను నెరవేర్చేందుకు మనం కృషి చేయాలి. బీజేపీకి పెద్ద బాధ్యతను రాష్ట్ర ప్రజలు అప్పగించారు. అందుకే మనం సాధ్యమైనంత త్వరగా బలాన్ని నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ’ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ చేస్తున్న బ్యాక్ డోర్ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారని అనంత్ కుమార్ చెప్పారు. కాగా, 222 స్థానాలకు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు నెగ్గి మెజార్టీకి 8 సీట్ల దూరంలో నిలిచింది. కాగా, కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 స్థానాలు గెలుపొందాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిగా ఏర్పడి హెచ్డీ కుమారస్వామిని సీఎం చేయాలని చూశాయి. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి గవర్నర్ అవకాశం ఇచ్చి యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. -
మెజారీటి లేకుండా బలం ఎలా నిరూపించుకుంటారు?
-
సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్న కర్ణాటక రాజకీయం
-
‘చంద్రబాబులో ప్రవహించేది ముమ్మాటికీ ఆ రక్తమే’
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేదని ఏపీ బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిర్ణయాలపై చంద్రబాబుకు ఎందుకు అంత అనుమానమోస్తుందో అందరికీ తెలుసునన్నారు. గతంలో ఎన్నో పర్యాయాలు కేంద్రంలో బీజేపీకి మద్దతివ్వకుండా ప్రభుత్వాలు కూల్చే యత్నాలు చేసిన చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తుందని పేర్కొన్నారు. 1996లో చంద్రబాబు లాంటి నేతలు మద్దతు ఇవ్వకపోవడంతో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయ్ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు, కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ అధినేత దేవెగౌడను ప్రధానిని చేశారు. మళ్లీ కాంగ్రెస్‌తో కలిసి దేవెగౌడను పదవీచ్యుతుడిని చేసి ఐకే గుజ్రాల్‌ను ప్రధానిని చేశారు. సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘కర్ణాటక ఎన్నికల సమయంలోనూ బీజేపీని ఓడించాలని స్వయంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి, మామ ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబు సొంతం. బీజేపీని ఓడించేందుకు ఉద్యోగ సంఘాల నేతలను సైతం కర్ణాటకకు చంద్రబాబు పంపించడం నిజం కాదా. బీజేపీకి ఓటింగ్ శాతం 19 నుంచి 35కి పెరిగింది. కర్ణాటకలో బీజేపీకి 104 సీట్లొచ్చాయి. మరో 20 స్థానాలలో స్వల్ప తేడాతో ఓడిపోయాం. చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోంది. అందుకే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని యత్నాలు చేశారు. తెలుగువాళ్లు బీజేపీకి ఓట్లేయద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. కానీ తెలుగువాళ్లు ఉన్న పద్మనాభనగర్‌లో 35వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలుపొందింది. పరిపాలనను గాలికొదిలేసి కేవలం ప్రధాని నరేంద్ర మోదీని తిట్టడం పైనే చంద్రబాబు దృష్టిపెట్టడం వల్ల ఏపీలో అరాచకాలు, అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యక్తే తనకు రక్షణ కల్పించాలని ప్రజలను కోరిన సీఎం చంద్రబాబు. ప్రజల నుంచే రక్షణ ఆశించే చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ఎవరైనా ఓటేస్తారని భావిస్తున్నారా. ఇటీవల జరిగిన బోటు ప్రమాదం ఘటనే చంద్రబాబు పరిపాలనకు నిదర్శనం. పుజారి వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా టీడీపీ వ్యవహరిస్తోంది. దేశ ప్రజలంతా అభిమానించే వెంకటేశ్వరస్వామి రక్షణ భాద్యత ఎవరిది’ అంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. -
మా దయతో టీడీపీ అధికారంలోకొచ్చింది
-
మోదీ పిడికిట్లో ఎమ్మెల్యేలు..!
సాక్షి, బెంగళూరు : ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేశారు. బలనిరూపణకు గవర్నర్ యడ్యూరప్పకు 15 రోజులు సమయం ఇచ్చారు. కానీ రేపో-ఎల్లుండో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి.. మెజారిటీ నిరూపించుకుంటామని సీఎం యడ్యూరప్ప అంటున్నారు. బలపరీక్షలో బీజేపీ గెలువడం ఖాయమని ఆ పార్టీ నేతలు పేర్కొంటుండగా.. బీజేపీకి అంతసీన్ లేదని, యడ్యూరప్ప ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చట అవుతుందని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు పేర్కొంటున్నారు. తమకు 118మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, త్వరలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దీంతో బలనిరూపణ సందర్భంగా ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరగబోయే బలపరీక్ష చుట్టూ ఆసక్తి నెలకొంది. హెచ్డీ కుమారస్వామి బలపరీక్ష, ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారని, ఒక్క ఆనంద్‌సింగ్ మాత్రమే ప్రధాని నరేంద్రమోదీ పిడికిలిలో బందీ అయ్యాడని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ తెలిపారు. విధానసౌధ వద్ద కాంగ్రెస్-జేడీఎస్ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి జంప్ అయిన ముగ్గురు హైదరాబాద్ కర్ణాటక ఎమ్మెల్యేల్లో ఆనంద్‌సింగ్ ఒకరు. ఆయనతోపాటు నాగేంద్ర, రాజశేఖర పాటిల్ బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష భేటీకి డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారని, ఒక్క ఆనంద్‌సింగ్ మాత్రమే బీజేపీకి ఆకర్షితుడయ్యాడని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ అగ్రనేతలు సిద్దరామయయ్య మాట్లాడుతూ.. మొత్తం 118మంది ఎమ్మెల్యేలు (కాంగ్రెస్-జేడీఎస్ కలుపుకొని) తమ వద్ద ఉన్నారని, తమకు తగినంత మెజారిటీ లేదనే ప్రచారం తప్పు అని స్పష్టం చేశారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలంతా వందశాతం తమ వెంటే ఉన్నారని, యడ్యూరప్ప ప్రభుత్వం స్వల్పకాలంలోనే కూలిపోతోందని అన్నారు. మెజారిటీ తమకే ఉందని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ మా ఎమ్మెల్యేలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు! ఇక ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో మోదీ ప్రభుత్వ తీరుపై జేడీఎస్ నేత కుమారస్వామి నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని విమర్శించారు. ‘వారు ఈడీని ఉపయోగిస్తున్నారు. ఈడీలో నాకు వ్యతిరేకంగా కేసు ఉంది. ఆ కేసును తిరగదోడి నన్ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు. క్షమించండి.. నా ప్రయోజనాలు నేను కాపాడుకోవాలి’అని ఆనంద్ సింగ్ చెప్పినట్టు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాకు చెప్పారు. ఇదీ బీజేపీ నేతల తీరు’ అని కుమారస్వామి తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ బీజేపీ గూటికి చేరినట్టు భావిస్తున్నారు. -
కర్ణాటక గవర్నర్‌పై సుప్రీంకు రాంజెఠ్మలానీ
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక వ్యవహారంలో న్యాయపోరాటం తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. దేశంలో పేరొందిన న్యాయకోవిదుడైన సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు తాజాగా ముందుకొచ్చారు. బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ.. సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యక్తిగత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట ఆయన ఈ మేరకు పిటిషన్ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యక్తిగతంగా సవాలు చేస్తూ ఈ కేసులో వ్యక్తిగతంగా ఇంప్లీడ్ అయ్యే అవకాశం కల్పించాలని కోరారు. అయితే, శుక్రవారం ఈ విషయాన్ని సరైన బెంచ్ ముందు ప్రతిపాదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను ఆహ్వానించడాన్ని సవాలు చేస్తూ.. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని వెంటనే నిలిపేయాలని కోరుతూ ఆ పార్టీలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. అయితే, గురువారం మధ్యాహ్నం రెండు గంటలలోగా ఎమ్మెల్యేల మద్దతు లేఖను తమకు సమర్పించాలని యడ్యూరప్పను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుందని, యడ్యూరప్ప ప్రమాణస్వీకార అంశం తుది తీర్పుకు లోబడి ఉంటుందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేసినప్పటికీ.. అసెంబ్లీలో ఆయన బలనిరూపణ చేసుకునే వరకు కర్ణాటక ప్రభుత్వం విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాం జెఠ్మలానీ సైతం గవర్నర్ వజుభాయ్ వాలా నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ముఖ్యమంత్రిగా యెడ్డీ సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బీఎస్ యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. 56వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. రైతు వ్యతిరేక నిర్ణయాల కారణంగానే సిద్దరామయ్య ప్రభుత్వం ఓడిపోయిందన్న విషయాన్ని గమనించిన యడ్యూరప్ప.. సీఎంగా ప్రమాణ స్వీకారం మొదలు మొదటి నిర్ణయం వరకు రైతు అనుకూల వైఖరిని అనుసరించారు. రైతులకు సంఘీభావంగా ఆకుపచ్చ కండువా కప్పుకొని ప్రమాణం స్వీకారం చేసిన యడ్యూరప్ప.. దైవసాక్షిగా, రైతుసాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందితే రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట రైతులకు ఇచ్చిన హామీని యడ్యూరప్ప నెరవేర్చారు. ప్రస్తుతం యడ్యూరప్ప మాత్రమే సీఎంగా ప్రమాణం స్వీకరించిన సంగతి తెలిసిందే. బలనిరూపణ విషయంలో సందిగ్ధం కొనసాగుతుండటంతో మంత్రిమండలి ప్రమాణం చేయలేదు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుందుకే యెడ్డీకి గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చారు. బలనిరూపణ చేసుకున్న తర్వాత ఆయన మంత్రిమండలి కొలువుదీరే అవకాశముంది. పూర్తిస్థాయిలో మంత్రిమండలి కొలువుదీరిన తర్వాత యడ్యూరప్ప మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చునని భావిస్తున్నారు. -
కర్ణాటక: ఇక రంగంలోకి నాన్నను దింపుతా!
సాక్షి, బెంగళూరు : బీజేపీకి సాధారణ మెజారిటీ లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ నేత యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడంపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బీజేపీపై పోరాటానికి సీనియర్ రాజకీయ నేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను రంగంలోకి దింపుతున్నాయి. ఇదే విషయాన్ని జేడీఎస్ నేత, దేవెగౌడ తనయుడు కుమారస్వామి వెల్లడించారు. ‘ఈ పోరాటానికి నాయకత్వం వహించి.. అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడాల్సిందిగా మా నాన్న (హెచ్డీ దేవెగౌడ)ను కోరుతాను. బీజేపీ ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును ఆయన అందరి దృష్టికి తీసుకెళతారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు మనమంతా కలిసి సాగాల్సిన అవసరముంది’ అని కుమారస్వామి గురువారం విలేకరులతో అన్నారు. బీజేపీ సాధారణ మెజారిటీ సాధించినప్పటికీ.. యడ్యూరప్పకు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి.. గవర్నర్ వజుభాయ్ వాలా అసంబద్ధంగా ప్రవర్తించారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి మండిపడ్డారు. బీజేపీ ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తమ తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. ‘మా ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపైనే ప్రస్తుతం మేం దృష్టిపెట్టాం. బీజేపీ, ఆ పార్టీ మంత్రులు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ప్రజలు గమనించాలి. బీజేపీకి మెజారిటీ లేదు. అయినా గవర్నర్ ఇలా ఎందుకు ప్రవర్తించారు? ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు’ అని కుమారస్వామి అన్నారు. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణాన్ని వ్యతిరేకిస్తూ.. కర్ణాటక విధానసౌధ ఎదుట కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనలో జేడీఎస్ కురువృద్ధ నేత దేవెగౌడ కూడా పాల్గొన్నారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ ఆయన నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. -
అప్పుడు మోదీ తరహాలోనే.. ఇప్పుడు యెడ్డీ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్ప విధానసౌధకు వచ్చారు. ఈ సందర్భంగా విధానసౌధలోకి అడుగుపెట్టే సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. విధానసౌధ మెట్లను చేతులతో తాకి.. ప్రమాణం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత 2014 మేలో పార్లమెంటులో అడుగుపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇదే తరహాలో పార్లమెంటు మెట్లకు ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటును దేవాలయంగా అభివర్ణిస్తూ.. పార్లమెంటు మెట్లను ఆయన మొక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా విధానసౌధను ‘ప్రజాస్వామ్య దేవాలయం’గా అభివర్ణిస్తూ.. సభ మెట్లను మొక్కారు. -
దేశం విచారంలో మునిగిపోయింది!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణం చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తగినంత మెజారిటీ లేకపోయినా.. గవర్నర్ సాయంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారని మండిపడుతోంది. తాజాగా యెడ్డీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. బూటకమైన విజయంపై బీజేపీ సంబరాలు చేసుకుంటుండగా.. దేశంలో విచారంలో మునిగిపోయిందని అన్నారు. ‘బీజేపీ తగినంత సంఖ్యాబలం లేకపోయినా.. అసంబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటోంది. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఈ రోజు ఉదయం తమ బూటకమైన విజయంపై బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. కానీ దేశం ప్రజాస్వామ్యం ఓడిపోయినందుకు విచారంలో మునిగిపోయింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. The BJP’s irrational insistence that it will form a Govt. in Karnataka, even though it clearly doesn’t have the numbers, is to make a mockery of our Constitution. This morning, while the BJP celebrates its hollow victory, India will mourn the defeat of democracy. — Rahul Gandhi (@RahulGandhi) May 17, 2018 యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉందని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, ఈ విషయాన్నితాము ప్రజల్లోకి తీసుకెళుతామని ఆయన అన్నారు. -
సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం
-
ముఖ్యమంత్రిగా మూడోసారి..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో యడ్యూరప్పతో గవర్నర్ వజుభాయ్ వాలా ప్రమాణం చేయించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. యెడ్డీ ప్రమాణం అనంతరం బీజేపీ కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై.. మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలను సాధించి.. అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, మెజారిటీకి ఆ పార్టీ 8 స్థానాల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పటికీ... గవర్నర్ వజుభాయ్ వాలా మాత్రం మొదట యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు యడ్యూరప్ప గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. సుప్రీంకోర్టులో సైతం యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి లైన్‌క్లియర్ అయింది. అయితే, యడ్యూరప్పకు మెజారిటీ ఎమ్మెల్యేల బలం లేకపోయినప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి.. గవర్నర్ ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. -
లైవ్ అప్డేట్స్: పోలీసు ఉన్నతాధికారుల బదిలీ
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప నేడు (గురువారం) ప్రమాణం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ఉదయం 9 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో లైన్‌క్లియర్ అయిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.. కర్ణాటక రాజకీయ పరిణామాలకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇవి.. పోలీసు ఉన్నతాధికారుల బదిలీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే బీఎస్ యడ్యూరప్ప పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా అమర్‌కుమార్ పాండేను నియమించారు. ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఐజీగా సందీప్ పాటిల్‌ను నియమించారు. గోవాకు కర్ణాటక సెగ కర్ణాటక రాజకీయ సంక్షోభం సెగ గోవాను తాకింది. గోవా రాజ్‌భవన్ ముందు తమ ఎమ్మెల్యేలతో రేపు పరేడ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్ న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్‌ను ఎమ్మెల్యేగా నామినేట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో కాంగ్రెస్-జేడీఎస్ పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష పూర్తయ్యేంత వరకు నియామకం చేయకుండా చూడాలని కోరింది. టచ్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేలు.. పని అయిపోతోంది! అసెంబ్లీ వేదికగా జరిగే బలనిరూపణలో బీజేపీ నెగ్గి తీరుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బీ శ్రీరాములు బలపరీక్షపై స్పందించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, పని అయిపోతుందని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీల మద్దతు కోరిన కుమారస్వామి మమతా బెనర్జీ, కేసీఆర్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్‌లు కేంద్రానికి వ్యతిరేకంగా రావాలంటూ పిలుపు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలి రేపు లేదా ఎల్లుండే బలపరీక్ష..: యడ్యూరప్ప అసెంబ్లీలో బలం నిరూపించుకుంటా.. రేపు లేదా ఎల్లుండి బలపరీక్ష ఉండొచ్చు కన్నడ ప్రజల ఆశీస్సులతోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు కాంగ్రెస్, జేడీఎస్‌లు అనైతికంగా అధికారంలోకి రావాలనుకున్నాయి: యడ్యూరప్ప కర్ణాటకలో రూ.56వేల కోట్ల రైతు రుణాలు రద్దు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యడ్యూరప్ప రుణాల రద్దు ఫైలుపై తొలి సంతకం మళ్లీ రిసార్ట్‌కి చేరిన రాజకీయాలు విధాన సౌధలో ముగిసిన కాంగ్రెస్-జేడీఎస్ ధర్నా ధర్నాలో పాల్గొన్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తిరిగి రిసార్ట్‌కు చేరుకున్న కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు రాంజెఠ్మలానీ బీజేపీకి మెజారిటీ లేకపోయినప్పటికీ.. యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కేసులో.. సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఇంప్లీడ్‌కు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సరైన బెంచ్ ముందు ప్రస్తావించాలని ధర్మాసనం సూచించింది. యడ్యూరప్ప ప్రమాణానికి సుప్రీంకోర్టు ఇప్పటికే లైన్ క్లియర్ చేసింది. వ్యక్తిగత హోదాలో గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. యెడ్డీ ప్రమాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌తోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. యెడ్డీకి వ్యతిరేకంగా ప్రజాకోర్టుకు వెళుతాం: సిద్దూ ప్రస్తుతం యడ్యూరప్ప ప్రమాణ స్వీకార అంశం సుప్రీంకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉంది. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఈ విషయాన్ని చాటుతాం: మాజీ సీఎం సిద్దరామయ్య రాజ్‌భవన్‌లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం రాజ్‌భవన్‌కు చేరుకున్న యడ్యూరప్ప.. మరికాసేపట్లో 23వ సీఎంగా ప్రమాణస్వీకారం ‘వందేమాతరం, మోదీ.. మోదీ’ అంటూ రాజ్‌భవన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు నినాదాలు.. రాజ్‌భవన్ బయలుదేరిన యడ్యూరప్ప.. మరికాసేపట్లో సీఎంగా ప్రమాణం Bengaluru: BS Yeddyurappa leaves for Raj Bhavan, to take oath as Karnataka Chief Minister shortly. pic.twitter.com/gfX5kXi698 — ANI (@ANI) 17 May 2018 రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరు అయ్యారు. Bengaluru: Swearing-in ceremony of BS Yeddyurappa as the Chief Minister of Karnataka to begin shortly; Union Ministers JP Nadda, Dharmendra Pradhan and Prakash Javadekar present at Raj Bhavan #Karnataka pic.twitter.com/yV3BEj8wNL — ANI (@ANI) 17 May 2018 -
‘సంకీర్ణ ప్రయోగం’ ఫలిస్తుందా..?
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న పాతకాలం నాటి సామెతను ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ మరోసారి రుజువు చేశాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడిని నిజం చేశాయి. ఎన్నికల ప్రచారంలో, ఎన్నికలకు ముందు ఉప్పు,నిప్పు మాదిరిగా కలబడిన పార్టీలు మారిన పరిస్థితుల్లో ఒక్కసారిగా స్నేహగీతాన్ని ఆలపించాయి. మళ్లీ సంకీర్ణ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాయి. జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ సర్కార్‌ను నడిపించిన అనుభవం కాంగ్రెస్, బీజేపీలకుంది. రెండు సందర్భాల్లోనూ ఈ పార్టీలకు జూనియర్ భాగస్వామిగా ఉన్న జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాల నుంచి వైదొలిగింది. –2004 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ సీట్లు దక్కలేదు. బీజేపీకి 80 సీట్లు, కాంగ్రెస్‌కు 65, జేడీఎస్‌కు 58 సీట్లు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ధరమ్‌సింగ్ సీఎంగా కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి జేడీఎస్ నేతగా ఉన్న సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. అయితే ఈ సర్కార్ పాలన మొదటి నుంచే సజావుగా సాగలేదు. వొక్కళిగల నాయకుడు డీకే శివకుమార్‌తో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మంత్రిపదవులు ఇవ్వొద్దంటూ జేడీఎస్ అధినేత హెచ్డీ దేవగౌడ పట్టినపట్టుకు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం సిద్ధరామయ్య చేపట్టిన ‘అహిందా ర్యాలీ’లను దేవగౌడ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని లేదా అహిందాలలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలంటూ సిద్దూకు షరతు పెట్టారు. ఈ ఒత్తిళ్లకు సిద్ధరామయ్య తలొగ్గలేదు. దీంతో ఆయనను జేడీఎస్ నుంచి బహిష్కరించారు. సిద్ధరామయ్య స్థానంలో లింగాయత్‌ల నాయకుడు ఎంపీ ప్రకాష్‌ను డిప్యూటీసీఎం చేశారు. ఈ పరిస్థితిని మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న హేచ్‌డీ కుమారస్వామి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. జేడీఎస్‌లోని మెజారిటీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని చూరగొనే చర్యలు చేపట్టారు. అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. తమ పార్టీని చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ జేడీఎస్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పంచన చేరారు. దీంతో ధరమ్‌సింగ్ ప్రభుత్వం కూలిపోక తప్పలేదు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన దేవగౌడ తన కొడుకు కుమారస్వామిని పార్టీ నుంచి బహిష్కరించారు. సత్వర నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరగడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జేడీఎస్‌కు చెందిన మూడింట రెండువంతుల ఎమ్మెల్యేల మద్దతు కారణంగా కుమారస్వామి వర్గాన్నే నిజమైన జేడీఎస్‌గా స్పీకర్ గుర్తించారు. 2006లో బీజేపీ–జేడీఎస్‌ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ రెండుపార్టీలు చెరి 20 నెలలు అధికారాన్ని పంచుకోవాలనేది దీని సారాంశం. మొదట కుమారస్వామి సీఎం పదవిని చేపట్టగా బీఎస్ యడ్యూరప్ప డిప్యూటీ సీఎం అయ్యారు. సీఎంగా కుమారస్వామి చేపట్టిన ‘పల్లెనిద్ర’ కార్యక్రమం ఆయనను గ్రామీణ ప్రజానీకానికి చేరువ చేసింది. ఈ క్రమంలో కొడుకు పట్ల దేవగౌడ మెత్తబడ్డారు. మంచిపాలన అందిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించడం మొదలుపెట్టారు. బళ్లారి గనుల వ్యాపారుల నుంచి రూ. 150 కోట్లు లంచం తీసుకున్నారంటూ సీఎం కుమారస్వామిపై ఎమ్మెల్సీ గాలి జనార్దనరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత ఇవి తెరవెనక్కు వెళ్లిపోయాయి. ఇరవై నెలల సీఎం పదవీకాలం కుమారస్వామి పూర్తిచేసుకున్నాక అధికారమార్పిడి సందర్భంగా సమస్యలు తలెత్తాయి. బీజేపీకి అధికారాన్ని అప్పగించడంపై పార్టీలో వ్యతిరేకత పెరిగింది. కొద్దిరోజులు ఇదే పరిస్థితి కొనసాగడంతో గవర్నర్ శాసనసభను 33 రోజుల పాటు ‘సుప్త చేతనావస్థ’ (సస్పెండెడ్ యానిమేషన్)లో ఉంచారు. ఈ నేపథ్యంలో బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తానంటూ కుమారస్వామి ప్రకటించారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లిన యడ్యూరప్ప హుటాహుటిన బెంగళూరుకు తిరిగొచ్చి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే బలనిరూపణ సందర్భంగా జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఓటేయలేదు. దీంతో కేవలం ఏడురోజుల్లోనే సీఎంగా యడ్యూరప్ప మొదటి దఫా పాలన ముగిసింది. ఆ తర్వాత ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాక ఆ అసెంబ్లీని రద్దుచేశారు. 2008 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించడంతో యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కర్ణాటక: బీజేపీ సంచలన ఆరోపణలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నడుమ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీజేపీలో కలకలం రేపుతున్నది. మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు: జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100కోట్లు ఆఫర్ చేస్తున్నదన్న కుమారస్వామి ఆరోపణలను కొట్టిపారేసిన కాషాయదళం... ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నదని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే టార్గెట్‌గా వ్యవహారం నడుస్తున్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదులు వెళ్లాయి. బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే, జీఎం సిద్ధేశ్వర, పీసీ మోహన్‌లు ఉమ్మడిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ‘‘కర్ణాటకలో అధికార దుర్వినియోగానికి సంబంధించి మా వద్ద స్పష్టమైన కారణాలున్నాయి. చట్టవిరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకోండి..’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్దరామయ్య ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించాల్సిఉంది. కేంద్రానికి బీజేపీ ఎంపీ శోభ రాసిన లేఖ The #kannadigas mandate is clear and it favours BJP only. now they are tapping phones of @BJP4Karnataka ‘s leaders . its hard to see people can stoop this level for power. The saga of unholy nexus continues #KaranatakaVerdict pic.twitter.com/ebkTxgOlrQ — Shobha Karandlaje (@ShobhaBJP) May 16, 2018 -
గవర్నర్ హామీ ఇచ్చారు: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్- జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కోరారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన తమకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలిపారు. ఆ మేరకు ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన లేఖను వజుభాయ్కి కుమారస్వామి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ నిర్ణయం తర్వాతే తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. రాజ్యాంబద్దంగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వివరించారు. కుమారస్వామితో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర కూడా భేటీలో పాల్గొన్నారు. కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో చర్చించారు. గవర్నర్‌పై నమ్మకం ఉంది రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తమకు గవర్నర్‌పై నమ్మకం ఉందని, ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మా నుంచి ఒక్క నేత కూడా ఇతర పార్టీలోకి వెళ్లలేదు. గవర్నర్ అన్యాయం చేయరని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి భావిస్తోందని ఆయన చెప్పారు. తొలుత అడ్డగింత.. ఆపై భేటీ తొలుత రాజ్‌భవన్‌లోకి కాంగ్రెస్, జేడీఎస్ నేతలను సిబ్బంది అనుమతించకపోవడంతో కొంత సమయం అక్కడ ఉద్రిక్త చోటుచేసుకుంది. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అయితే గవర్నర్ అనుమతించాక కుమారస్వామి, పరమేశ్వర రాజ్‌భవన్‌లో ఆయనతో చర్చించారు. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. గవర్నర్‌కు లేఖను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకుంటే ధర్నా చేపడతామని తెలిపారు. న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సైతం వెనుకాడేది లేదని ఈ కూటమి నేతలు అంటున్నారు. -
కర్ణాటక: రాజ్‌భవన్ వద్ద హైడ్రామా
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమను అనుమతించకపోతే ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సిద్ధమైంది. తమ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో జేడీఎస్ నేత కుమారస్వామి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అయితే సిబ్బంది ఆ నేతలను రాజ్‌భవన్‌లోకి అనుమతించలేదు. దీంతో కుమారస్వామి, పరమేశ్వర, ఎమ్మెల్యేలు గేటు బయటే ఉండిపోయారు. దీంతో రాజ్‌భవన్ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలిసి కుమారస్వామి, పరమేశ్వర ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. అనంతరం యడ్యూరప్ప కూడా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, గవర్నర్ వజుభాయ్ ఎదుట పరేడ్ నిర్వహించాలని రెండు పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోరుతూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. తమకు మద్దతుందని, కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ వజుభాయ్‌ని కోరనున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కుమారస్వామని అనుమతించకపోతే గవర్నర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేయాలని ఈ కూటమి యోచిస్తోంది. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హక్కుందని, ఈ నేపథ్యంలో గవర్నర్ తమవైపు మొగ్గు చూపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం ఉంటే.. అవసరమైతే న్యాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్-జేడీఎస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
100కోట్లకు ఎమ్మెల్యేలు.. స్పందించిన జవదేకర్
సాక్షి, బెంగళూరు: వంద కోట్ల రూపాయలు అంటేనే ఊహించుకోవడం కష్టమని, అలాంటి నోట్ల రాజకీయాలు ఎవరు చేస్తున్నారో కర్ణాటకలో అందరికీ తెలుసునని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ నోట్ల కట్టలతో జేడీఎస్ నేతలను కొనాలని, మంత్రి పదవులంటూ వారిని ప్రలోభపెట్టాలని చూస్తోందంటూ కుమారస్వామి చేసిన ఆరోపణలపై జవదేకర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంద కోట్ల నగదు అంటే భారీ మొత్తమని, అయినా నగదుతో నేతలను మభ్యపెట్టడం కాంగ్రెస్-జేడీఎస్‌కు బాగా తెలుసునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు మేం విజ్ఞప్తి చేశాం. బీజేపీ ఎన్నటికీ నియమాలను ఉల్లంఘించదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మేం ఇప్పటికీ విశ్వసిస్తున్నాం. మరోవైపు ప్రత్యర్థి కూటమి బీజేపీపై బురద చల్లే యత్నం చేస్తోంది. వ్యాపారం చేసినట్లుగా.. నేతలను కొనడం కాంగ్రెస్‌కు బాగా తెలుసు. జేడీఎస్‌తో కూటమిపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. న్యాయమార్గాన్ని అనుసరించి గవర్నర్ అనుమతితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని’ ప్రకాష్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వాన్ని బీజేపీనా, లేక కాంగ్రెస్-జేడీఎస్‌లు ఏర్పాటు చేస్తాయా అన్న దానిపై దక్షిణాది రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రలోభాల పర్వాన్ని బీజేపీ కొనసాగిస్తుందని కాంగ్రెస్- జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి నేడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, మంత్రి పదవులు ఆఫర్ చేస్తుందని ఆరోపించారు. ‘ఆపరేషన్ కమల్’ విజయవంతమైందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమ కూటమితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. బీజేపీ తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని ఆయన హెచ్చరించారు. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు -
కర్ణాటక ఎఫెక్ట్ : రెండో రోజు నష్టాలే
ముంబై : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకుండా.. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రారంభం నుంచి నష్టాలు పాలైన బుధవారం నాటి దేశీయ మార్కెట్లు, చివరికి కూడా కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ 156 పాయింట్లు కిందకి పడిపోయి 35,388 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 61 పాయింట్లు దిగజారి 10,800 మార్కుకు కింద 10,741 వద్ద స్థిరపడింది. కన్నడ నాట ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. ఆ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠను రేపుతుండటం మార్కెట్లను మరింత ప్రభావం చేస్తోంది. నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, గెయిల్, హెచ్‌పీసీఎల్, హిందాల్కోలు ఒత్తిడిని ఎదుర్కొనగా.. ఐటీసీ, హెచ్‌యూఎల్, విప్రో, టీసీఎస్‌లు 4 శాతం మేర లాభాలు పొందాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 14 పాయింట్లు డౌనయింది. పీఎన్బీ, సిండికేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ ట్రాన్స్మిషన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, శక్తి పంప్స్ 16 శాతం మేర క్షీణించాయి. చివరిలో ఎఫ్ఎంసీజీ, ఎంపిక చేసిన టెక్నాలజీ స్టాక్స్‌లో నెలకొన్న కొనుగోళ్లు, బ్యాంకులు, రూపాయి విలువ రికవరీ, ఆయిల్ ధరలు తగ్గడం వంటి వాటితో మార్కెట్లు తన నష్టాలను కొంత మేర తగ్గించుకున్నప్పటికీ, చివరికి మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసల లాభంలో 67.82 వద్ద నమోదైంది. -
కర్నాటకం: తెరపైకి ‘ఆపరేషన్ లోటస్’!
బెంగుళూరు : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన కర్ణాటక ఎన్నిలు ముగిశాయి. అయితే ఫలితాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 104 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్ 112’ను మాత్రం చేరుకోలేకపోయింది. దాంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అంశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రెకెత్తించడమే కాకుండా కన్నడ ప్రజలకు మరోసారి 2008 నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. ‘ఆపరేషన్ లోటస్’ 2008లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే అప్పుడు కూడా సరిగ్గా ఇప్పటిలాంటి పరిస్థితే ఎదుర్కొంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్’కు మూడు సీట్లు తక్కువ పొందింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు డబ్బు, పదవి ప్రలోభాలు చూపించి తమవైపు తిప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, జేడీఎస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మేల్యేల మద్దతుతో బీఎస్ యడ్యూరప్ప నాయకత్వంలో దక్షిణాదిలో తొలిసారిగా కాషాయ ప్రభుత్వం కొలువుతీరింది. పదవి కాంక్షతో బీజేపీ అవలంభించిన ఈ విధానాన్ని ప్రతిపక్ష పార్టీలు ‘ఆపరేషన్ లోటస్’గా నామకరణం చేసి, బీజేపీ పార్టీ చర్యలను తప్పు పట్టడమే కాక ఇలా చేయడం విలువలకు విరుద్ధమని విమర్శించాయి. అయితే అప్పుడు కూడా యడ్యూరప్ప ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం గమనార్హం. ఇదిలావుంటే యడ్యూరప్ప 2013లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) పేరుతో పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యడ్యూరప్ప ‘ఆపరేషన్ లోటస్’పై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అప్పట్లో అసెంబ్లీలో బీజేపీ బలాన్ని పెంచడానికి తాను ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్టు వెల్లడించారు. 2018 పరిస్థితి.. ఇప్పుడు(2018లో) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2008 నాటి పరిస్థితులే తలెత్తాయి. ఇప్పడు కూడా బీజేపీ, కాంగ్రెకస్, జేడీఎస్‌లు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ 104 సీట్లు సాధించి సింగిల్ మెజారిటీ పార్టీగా నిలిచినప్పటికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ‘మాజిక్ ఫిగర్ 112’ను చేరుకోలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో మరోసారి ‘ఆపరేషన్ లోటస్’కు బీజేపీ తెర తీసిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. -
కర్ణాటక: ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు!
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టినట్టు వచ్చిన వార్తలను పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వర తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరైయ్యారని చెప్పారు. బీదర్ నుంచి ప్రత్యేక విమానంలో రావడం వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారని వివరించారు. కాగా, కర్ణాటక పీసీసీ కార్యాయలంలో జరిగిన పార్టీ శాసనసభా భేటీకి కొందరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. డిప్యూటీ సీఎం అడగలేదు: శివకుమార్ మరోవైపు తమ పార్టీకి చెందిన 78 మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని, ఎటువంటి ప్రలోభాలకు లొంగబోరని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి పదవి అడిగినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. తానేమీ అడిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే తమ తక్షణ ప్రాధాన్యత అని చెప్పారు. -
‘అది పచ్చి అబద్ధం.. ఆయనెవరో కూడా తెలియదు’
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. అయితే అనంతరం నెలకొన్న రాజకీయా పరిణామాలతో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై చర్చ జరగుతున్న నేపథ్యంలో భిన్న వాదనలు, వదంతులు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ కర్ణాటక ఇన్ఛార్జ్, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సీఎం అభ్యర్థి హెచ్డీ కుమారస్వామి కలిశారని ప్రచారం జరుగుతోంది. జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారన్న నేపథ్యంలో జవదేకర్‌ను తాను కలుసుకున్నానన్నది పచ్చి అబద్ధమని జేడీఎస్ నేత కుమారస్వామి చెప్పారు. బీజేపీతో సంప్రదింపులు జరిపారన్న వదంతులపై కుమారస్వామి ఘాటుగా స్పందించారు. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... ‘జవదేకర్ అంటే ఎవరు. ఆ వ్యక్తి గురించి నాకు తెలియదు. నేను ఏ జవదేకర్‌నుగానీ, బీజేపీ నేతతోగానీ ఇప్పటివరకూ భేటీ కాలేదు. బీజేపీ నేతలెవరూ నన్ను సంప్రదించలేదు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరతో సహా వెళ్లి, మేం మరోసారి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలవనున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నట్లు’ వివరించారు. కాగా, తాను తమ్ముడి వెంటే ఉన్నానని, కుమారస్వామే ముఖ్యమంత్రి అభ్యర్థి అని జేడీఎస్ నేత రేవణ్ణ స్పష్టం చేసిన విషయం విదితమే. -
బీజేపీ బలపరీక్షలో నెగ్గుతుందా?
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు బలపరీక్షలో నెగ్గుతారు? అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇటు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ, అటు కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్ వాలా ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి ఆయన మొదట అవకాశం ఇస్తారా? లేక పూర్తి మెజారిటీ తమకు ఉందని చెప్తున్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చాన్స్ ఇస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై.. యడ్యూరప్పను నాయకుడిగా ఎన్నుకుంది. యడ్యూరప్ప నాయకత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను మరోసారి కలిసి.. తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ సొంతంగా 104 స్థానాలు గెలుచుకుంది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సంఖ్యాబలం 105కు చేరుకుంది. అటు, జేడీఎస్ శాసనసభాపక్షం కూడా భేటీ అయి.. కుమారస్వామిని నాయకుడిగా ఎన్నుకుంది. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ నేతలు బుధవారం సాయంత్రంలోగా గవర్నర్‌ను కలువనున్నారు. తమకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల సంతకాలతో లేఖను గవర్నర్‌కు అందజేసి.. మొదట తమకు అవకాశం ఇవ్వాలని కోరబోతున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై.. జీ పరమేశ్వరను నాయకుడిగా ఎన్నుకుంది. జేడీఎస్‌కు మద్దతుగా నిలువాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటు బీజేపీకిగానీ, అటు జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం ఉందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీలోని 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 112. బీజేపీకి ఇప్పటివరకు అధికారికంగా 105మంది సభ్యుల మద్దతు ఉంది. ఇందులో స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ కూడా ఉన్నారు. ఆయన కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 స్థానాలు గెలుపొందాయి. మరో స్వతంత్ర ఎమ్మెల్యే ప్రస్తుతానికి వైఖరి తెలియాల్సి ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులను కలుపుకుంటే.. ఆ కూటమి బలం 116కు చేరుకుంటుంది. అలవోకగా మ్యాజిక్ ఫిగర్‌ను దాటవచ్చు. బలపరీక్షలోనూ కుమారస్వామి కూటమి గెలువవచ్చు. కానీ అసలు తిరకాసు ఇక్కడే ఉంది. బీజేపీ బేరసారాలకు పలువురు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆకర్షితమైనట్టు తెలుస్తోంది. వీరు లోపాయికారిగా బీజేపీ అనుకూలంగా పనిచేస్తారని, బీజేపీ బలపరీక్ష ఎదుర్కొంటే.. గైర్హాజరై.. ఆ పార్టీకి పరోక్షంగా సహకరిస్తారని అంటున్నారు. ఇప్పటివరకు పరిణామాలనుబట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. వారు బీజేపీ నేత శ్రీరాములు బంధువులని, గాలి జనార్దన్‌రెడ్డి సన్నిహితులని తెలుస్తోంది. అటు జేడీఎస్ శాసనసభాపక్ష భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఒకవేళ ఈ ఎనిమిది మంది సభ్యులు (కాంగ్రెస్ నుంచి ఆరుగురు.. జేడీఎస్ నుంచి ఇద్దరు) బీజేపీకి ఆకర్షితులై.. తమ పార్టీల సమావేశాలకు దూరంగా ఉంటే.. అప్పుడు బీజేపీ బలనిరూపణ నల్లేరుమీద బండినడక అవుతోంది. బీజేపీ ప్రస్తుతం సాధారణ మెజారిటీకి ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉంది. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ఫిరాయిస్తే.. బీజేపీ సులుభంగానే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని భావించవచ్చు. కానీ, క్షణక్షణానికి కర్ణాటకలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాను తలుచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలను లాక్కుంటానని కుమారస్వామి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయం.. అసెంబ్లీలో బలనిరూపణ వరకు కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా, సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. -
కర్ణాటక: అదేపనిగా ఫోన్ చేస్తున్నారు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాలు గెలుపొంది.. అతిపెద్ద పార్టీగా నిలిచిన కమలదళం.. ఎట్టిపరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు ఎరవేసి.. మంత్రి పదవులు ఆశజూపి తమవైపు లాక్కునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. బీజేపీ నేతలు తమకు అదేపనిగా ఫోన్ చేస్తున్నారని ఇటు కాంగ్రెస్, అటు జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తమకు మద్దతునిస్తే.. కేబినెట్ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ బేరసారాలు ఆడుతున్నట్టు వారు చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ రాజెగౌడ బీజేపీ బేరసారాలపై నోరువిప్పారు. ‘బీజేపీ నేతలు అదేపనిగా ఫోన్ చేస్తున్నారు. అయినా మేం ఏమీ భయపడటం లేదు. నాకు ఫోన్ చేయవద్దని వారికి స్పష్టంగా చెప్పాను. నేను నిబద్ధత కలిగిన కాంగ్రెస్ వ్యక్తిని. చాలాకాలంగా వారు నన్ను అడుగుతూ వస్తున్నారు. వారి పనే ఇది’ అని రాజెగౌడ మీడియాకు తెలిపారు. జేడీఎస్ ఎమ్మెల్యే అమరెగౌడ లింగనగౌడ పాటిల్ కూడా బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చినట్టు తెలిపారు. ‘బీజేపీ నేతల నుంచి నాకు ఫోన్ వచ్చింది. మాతో వచ్చి చేరండి మీకు మంత్రి పదవి ఇస్తామని వారు చెప్పారు. కానీ జేడీఎస్‌తోనే ఉంటాను. కుమారస్వామే మా సీఎం’ అని తెలిపారు. -
అనూహ్యంగా తెరపైకి రేవణ్ణ..!
సాక్షి, బెంగళూరు : జేడీఎస్ సీనియర్ నేత, హెచ్డీ దేవెగౌడ రెండో తనయుడు రేవణ్ణ బుధవారం అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తన తమ్ముడు కుమారస్వామిని జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నామని ఆయన స్వయంగా తెలిపారు. తద్వారా తాను బీజేపీతో చేతులు కలుపబోతున్నట్టు వస్తున్న ఊహాగానాలకు రేవణ్ణ చెక్ పెట్టారు. జేడీఎస్ఎల్పీ భేటీ తర్వాత కుమారస్వామితో కలిసి రేవణ్ణ విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ కొద్ది దూరంలో నిలిచిపోవడంతో ఇతర పార్టీల నుంచి వలసలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేవెగౌడ సొంత కుటుంబంలోని వర్గపోరును ఆసరా చేసుకొని.. రేవణ్ణను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. రేవణ్ణకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేయడం ద్వారా ఆయనను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో సులభంగా బలపరీక్ష గండాన్ని గట్టెక్కవచ్చునని బీజేపీ భావించినట్టు కథనాలు వచ్చాయి. దేవేగౌడకు నలుగురు తనయులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దేవేగౌడ మూడో కుమారుడు కుమారస్వామి. తమ్ముడు కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై రేవణ్ణకు వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరిగింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కూడా రేవణ్ణ వర్గం మద్దతు తమ పార్టీకి ఉందని గవర్నర్‌తో చెప్పినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలకు, ఊహాగానాలకు చెక్ పెడుతూ.. తాను తమ్ముడి వెంటే ఉన్నానని, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని రేవణ్ణ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్-జేడీఎస్ వెనుక ప్రియాంక గాంధీ
సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో భారతీయ జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ), జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్)లు చేతులు కలపడం వెనుక ప్రియాంక గాంధీ వాద్రా హస్తం ఉన్నట్లు రిపోర్టులు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేయాలని ప్రియాంక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పారనేది సదరు రిపోర్టు సారాంశం. కర్ణాటక ఎన్నికలకు ముందు జేడీఎస్‌తో జట్టు కట్టేందుకు రాహుల్ ససేమీరా అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో జేడీఎస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని కూడా ఆయన ఆరోపించారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోనియా ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన గులాం నబీ ఆజాద్ దేవే గౌడ, కుమారస్వామిలకు కాంగ్రెస్ ఆఫర్‌ను చెప్పి, ఒప్పించడంలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా కుమారస్వామి అభ్యర్థిత్వాన్ని బలపర్చుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడంతో ఒక్కసారిగా కన్నడనాట రాజకీయాలు వేడెక్కాయి. అయితే, 2019లో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తులకు సై అంటే పార్టీలన్నీ ప్రధానమంత్రిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనంతరం సోనియా గాంధీ తిరిగి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని రిపోర్టులో ఉంది. -
వందకోట్లు.. మంత్రి పదవి.. సంచలన వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో సాగుతున్న ప్రలోభాల పర్వంపై జేడీఎస్ అధినేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ. 100 కోట్లు, కేబినెట్ మంత్రి పదవి ఆఫర్ చేస్తుందని ఆయన తెలిపారు. బుధవారం బెంగళూరులోని ఓ హోటల్లో జరిగిన జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నారు. అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘ఆపరేషన్ కమల్’ విజయవంతమైందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. బీజేపీ తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేను లాక్కుంటే.. ఆ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కుంటామని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు తెరతీసేలా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సూచించారు. ఉత్తరాదిలో విజయవంతంగా సాగిన బీజేపీ అశ్వమేధ యాగానికి కర్ణాటకలో ఫుల్స్టాప్ పడిందని, కర్ణాటక ఫలితాలు బీజేపీ అశ్వమేధ యాగాన్ని అడ్డుకున్నాయని కుమారస్వామి వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రసక్తే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. జేడీఎస్‌లో చీలిక వస్తుందని తప్పుడు ప్రచారం చేశారని, తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రచారం వల్ల బీజేపీకి 104 స్థానాలు రాలేదని, సెక్యూలర్ ఓట్లు చీలడం వల్లే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోదీ, బీజేపీ గెలుపు కాదని అన్నారు. బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోందని, ప్రధాని మోదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని చీల్చాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. అధికార బలంతో ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని, ఐటీ దాడులు చేయిస్తూ.. వారిని ఆందోళనకు గురిచేయాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు. మరికాసేపట్లో ఆయన రాష్ట్ర గవర్నర్‌ను కలువనున్నారు. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయనకు ఇచ్చి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. బీజేపీతో టచ్‌లో ఉన్నారని భావిస్తున్న దేవెగౌడ కొడుకు రేవణ్ణ కూడా జేడీఎస్ శాసనసభాపక్ష భేటీలో పాల్గొనడం గమనార్హం. జేడీఎస్‌లో ఎలాంటి చీలిక లేదని, పార్టీ ఎల్పీ నేతగా కుమారస్వామిని ఎన్నుకున్నామని రేవణ్ణ తెలిపారు. ఇక ఈ భేటీకి ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు మాత్రం హాజరుకాలేదు. -
జేడీఎస్‌కూ ఝలక్.. ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచి.. మ్యాజిక్ ఫిగర్‌కు తొమ్మిది స్థానాల దూరంలో నిలిచిన బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా తన ఆపరేషన్ తీవ్రతరం చేసింది. ఇటు కాంగ్రెస్, అటు జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది. ఇందుకు తగినట్టు ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొడితే.. ఇటు ప్రభుత్వానికి నేతృత్వం వహించాలనుకుంటున్న జేడీఎస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామిని జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం బెంగళూరులోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజా వెంకటప్ప నాయక, వెంకటరావు నాదగౌడ గైర్హాజరయ్యారు. వీరు రాకపోవడంపై జేడీఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ ఆకర్షణకు లోనై ఈ ఎమ్మెల్యేలు జేడీఎస్ఎల్పీ భేటీకి దూరంగా ఉన్నారా? అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. -
షాక్: ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరు..!
సాక్షి, బెంగళూరు : నగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశానికి సంబంధించి షాకింగ్ సమాచారం అందుతోంది. కర్ణాటక పీసీసీ కార్యాయలంలో జరిగిన పార్టీ శాసనసభా భేటీకి మొత్తం ఎమ్మెల్యేలు హాజరు కాలేదని తెలుస్తోంది. మొత్తం ఆరుగురు శాసనసభ్యులు ఈ భేటీ గైర్హాజరైనట్టు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 78 సీట్లను గెలుపొంది... రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే, 78మంది శాసనసభ్యుల్లో 72మంది మాత్రమే ఇప్పటివరకు సమావేశానికి వచ్చారు. మరీ ఈ భేటీకి దూరంగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల వైఖరి ఏమై ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరినట్టు అనుమానిస్తున్నారు. మిగతా ముగ్గురు ఎందుకు గైర్హాజరయ్యారనేది పార్టీ నేతలు చెప్పడం లేదు. వీరిలో చాలామంది బీజేపీ గూటికి చేరారంటూ వస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. టచ్‌లోని లేని ముగ్గురు ఎమ్మెల్యేలు! జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతున్న కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో నిర్వహించిన ఈ సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి హైదరాబాద్ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్, నాగేంద్ర, రాజశేఖర పాటిల్ గైర్హాజరయ్యారు. వీరు కనీసం అధిష్టానంతో టచ్‌లో కూడా లేకపోవడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఆనందసింగ్, నాగేంద్ర గాలి జనార్దన్‌రెడ్డి సోదరులకు సన్నిహితులు అని తెలుస్తోంది. బీజేపీ నేత శ్రీరాములుకు వీరు బంధువులు కావడంతో.. ఆయన దగ్గరు ఈ ఇద్దరు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఐదుగురు లింగాయత్ ఎమ్మెల్యేలు బీజేపీ నేత యడ్యూరప్పతో రహస్యంగా మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతుండటం పార్టీని ఆందోళనపరుస్తోంది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ మైండ్‌గేమ్ ఆడుతోందని, అనైతిక చర్యల ద్వారా ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ అధిష్టాన దూత గులాంనబీ ఆజాద్ మండిపడ్డారు. బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడినా.. తమ ఎమ్మెల్యేలపై విశ్వాసముందని, ఎవరూ బీజేపీ గూటికి చేరబోరని ఆయన చెప్పారు. జేడీఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వైపు తమ ఎమ్మెల్యేలు ఆకర్షితం కాకుండా కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. బెంగళూరులోని ఈగల్టన్ హోటల్లో 150 గదులు బుక్ చేసి.. తమ ఎమ్మెల్యేలను అక్కడికి తరలించాలని భావిస్తోంది. -
రేపు మధ్యాహ్నం ప్రమాణం చేస్తా : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు. ప్రమాణస్వీకారం కోసం బీజేపీ ఇప్పటికే ఏర్పాట్లను సైతం పూర్తి చేసినట్లు తెలిసింది. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం యడ్యూరప్ప ఎమ్మెల్యేలతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌కు లేఖను సమర్పించిన విషయం తెలిసిందే. మరో వైపు ఒక స్వతంత్ర అభ్యర్థి బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం అధికారికంగా 105కు చేరుకుంది. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కోసం బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. ఈలోగా యడ్యూరప్ప తరచూ సంచలన ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లలో గుబులు పుట్టిస్తున్నారు. -
కర్ణాటకలో రాజకీయ కాక : కేరళ కూల్ ట్వీట్
తిరువనంతపురం : అసలకే వేసవి తాపం, ఆపై కర్ణాటక ఎన్నికల ఫలితాలు. రాజకీయ నేతల్లో మరింత వేడిమి రాజుకుంది. ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠను రేపిన ఈ ఫలితాలు, చివరికి ఎవరికీ స్పష్టమైన మెజార్టీని అందించకుండా మరింత కాకను పుట్టించాయి. దీంతో కాంగ్రెస్, జేడీయూలు కలిసి పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని బీజేపీ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కోరింది. దీంతో కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేయకుండా గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించాలని జేడీఎస్ వ్యూహాం రచిస్తోంది. కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలిస్తోంది. ఈ రాజకీయ సమీకరణాలతో కర్ణాటక కాక పుట్టిస్తుంటే, దాని పక్కనే ఉన్న రాష్ట్రం కేరళ కర్ణాటక రాజకీయ నేతలకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. సాక్షాత్తూ దేవుళ్ల సొంత రాష్ట్రమైన కేరళ రిసార్ట్స్‌లో బస చేసి సేద తీరండని ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటనతో గెలిచిన ఎమ్మెల్యేలకు బసతో పాటు తన వ్యాపార లబ్దిని చూసుకుంటోంది. తమ వద్ద అత్యంత సురక్షితమైన, అద్భుతమైన రిసార్ట్స్ ఉన్నాయని, ఎమ్మెల్యేలు ఇక్కడికి రావొచ్చని కేరళ టూరిజం ట్వీట్ చేసింది. ఇక్కడికి వచ్చి రాజకీయ గేమ్ ఆడుకోవాల్సిందిగా కూడా అంటోంది. కర్ణాటక రాజకీయ నేతలకు కేరళ టూరిజం ప్రకటించిన ఈ వినూత్న ఆఫర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. కేరళం టూరిజం చేసిన ఈ ట్వీట్ ట్విటర్ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాల సందర్భంగా చూసిన బెస్ట్ ట్వీట్ ఇదే అంటూ ఓ ట్విటర్ యూజర్ కామెంట్ పెట్టారు. గాడ్స్ ఓన్ ట్వీట్‌గా మరో యూజర్ కామెంట్ పెట్టారు. ఇలా కేరళ టూరిజం ట్వీట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. After the rough and tumble of the #KarnatakaVerdict, we invite all the MLAs to unwind at the safe & beautiful resorts of God's Own Country. #ComeOutAndPlay pic.twitter.com/BthNZQSLCC — Kerala Tourism (@KeralaTourism) May 15, 2018 Gods own tweet. — Movies Dialogues (@MoviesDialogues) May 15, 2018 Award for this 🙏 u guys rock. — Sweekruth B.P (@SweekruthBP) May 15, 2018 -
ఇద్దరికీ అపాయింట్మెంట్.. ఎటూతేల్చని గవర్నర్
సాక్షి, బెంగళూరు: ఒకవైపు అతిపెద్ద పార్టీ.. రెండోవైపు అత్యధికమంది సభ్యులున్న కూటమి.. నిర్ణయాధికారి గవర్నర్ కోర్టులో బంతి! ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ రాజ్‌భవన్ తలుపుతట్టిన ఇరు పక్షాలతోనూ కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా సాదరంగా ఆహ్వానించారు. నాయకులు చెప్పిన విషయాలను సావధానంగా ఆలకించారు. అయితే, అవకాశం ఎవరికి కలిపించాలనేదానిపై మాత్రం ఎటూతేల్చలేదు. ఉత్కంఠ నడుమ‘‘రెండు రోజుల్లోనే గవర్నర్ సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారు..’’ అని రాజ్‌భవన్ వర్గాల నుంచి సమాచారం అందింది. జోరుగా క్యాంప్ రాజకీయాలు: ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ ఆహ్వానించని గవర్నర్... అందుకు రెండు రోజుల గడువు కోరడంతో క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ... ప్రత్యర్థి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీకలకు భారీ ప్రయత్నాలు సాగిస్తున్నది. దీంతో అప్రమత్తమైన కుమారస్వామి.. తన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించే పనిలో పడ్డారు. ఇటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(104) అతిపెద్ద పార్టీగా నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లోని కాంగ్రెస్(78), జేడీఎస్(38)లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చాయి. ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఈ కూటమికే మద్దతుపలుకుతుండటం గమనార్హం. -
గవర్నర్‌తో జేడీఎస్-కాంగ్రెస్ బృందం భేటీ
సాక్షి, బెగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని జేడీఎస్-కాంగ్రెస్‌లు గవర్నర్ చెప్పాయి. కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్-కాంగ్రెస్ సభ్యుల బృందం మంగళవారం సాయంత్రం గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను మర్యాదపూర్వకంగా కలిసింది. భేటీ అనంతరం రాజ్‌భవన్ వద్ద నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘జేడీఎస్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న విషయాన్ని గవర్నర్‌కు స్పష్టం చేశామని, సంబంధిత తీర్మానాలు కూడా సమర్పించామని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర చెప్పారు. ‘కుమారస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నది. ఆయనను(స్వామిని) ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరాం. ఏ విషయమైంది రెండు రోజుల్లో చెబుతానని గవర్నర్ అన్నారు’’ అని సిద్దరామయ్య తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల్లో మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ తదితరులున్నారు. -
గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప బృందం
సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన బీజేపీ అభ్యర్థనను గవర్నర్ స్వీకరించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం మాత్రం పలకకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం బయటికొచ్చిన యడ్యూరప్ప బృందం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. నూటికి నూరు శాతం బలాన్ని నిరూపించుకుంటాం’’ అని చెప్పారు. యడ్యూరప్పతోకలిసి గవర్నర్‌ను కలిసిన వారిలో కేంద్ర మంత్రి అనంతకుమార్, బీజేపీ నేతలు శ్రీరాములు తదితరులు ఉన్నారు. తొలుత బీజేపీ నేతలను కలిసిన గవర్నర్.. తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ నేతలకు టైమిచ్చారు. -
బీజేపీ ఎదురుదాడి.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో దూసుకుపోతోన్న జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నాలు ముమ్మరం చేసింది. నిమిషనిమిషానికి పరిణామాలు మారుతున్నవేళ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హుటాహుటిన బెంగళూరుకు పయనమయ్యారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నైతిక హక్కు లేదన్న బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప.. అతి పెద్ద పార్టీ అయిన తమకే గవర్నర్ అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో షా రాక ప్రాధాన్యం సంతరించుకుంది. షా వెంట కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా బెంగళూరుకు వస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 112కు కేవలం 8 సీట్ల దూరంలో ఉన్న బీజేపీ... ప్రత్యర్థి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీలికలకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అవసరమైన వ్యూహరచనతోపాటు అమలును కూడా స్వయంగా పర్యవేక్షించేందుకే బీజేపీ చీఫ్ అమిత్ షా బెంగళూరుకు వస్తున్నట్లు వినికిడి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని జేడీయూ-కాంగ్రెస్ కూటమి కోరుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎవరికి అవకాశమిస్తారన్నది కీలకంగా మారింది. -
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయం రసవత్తర మలుపులు తిరుతుగుతున్నది. మోదీ ప్రధాని అయిన తర్వాత తొలిసారి దక్షిణాదిలో పాగా వేయాలనుకున్న బీజేపీకి కాంగ్రెస్ ఊహించని షాకిచ్చింది. 38 స్థానాలను గెలుచుకున్న జనతాదళ్(సెక్యూలర్) పార్టీ.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు కర్ణాటక గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతూ జేడీఎస్ అధినేత కుమారస్వామి మంగళవారం సాయంత్రం లేఖ రాశారు. ‘‘సార్.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి టైమ్ ఇస్తే మిమ్మల్ని కలుస్తాను. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో మీరు టైమిస్తారని ఆశిస్తున్నాను’ అని కుమారస్వామి లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్ 38, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని జేడీయూ-కాంగ్రెస్ కూటమి కోరుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. -
కర్ణాటక రాజ్‌భవన్ వద్ద మారిన సీన్
సాక్షి, బెంగళూరు: గార్డెన్ సిటీ నడిమధ్యలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. అటు కాంగ్రెస్-జేడీయూల కూటమి, ఇటు బీజేపీ.. ఇద్దరూ గవర్నర్ అపాయింట్మెంట్ను కోరారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప డిమాండ్ చేయగా... ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని కాంగ్రెస్-జేడీయూ నేతలు కోరుతున్నారు. ఈ పరస్పర విరుద్ధప్రకటనల నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం దాకా రాజ్‌భవన్ వద్ద సాధారణపరిస్థితులే ఉన్నా.. సాయంత్రానికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇరు వర్గాల అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠనెలకొంది. సిద్దరామయ్య రాజీనామా చేయడానికి వెళ్లినప్పుడు కూడా ఆయన కారును మాత్రమే లోనికి అనుమతించి, మిగతావాటిని రాజ్‌భవన్ గేటు బయటే నిలిపేయడం గమనార్హం. -
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌కు గవర్నర్ షాక్
సాక్షి, బెంగళూరు: ప్రభుత్వ ఏర్పాటుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీనేతలు ఒకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్ణీత గడువుకు కంటే ముందే కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాను కలుసుకోవడానికి వెళ్లిన పీసీసీ చీఫ్ పరమేశ్వరకు చేదు అనుభవం ఎదురైంది. మద్దతుదారుల జాబితాతో వెళ్లిన ఆయనకు.. రాజ్‌భవన్‌లోకి అనుమతి లభించలేదు. దీంతో ఆయన కంగుతిన్నారు. చాలాసేపు అక్కడే వేచిచూసిన పరమేశ్వర.. చివరికి గవర్నర్ సందేశంతో వెనుదిరిగారు. ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడనందున ఇప్పుడప్పుడే తాను ఎవరినీ కలవబోనని గవర్నర్ స్పష్టం చేసినట్లు సమాచారం. వాస్తవానికి జేడీఎస్-కాంగ్రెస్ నేతల బృందంతో సాయంత్రం 5 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది. కానీ ఆ సమయం కంటే ముందే వజుభాయ్‌ని కలిసేందుకు పరమేశ్వర చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ : సెన్సెక్స్ ర్యాలీకి బ్రేక్
ముంబై : దక్షిణాది రాష్ట్రంలో అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. తొలుత బీజేపీ మేజిక్ మార్కు దిశగా దూసుకుపోతున్న తరుణంలో మార్కెట్లు ర్యాలీని కొనసాగించగా.. చివరికి జేడీ(ఎస్), కాంగ్రెస్ కలిసి పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకునే సరికి మార్కెట్లు ఢమాల్‌మన్నాయి. మధ్యాహ్నం సమయానికి వచ్చే సరికి కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారడంతో, మార్కెట్లలో కూడా అమ్మకాలు చోటు చేసుకుని, తమ లాభాలన్నింటిన్నీ కోల్పోయాయి. సెన్సెక్స్ మధ్యాహ్న ట్రేడింగ్‌లో దాదాపు 400 పాయింట్ల మేర లాభాలను పోగొట్టుకుంది. సెన్సెక్స్ చివరికి 13 పాయింట్ల నష్టంలో 35,543 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంలో 10,801 వద్ద ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఇంట్రాడే హైగా 35,993.53 మార్కును తాకింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజార్టీకి కాస్త దూరంలోనే ఆగిపోయింది. దీంతో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తీవ్ర అప్రమత్తతో వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆరంభ లాభాలను పూర్తిగా కోల్పోయిన స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ సైతం 179 పాయింట్లు డౌన్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా భారీగా రూ.13,417 కోట్ల మేర క్యూ 4 నష్టాలను ప్రకటించగా.. ఈ బ్యాంకు షేర్ కూడా 6 శాతానికి పైగా క్షీణించింది. లుపిన్ షేర్ కూడా ఫలితాల ప్రకటనతో కిందకి పడిపోయింది. కర్ణాటక బ్యాంకు, జెట్ ఎయిర్వేస్, దేనా బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, పీటీసీ ఇండియా ఫైనాన్సియల్ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, ఇండియాబుల్స్ రియల్, ఎన్సీసీ, బాలాజి టెలిఫిల్మ్స్, బజాజ్ హిందూస్తాన్, కేఈసీ ఇంటర్నేషనల్, జేకే పేపర్, టాటా గ్లోబల్ బెవరేజస్లు కూడా 10 శాతం మేర డౌన్ అయ్యాయి. కర్ణాటక రాజకీయ సమీకరణాలు రూపాయిపై కూడా ప్రభావం చూపాయి. ఫ్లాట్‌గా ట్రేడైన డాలర్‌తో రూపాయి మారకం విలువ మధ్నాహ్నం ట్రేడింగ్‌కు వచ్చేసరికి 37 పైసలు డౌన్ అయింది. చివరికి 38 పైసల నష్టంలో 67.89 గా నమోదైంది. -
సిద్దరామయ్య రాజీనామా..
సాక్షి, బెంగళూరు: ఎన్నికల ఫలితాల దరిమిలా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారు. మంగళవారం సాయంత్రమే రాజ్‌భవన్‌కు వెళ్లనున్న ఆయన.. గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలాకు రాజీనామా లేఖను అందజేస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు సిద్ధరామయ్యను ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరేఅవకాశంఉంది. సరిగ్గా ఐదేళ్లు: కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా 2013, మే13న ప్రమాణం చేసిన సిద్దరామయ్య.. ఐదేళ్లపాటు(2018, మే15 వరకు) పదవిలో కొనసాగారు. తాజా ఎన్నికల్లో చాముండేశ్వరి, బదామి స్థానాల నుంచి బరిలో నిలవగా... బదామిలో మాత్రమే గెలుపొందారు. ఫలితాలపై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజా తీర్పును గౌరవిస్తామ’’ని సిద్దూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల ప్రభుత్వం?: కర్ణాటకలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సంసిద్ధులయ్యాయి. ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు ఫలవంతం అయ్యాయని కాంగ్రెస్ జాతీయ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. ఫలితాల్లో బీజేపీకి 104 స్థానాలు, కాంగ్రెస్ 77, జేడీఎస్ 39, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు ఇద్దరూ గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన దరిమిలా ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతున్నది.... -
కర్ణాటక: వజుభాయ్ నిర్ణయమే కీలకం
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో చివరికి హంగ్ ఏర్పడింది. ఏ ఒక్క పార్టీ పూర్తిమెజారిటీ సాధించకపోగా, బీజేపీ(104సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్(77), జేడీఎస్(40), ఇతరులు(2) స్థానాలను కైవసం చేసుకున్నారు. గత పరిణామాల నేపథ్యంలో ముందే మేలుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి చక్రంతిప్పే ప్రయత్నం చేసింది. జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా వ్యూహాలు అమలుచేసింది. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. జేడీఎస్ కురువృద్ధుడు దేవేగౌడకు ఫోన్‌చేసి కలిసిపనిచేద్దామని కోరారు. ఇందుకు గౌడ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇరుపార్టీల నేతలు కలిసి మంగళవారం సాయంత్రమే గవర్నర్‌ను కలవనున్నారు. గవర్నర్ విజుభాయ్ ఏం చేస్తారో?: హంగ్ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనేదానిపై కర్ణాటక గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. గుజరాత్‌కు చెందిన వజుభాయ్.. బీజేపీ ఎమ్మెల్యేగా బహుకాలం సేవలందించారు. 2014లో కేంద్రం ఆయనను కర్ణాటక గవర్నర్‌గా పంపింది. సాధారణంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రివాజుగా వస్తున్నప్పటికీ.. ఆ సంఖ్య కంటే ‘కాంగ్రెస్-జేడీఎస్’ కూటమి స్థానాలు ఎక్కువ కావడంతో గవర్నర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, తాము పెద్ద పార్టీగా ఏర్పడిన పక్షంలో.. ఒకవేళ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహా ప్రకటన చేస్తే ఏమినటే ప్రశ్న ఉత్పన్నంకాకమానదు. మీడియా సమావేశాలు రద్దు: ఫలితాల ట్రెండ్స్ తొలి దశలో బీజేపీ గెలుస్తోందన్నట్లు రావడంతో ఆ పార్టీ కార్యాలయాల్లో సందడివాతావరణం కనిపించింది. తీరా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడేటప్పటికి సీన్ రివర్స్ అయింది. దీంతో మీడియా సమావేశం నిర్వహించాలనుకున్న బీజేపీ పెద్దలు.. అనూహ్యంగా దానిని రద్దుచేసుకున్నారు. ఫలితాలపై స్పందించేందుకు కాంగ్రెస్ కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించాలనుకుంది. కానీ పొత్తుకు జేడీఎస్ అంగీకరించడంతో చివరినిమిషంలో ప్రెస్‌మీట్ రద్దుచేసుకుంది.