మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో సాధారణ మెజారిటీ(112 సీట్లు) రాకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించింది? అలా చేయడం ప్రజాస్వామ్యాన్ని, ఓటరు తీర్పును అవమానించడం కాదా? అన్న ప్రశ్నలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సవివరంగా సమాధానమిచ్చారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా?: ‘‘చాలా మంది అడుగుతున్నారు.. బలం లేకపోయినా మీరు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెలా వచ్చారు? అని. నిజమే, మరి ఏ పార్టీకి బలం రాలేదు కాబట్టి కర్ణాటకలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా? అలా చేస్తే ప్రజా తీర్పును గౌరవించినట్లవుతుందా? అతిపెద్ద పార్టీగా అవతరించిది కాబట్టే బీజేపీకి మొదటి అవకాశం లభించింది. నిజానికి కర్ణాటక ప్రజలు ఇచ్చింది అయోమయ తీర్పు కాదు. సుస్పష్టంగా కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు. కాబట్టే, ప్రజా తీర్పును గౌరవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాం. ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రుల్లో చాలా మంది ఓడిపోయారు. ముఖ్యమంత్రి కూడా ఒక స్థానంలో ఓడిపోయి, రెండో స్థానంలో బొటాబొటి మెజారిటీతో గెలిచారు. జేడీఎస్ సైతం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంతోనే 38 సీట్లు గెలుచుకుంది. ఎక్కడిక్కడ ఓటర్లు కాంగ్రెస్ వ్యతిరేకులనే గెలిపించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ వ్యతిరేక తీర్పు కాబట్టే.. అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంది.
కోర్టుకు అబద్ధాలు చెప్పారు: కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో గెలిచిన జేడీఎస్.. తిరిగి అదే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం ముమ్మాటికీ అపవిత్రచర్యే. అధికారం కోసం విలువలు, సిద్ధాంతాలు వదిలేసిన ఆ రెండు పార్టీలను కన్నడజనం అసహ్యించుకుంటున్నారు. ఈ అపవిత్రపొత్తుతో అక్కడి జనం సంతోషంగాలేరు. యడ్యూరప్ప బలనిరూపణ కోసం ఏడు రోజులు గడువు అడిగారని, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నిస్తున్నారని తీర్పును ప్రభావితం చేసేలా వాళ్లు కోర్టుకు అబద్ధాలు చెప్పారు’’ అని అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్ సంబురాలపై సెటైర్లు: కర్ణాటకలో కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకోవడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘ఏం సాధించారని వీళ్లు సంబురాలు చేసుకుంటున్నారు? ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకా, దొంగ ఓట్లు, నకిలీ ఐడీకార్డులు సృష్టించినందుకా, కులం, మతం ప్రాతిపదికన జనాన్ని చీల్చేందుకు ప్రయత్నించినందుకా, 122 సీట్ల నుంచి 78 సీట్లకు దిగజారినందుకా, ముఖ్యమంత్రి ఒక స్థానంలో చిత్తుగా ఓడిపోయినందుకా లేక జేడీఎస్‌తో అపవిత్రపొత్తు పెట్టుకున్నందుకా? ఎందుకు వాళ్లు జరుపుకొంటున్నారో అర్థంకావడంలేదు. కర్ణాటక ప్రజలు బీజేపీని మాత్రమే ఆశీర్వదించారు. అందుకే 40 స్థానాల నుంచి 107 స్థానాలకు ఎదిగాం..’’ అని అమిత్ షా పేర్కొన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ నెల 23న కొలువుదీరనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment